
- 60 వేల మెట్రిక్ టన్నుల పంట రాగా.. కొన్నది 8 శాతమే
- 37 కొనుగోలు కేంద్రాలకు గాను35 ప్రారంభం
- నోముల, మల్కారంలో ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు
రంగారెడ్డి, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సెంటర్ల వద్దకు తీసుకొచ్చి అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. దళారుల దగా ఓ వైపు, కొనుగోలు కేంద్రాల వద్ద షరతులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగిలో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్ నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం డివిజన్లలోని 71 వేల 273 మంది రైతులు 90,447.24 హెక్టార్లలో వరి సాగుచేశారు. కాగా 2 లక్షల26 వేల118 మెట్రిక్‌టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం 60 వేల మెట్రిక్‌టన్నులు కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ, జిల్లా సహకార శాఖ, డీఆర్డీఏలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 37 ఏర్పాటు చేయాలనుకొని 35 కేంద్రాలను ప్రారంభించారు. మల్కారం, నోములలో కేంద్రాలను ప్రారంభించలేదు.
గన్నీ బ్యాగులు లేక..
అయితే, ధాన్యం కొనుగోలు ప్రారంభమైన కేంద్రాల్లో నిర్వాహకులు సమస్యలను సృష్టిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తగినన్ని గన్నీ బ్యాగులను సరఫరా చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ చెప్తున్నప్పటికీ.. కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం పరిస్థితి అలా లేదు. బస్తాలు సమయానికి లేకపోవడంతో కొనుగోలు నిలిచిపోతోంది. రైతులు తీసుకువస్తున్న ధాన్యం తేమ 17శాతం లోపు ఉండాలి. తాలు ఒక శాతానికి మించకుండా ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే, నిర్వాహకులు మాత్రం తేమ, తాలు ఎక్కువగా ఉందని చెప్తూ ఎక్కువ మొత్తంలో తరుగు తీసేందుకు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తూకం వేసినప్పటికీ.. రైస్‌మిల్లుల వద్ద తూకం అయిన తర్వాతే ధాన్యానికి లెక్కలు చెప్తున్నారు. రైస్‌మిల్లుల వద్ద జరిగే ఆలస్యానికి తూకంలో వచ్చే వ్యత్యాసాన్ని కూడా తమపైనే వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నది కేవలం 5 వేల మెట్రిక్టన్నులే..
ఏప్రిల్చివరినాటికి జిల్లాలో కొనుగోలు ప్రారంభించిన నిర్వాహకులు.. మొత్తం 60 వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం ఐదువేల మెట్రిక్‌టన్నులు మాత్రమే కొన్నారు. దీంతో తమ వంతు ఎప్పుడు వస్తుందోనని రైతులు ప్రతిరోజు కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోముల గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. అక్కడ ఏర్పాటు చేస్తారని కొందరు రైతులు వడ్లను తీసుకొచ్చి వారం రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. కానీ అధికారులు మాత్రం కేంద్రం ఏర్పాటుపై స్పష్టతనివ్వడం లేదు. కొనుగోలు ఆలస్యమవడంతో కొన్ని చోట్ల వర్షానికి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా ధాన్యాన్ని సేకరించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఎక్కడ కొంటరో తెలుస్తలేదు
నోములలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని లింగంపల్లి నుంచి వడ్లను ఇక్కడకు తీసుకొచ్చా. కానీ ఇంకా ప్రారంభించలేదు. ఎప్పుడు కొంటారో కూడా తెలుస్తలేదు. చాలా మంది రైతులం ఇక్కడకు ధాన్యాన్ని తెచ్చినం. కానీ కొనుగోలుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రారంభించాలి.
–అశోక్ రెడ్డి, రైతు, లింగంపల్లి, మంచాల మండలం
వచ్చి వారం రోజులైంది
ప్రతి ఏడాది నోములలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడే వడ్లు కొనేటోళ్లు. అందుకే వారం రోజుల కిందట ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన. కొంటామని చెప్తున్నరు. కానీ ఎప్పుడనేది తెలియట్లేదు. వారం రోజుల నుంచి ఎదురుచూస్తునే ఉన్నం. ఇప్పటికైనా వడ్లు కొనాలి.
–లక్ష్మమ్మ, మహిళా రైతు, నోముల