ఆ 7 సీట్లలో ఉత్కంఠ

ఆ 7 సీట్లలో ఉత్కంఠ
  • చేవెళ్ల, మహబూబ్​నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, వరంగల్, 
  • సికింద్రాబాద్​లో కాంగ్రెస్, కమలం హోరాహోరీ.. గెలుపుపై జోరుగా బెట్టింగులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ముగిసి వారం దాటినా.. ఏడు నియోజకవర్గాల్లో ఓటరు నాడీ మాత్రం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. స్టేట్ లో మొత్తం 17 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరగ్గా.. ఇందులో చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాద్, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ స్థానాల్లో పోలింగ్ సరళి ఎవరికీ అర్థం కావట్లేదు. మిగతా 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీకి కొంత మొగ్గు ఉన్నట్టు స్పష్టమవుతున్నా.. ఈ ఏడు సెగ్మెంట్లలో మాత్రం కాంగ్రెస్, కమలం హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, ఇందులో గెలుపు కాంగ్రెస్ దా? కమలానిదా? అంటే ఎటూ చెప్పలేని ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్  ఓట్లు ఎటువైపు మళ్లాయో తెలియడం లేదు. గెలుపు మాదే అని రెండింటిలో ఏ పార్టీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి.

చేవెళ్లలో కాంగ్రెస్, బీఆర్​ఎస్ మధ్య హోరాహోరీ

చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. అర్బన్ లో బీజేపీకి మొగ్గు ఉందని ఆ పార్టీ ధీమాగా ఉండగా.. రూరల్ ఓటర్లు కాంగ్రెస్ కు మొగ్గు చూపినట్టు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఓటు ఎటువైపు మళ్లిందనే అంశంపైనా చర్చ సాగుతోంది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిదనేది చెప్పడం అంత ఈజీగా లేదని రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. 

భువనగిరిపై సీఎం, కోమటిరెడ్డి బ్రదర్స్​​ ఫోకస్​

భువనగిరిలో బీజేపీ తరఫున మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలవడంతో ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. నర్సయ్య గౌడ్​కు బీసీ వర్గాల మద్దతు ఉన్నట్టు బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. చామలకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విస్తృత ప్రచారం చేయడం, సీఎం రేవంత్ కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో గెలుపు ఎవరిదనేది అంతుచిక్కడం లేదు.

జహీరాబాద్​లో ఇద్దరు మాజీ ఎంపీల మధ్య పోటీ

జహీరాబాద్​లో బీజేపీ నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ తరఫున సురేశ్ షెట్కార్ పోటీ పడ్డారు. ఈ సెగ్మెంట్​లో ఈ ఇద్దరూ ఎంపీలుగా పనిచేయడం.. ఆ ప్రాంతంపై ఇద్దరికీ పట్టు ఉండడంతో ఇద్దరు మాజీ ఎంపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. రెండు జాతీయ పార్టీలు కూడా అక్కడ తీవ్ర ప్రభావం చూపడంతో గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది.

వరంగల్​లో అనుభవజ్ఞులకు పరీక్ష

వరంగల్​లో స్టేషన్​ ఘన్​పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బరిలో నిలిచారు. అయితే, కడియం శ్రీహరికి ఉన్న రాజకీయ అనుభవానికి తోడు కాంగ్రెస్ బలం కావ్య గెలుపునకు కలిసి వస్తుందని హస్తం పార్టీ భావిస్తోంది. మోదీ ప్రభావానికి తోడు రమేశ్ గతంలో ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడంతో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్​లో గెలుపు అనుభవజ్ఞులైన కడియం, రమేశ్​కు పరీక్షగా మారింది.

సికింద్రాబాద్ ​సెగ్మెంట్​లో ఉత్కంఠ 

సికింద్రాబాద్​లో  పోరు ఉత్కంఠను రేపుతోంది. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పద్మారావు పోటీ చేశారు. ముగ్గురూ రాజకీయంగా బలమైన నేతలే కావడంతో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే త్రిముఖ పోరు సాగింది. అయితే, రెండు జాతీయ పార్టీల ప్రభావమే పోలింగ్ సందర్భంగా బాగా పని చేయడంతో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో ఇక్కడ ఈ రెండు పార్టీల్లో గెలుపు ఎవరిదనేది అంతు చిక్కడం లేదు.

మెదక్​లో త్రిముఖ పోరు

మెదక్​లో త్రిముఖ పోరు సాగిందనే చర్చ సాగుతోంది. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేశారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ రెండు పార్టీల ప్రభావం ఈ నియోజకవర్గ ఓటర్లపై కనిపించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ తరఫున బలమైన అభ్యర్థి వెంకట్రామి రెడ్డి కూడా బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కానీ, ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది అంతు చిక్కడం లేదు.  

సీఎం సొంత సెగ్మెంట్ మహబూబ్​నగర్​లో సస్పెన్స్  

మహబూబ్​నగర్​లో​  బీజేపీ తరఫున డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి నువ్వా.. నేనా అన్నట్టు తలపడ్డారు. అరుణ గెలిస్తే మోదీ సర్కార్ లో కీలకంగా ఉంటారని ప్రచారం సాగడం, సీఎం రేవంత్ సొంత నియోజకవర్గంలో వంశీని గెలిపించాలని కాంగ్రెస్ కోరడంతో ఈ సెగ్మెంట్​ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనేది సస్పెన్స్​గా మారింది.

పోటాపోటీగా బెట్టింగ్​లు 

ఈ ఏడు నియోజకవర్గాల్లో ఓటరు తీర్పు ఎవరికీ అంతు చిక్కకపోవడంతో రెండు పార్టీల క్యాడర్, అభిమానులు, ఎవరికి వారే పోటాపోటీగా బెట్టింగ్ లు కట్టారు. మా పార్టీదే గెలుపని కమలం క్యాడర్.. కాంగ్రెస్ దే గెలుపని హస్తం క్యాడర్ ఎవరి స్థాయిలో వారు పెద్ద మొత్తంలో పందేలు కాశారు. రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న పలువురు వ్యాపారులు, రియల్టర్లు, బిల్డర్లు సైతం ఈ సెగ్మెంట్లలో పెద్ద మొత్తంలో బెట్టింగ్ కట్టారు.