జనగామ మార్కెట్ యార్డుకు పోటెత్తుతున్న ధాన్యం

  • కోతలు సగం పూర్తయినా ప్రారంభం కాని సెంటర్లు
  • దళారులకు తక్కువకే అమ్ముకుంటున్న రైతులు
  • కొత్త రాశులకు జాగా లేక మార్కెట్ బంద్

జనగామ, కమలాపూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతలు ప్రారంభమై 15 రోజులు అవుతున్నా సెంటర్లు ఓపెన్ చేయకపోవడంతో.. ప్రైవేటు వ్యాపారులకు అగ్గువ సగ్గువకు అమ్ముకుంటున్నారు.మార్కెట్​ యార్డులకు పెద్ద ఎత్తున ధాన్యం వస్తుండడంతో ఇదే అదునుగా వ్యాపారులు ధరలు తగ్గించేశారు. సిండికేట్​గా మారడంతో రైతులు క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.500కు పైగా నష్టపోతున్నారు.

రైతుల పడిగాపులు..

ఉమ్మడి జిల్లాలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మినహా దాదాపు అన్ని జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. జనగామ జిల్లాలో సగం కోతలు పూర్తయ్యాయి. వరంగల్, హనుమకొండ రూరల్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గత నెల చివరి వారంలోనే సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పినా.. నేటికీ  కొన్నిచోట్ల మాత్రమే ప్రారంభించారు. జనగామ జిల్లాలో 167 ధాన్యం కొనుగోలు సెంటర్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇందులో 9 సెంటర్లు మాత్రమే ఓపెన్​ చేశారు. హనుమకొండలో 159, వరంగల్​లో 157సెంటర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా.. ఒక్కటి కూడా  తెర్వలేదు. దీంతో రైతులు ఆరుబయట ధాన్యం ఆరబోసి సాయంత్రం కాగానే కుప్పనూర్చుతున్నారు. రోజుల తరబడి ఇలా చేస్తుండడంతో మహిళలు అవస్థలు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఇటీవల వడ్లు నేర్పుతో ఓ మహిళ కిందపడిపోయింది.

జనగామ మార్కెట్ ఫుల్..

గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయకపోవడంతో జనగామ జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున ధాన్యం తరలివచ్చింది. దీంతో యార్డును తాత్కాలికంగా మూసివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం తరలిరావడంతో ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. అయితే కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయకపోవడం వల్లే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు యార్డుకు ధాన్యం తెస్తున్నారని సిబ్బంది చెప్తున్నారు.

అంతా లాస్​..

వరికి సర్కారు మద్దతు ధర క్వింటాలుకు ఏ గ్రేడ్​కు రూ.2,060, కామన్​ రకానికి రూ.2,040 గా ఉండగా.. ప్రైవేటులో వ్యాపారులు రూ.1500 నుంచి రూ.1700లకు అటు ఇటుగా ధరలు వేస్తున్నారు.  మూడ్రోజుల కింద రూ.1700 నుంచి రూ.1750 ధర వేయగా.. సర్కారు సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో ఈ ధరను రూ.1500లకు తగ్గించారు. తేమ సాకుతో అత్తెసరు ధరలు వేస్తున్నారు. దీంతో క్వింటాల్​కు రూ.400 నుంచి రూ.600 వరకు రైతులు నష్టపోతున్నారు.

కుప్పల వద్దే కాపలా 
ఆరు ఎకరాల్లో వరి వేసిన. మద్దతు ధర వస్తుందని ఆరబోసి, రాశులు పోసి పెట్టిన. ఇంత వరకు సెంటర్ ఓపెన్ చేయలేదు. ఎప్పుడు చేస్తరో తెలియదు. ధాన్యం కుప్పల వద్ద కాపలా కాయాల్సి వస్తోంది. ఆఫీసర్లు వెంటనే సెంటర్లను ఓపెన్​ చేయాలి. –మెడిద గట్టయ్య, రైతు, అక్కపల్లిగూడెం, స్టేషన్ ఘన్ పూర్