
Gensol Engineering: నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సెలవులో ఉన్నాయి. అయితే గడచిన రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్న అంశం జెన్సోల్ ఇంజనీరింగ్. ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం తమ జీవితకాల గరిష్ఠం నుంచి 90 శాతం దిగువకు పడిపోయాయి. పైగా ప్రమోటర్లను సెబీ తప్పించటంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కూడా రాజీమానా చేశారు. ఈ పరిస్థితుల్లో వేల మంది జెన్సోల్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి, వారి డబ్బు తరిగి వస్తుందా రాదా లేక ఆశలు వదులుకోవాల్సిందేనా అనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
ఇన్వెస్టర్ల నుంచి అనేక మార్లు వందల కోట్లలో డబ్బులు సేకరించిన జెన్సోల్ వ్యవస్థాపక సోదరలు అన్మోల్, పునీత్ జగ్గీలు ఆ డబ్బును భారీగా పక్కదారి పట్టించారని వెల్లడైంది. కంపెనీలో అక్రమాలపై ఆరోపణలతో రంగంలోకి దిగిన సెబీ దర్యాప్తులో లగ్జరీ జీవితం, హంగులకు డబ్బు ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ సమయంలోనే ఎన్ఎస్ఈ అధికారి అసలు జెన్సోల్ కంపెనీ పనితీరు గురించి కనుగొన్న అంశాలు ఇన్వెస్టర్లకు మతిపోగొడుతున్నాయి.
కంపెనీ కొత్తగా 30వేల ఈవీ కార్ల కోసం ఆర్డర్ చేసినట్లు జనవరిలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కోరగా.. అవి కేవలం ఎంవోయూలు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. దాదాపు 6 సంస్థలతో 29వేల కార్ల కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఇందులో వాటి కొనుగోలుకు సంబంధించిన ధర, డెలివరీ షెడ్యూల్ వంటి వివరాలు లేకుండా కేవలం కొనాలనుకుంటున్నట్లు మాత్రమే రాసి ఉండటంలో తప్పుడు సంకేతాలను ఎన్ఎస్ఈ అధికారులకు అనుమానాలను కలిగించాయి.
దీంతో ఏప్రిల్ 9న ఎన్ఎస్ఈ అధికారులు పూణే చకేన్ ప్రాంతంలోని జెన్సోల్ ప్లాంట్ సందర్శనకు వెళ్లారు. అక్కడ ఎలాంటి ఉత్పత్తి కార్యకలాపాలు జరగటం లేదని, కేవలం ఇద్దరు ముగ్గురు లేబర్ మాత్రమే ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో అధికారులు ప్లాంట్ కరెంటు బిల్లులను పరిశీలించటం గడచిన డిసెంబర్ 2024లో రూ.లక్ష 57వేలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో లీజుకు తీసుకున్న ప్లాంట్ ప్రాంతం లోపల ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదని సెబీ గుర్తించింది.
దీని తర్వాత 2వేల 997 ఈవీ కార్లను వేరే సంస్థలకు బదలాయింపుకు చేసిన రెండు ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో పెట్టుబడిదారుల నుంచి అనలిస్టుల వరకు అందరిలోనూ ఆందోళనలు మెుదలయ్యాయి. దీని తర్వాత మార్చిలో క్రెడింట్ రేటింగ్ ఏజెన్సీలు సైతం జెన్సోల్ కంపెనీ రేటింగ్ తగ్గింపును ప్రకటించాయి. అలాగే కొత్త రుణాలను పొందటం కోసం రుణ డిఫాల్టులను దాచిపెడుతూ తప్పుడు డాక్యుమెంట్లను ప్రమోటర్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఆర్ఈడీఏకి అందించినట్లు వెల్లడైంది. రుణాలను చెల్లించినట్లు ఇచ్చిన ఎన్ఓసీలను రేటింగ్ ఏజెన్సీలు క్రాస్ వెరిఫై చేయగా అవి పూర్తిగా తప్పుడు పత్రాలుగా తేలిపోయింది.
జెన్సోల్ ఐఆర్ఈడీఏ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రూ.977 కోట్ల రుణాన్ని జెన్సోల్ ఈవీల వ్యాపారం కోసం పొందింది. ఇందులో రూ.663 కోట్లతో 6వేల 400 ఎలక్ట్రిక్ కార్లను కొని బ్లూస్మార్ట్ కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంది. కానీ జెన్సోల్ మాత్రం కేవలం 4వేల 704 కార్లకను కొనుగోలు చేసి మిగిలిన డబ్బును దుర్వినియోగపరిచింది. ఆ డబ్బు చివరికి ప్రమోటర్ల కు, వారి కుటుంబ సభ్యులకు, ప్రమోటర్ల విలాసాలకు ఖర్చైనట్లు బయటకు రావటంతో జెన్సోల్ స్టాక్ కుప్పకూలింది. దీంతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు రిటైల్ ఇన్వెస్టర్లు గుర్తించారు. అయితే సెబీ తీసుకునే తర్వాతి చర్యల కోసం ఇన్వెస్టర్లతో పాటు కంపెనీకి గుణాలను అందించిన సంస్థలు ఎదురుచూడటం తప్ప చేసేదేంలేదు.