అద్దాలు ఇయ్యట్లే.. ఆపరేషన్లు చేయట్లే
రెండేళ్లు గడిచినా ‘కంటి వెలుగు’ల్లేవ్
టెస్టులు, కళ్లద్దాల పేరుతో రూ. కోట్లు వృథా
స్టోర్ రూముల్లో అద్దాలు.. సర్జరీల రిపోర్టులు
కంటిచూపు కోసం బాధితుల ఎదురుచూపు
‘కంటి వెలుగు పథకం’ నా ఫేవరేట్ స్కీమ్. ఎందుకంటే దేశంలోనే ఎప్పుడూ.. ఎక్కడా చేయని ప్రయత్నం. అరవై, డెబ్బై ఏండ్లొచ్చాక కళ్లు సక్కగ కనపడకపోతే ముసలోళ్ల బాధ ఎట్లుంటదో నాకు తెలుసు. సర్జరీ అనగానే హైపత్ తినొద్దు. నా కండ్లు మసక మసక ఉంటే ఈ మధ్యే ఢిల్లీపోయి కంటి ఆపరేషన్ చేయించుకున్నా . కంటి వెలుగు కార్యక్రమం లక్షలాది మందికి ఉపయోగం. మనిషి
జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తం. అవసరమైన వారందరికీ సర్జరీలు చేపిస్తం. ఉచితంగానే కళ్లద్దాలు ఇప్పిస్తం. ప్రజలు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా సర్కారే పెట్టుకుంటది.
– రెండేళ్ల కిందట స్కీం ప్రారంభోత్సవం సందర్భంగా మల్కాపూర్‍లో సీఎం కేసీఆర్
వరంగల్ రూరల్, వెలుగు: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ చేయడంలో భాగంగా కంటిచూపు సరిగా లేనివారందరికి వెలుగులు ప్రసాదిస్తామన్న సీఎం కేసీఆర్ మాట నెరవేరడంలేదు. స్వయంగా ముఖ్యమంత్రి కంటి వెలుగు పథకాన్ని తన ఫేవరేట్ స్కీమ్అనడంతో జనాలు నమ్మారు. టెస్టుల కోసం ఎక్కడెక్కడినుంచో వచ్చి క్యాంపుల వద్ద గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. పరీక్షలు చేయించుకున్నారు. సిబ్బంది అడిగిన డిటైల్స్అన్నీ ఇచ్చారు. త్వరలోనే మీకు కండ్లద్దాలు వస్తయ్.. సర్జరీలు అవసరం ఉన్నోళ్ల లిస్టు రెడీ చేసినం. నెల, రెండు నెలల్లో వీరికి ఆపరేషన్లు ఫ్రీగా చేస్తామనగానే ముసలోళ్లంతా ఖుషీ అయ్యారు. సీన్ కట్ చేస్తే.. రెండేళ్లవుతున్నా లక్ష్యం నెరవేరలేదు. ఆశగా ఎదురుచూస్తున్నోళ్ల కండ్లు కాయలు కాస్తున్నయ్ తప్పితే లక్షలాది మందికి ఇంకా కళ్లద్దాలు అందలేదు. ఆపరేషన్లు చేయలేదు. అసలు కంటి వెలుగు పథకం నడుస్తోందో లేదో తెలియట్లేదు.
చెప్పింది కొండంత.. చేసింది గోరంత
మెదక్ జిల్లా మల్కాపూర్లో 2018 ఆగస్ట్15న సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 9,887 గ్రామాల్లో ఐదు నెలల పాటు స్కీం అమలు చేస్తామన్నారు. దీనికోసం రూ.106 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 1.54 కోట్ల మందికి టెస్టులు చేశారు. 6,42,290 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు, 3,16,976 మందికి ఉన్నతస్థాయి చికిత్స అవసరమని చెప్పారు. తీరా చూస్తే.. ఈ పథకం కింద సరోజిని ఐ హాస్పిటల్లో 1000 నుంచి 1500 మందికి మాత్రమే ఆపరేషన్లు చేశారు. కాగా, వరంగల్ జయ హాస్పిటల్లో సర్జరీలు చేసేటైంలో 17 మందికి ఉన్న కళ్లు పోయాయి. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా శస్త్ర చికిత్సలు ఆపేశారు. నేటికీ లక్షలాది మంది అద్దాలు, సర్జరీల కోసం ఎదురుచూస్తున్నారు.
అద్దాల పేరుతో రూ.కోట్ల బడ్జెట్ వృథా
కంటి వెలుగు పథకం అమలు చేసే క్రమంలో ప్రభుత్వం ఓ ప్లాన్ ప్రకారం వెళ్లలేదు. టెస్టుల కోసం ఐదు, పది గ్రామాలకు కలిపి ఒక దగ్గర క్యాంప్ ఏర్పాటు చేశారు. పరీక్షలు చేసే టైంలో బాధితుల నుంచి సిబ్బంది పూర్తిస్థాయిలో అడ్రస్‍లు తీసుకోలేదు. డిటైల్స్సరైన రీతిలో అప్‍డేట్ చేయలేదు. సర్కారు పెద్దలు తమకు నచ్చిన కంపెనీలకు కోట్ల రూపాయల విలువ చేసే అద్దాల తయారీ కాంట్రాక్ట్ఇచ్చారు. అవి జిల్లాకు చేరుకున్నా.. బాధితుల కంప్లీట్ అడ్రసుల్లేక వేలాది మందికి వాటిని పంపిణీ చేయలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18,40,120 మందికి టెస్టులు చేశారు. 7,01,970 మందికి కళ్లద్దాలు, 1,15,025 మందికి సర్జరీలు అవసరమని లెక్క కట్టారు. మొత్తంగా రూ.కోట్ల ప్రజాధనం వృథా చేశారు తప్పితే.. రెండేళ్లు గడిచినా లక్షలాది మందికి కళ్లద్దాలు అందలేదు. సర్జరీలూ చేయలేదు. ఇదే పరిస్థితి రాష్ట్రమంతా నెలకొంది. అప్పటికి ఇప్పటికి బాధితుల కంటిచూపులో ఎంతో తేడా వచ్చి ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ మళ్లీ సర్జరీలు స్టార్ట్చేసినా.. అద్దాలు ఇవ్వాలనుకున్నా నాటి రిపోర్టులు ఎంతవరకు ఉపయోగపడతాయనేది అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని బాధితులు ఎదురుచూస్తున్నారు.
For More News..