- సాదాబైనామాలకు పట్టాలు ఇస్తలేరు
- స్టేట్ వైడ్ 9 లక్షలకు పైగా అప్లికేషన్లు
- నాలుగు నెలలుగా పాస్‌బుక్‌ల కోసం పడిగాపులు
- లోన్లు రాక, అమ్మలేక, కొనలేక అవస్థలు
- ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు
ఖమ్మం, వెలుగు: కొన్నేళ్ల కిందట భూములు కొనుక్కొని, రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు, తెల్ల కాగితాలపై పెద్దల సమక్షంలో అగ్రిమెంట్లు చేసుకున్నవారి సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేసేలా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వం చెప్పిన ప్రకారం మీ సేవా సెంటర్లలో ఫీజులు కట్టి అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షలకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు వాటి రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవడంతో పట్టాల పనికి బ్రేక్ పడింది. దీంతో భూమి ఉన్నా రైతుబంధు రాక కొందరు, ఉన్న భూమిని అమ్ముకోలేక ఇంకొందరు ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గతేడాది అక్టోబర్21 నుంచి నవంబర్10 వరకు 20 రోజులపాటు ప్రభుత్వం అవకాశమిచ్చింది. అన్ని జిల్లాల్లో ఆన్లైన్లో అప్లై చేసుకున్న రైతుల సంఖ్య 9,00,896 ఉండగా, ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే 1,11,449 మంది అప్లై చేసుకున్నారు. సూర్యాపేట 81,629 దరఖాస్తులతో రెండో స్థానంలో, మహబూబాబాద్ 80,003, భద్రాద్రి జిల్లా 62,511 దరఖాస్తులతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అతితక్కువ దరఖాస్తులు మేడ్చల్ జిల్లాలో 1,332 వచ్చాయి. ఒక్కో అప్లికేషన్ కు రూ.45 యూజర్ చార్జీలుగా నిర్ణయించారు. ఈ మేరకు అప్లై చేసుకున్న రైతులంతా కలిసి రూ.4.05 కోట్లు సర్కారుకు చెల్లించారు. అప్లికేషన్ల సమయంలో రైతుల అవసరాన్ని అవకాశంగా తీసుకుంటూ ఒక్కో అప్లికేషన్‌కు మీ సేవా సెంటర్లలో రూ.200 వరకు వసూలు చేశారు. ఇక చాలామంది పాత డేట్లతో బాండ్ పేపర్లు కొనేందుకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. వీటన్నింటినీ రెవెన్యూ అధికారులు పరిశీలించి, దరఖాస్తు చేసుకున్నవాళ్లు పొజిషన్లో ఉంటే వాటికి కొత్త పట్టాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాకపోవడంతో అప్లికేషన్లన్నీ ప్రస్తుతానికి పెండింగ్ లో ఉన్నాయి.
పాస్‌బుక్ లేక రైతు బంధు రావట్లే
30 ఏళ్ల కిందట తీసుకున్న 30 గుంటల భూమికి ఇంతవరకు పాస్ బుక్ రాలేదు. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలైంది. తహసీల్దార్ఆఫీస్చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు. ఆఫీసులో అడిగితే ఎవ్వరూ ఏం చెప్పట్లేదు. పట్టా పాస్ బుక్కు రాకపోవడంతో పంట పెట్టుబడి సాయం పైసలు కూడా రాట్లేదు. రైతుబంధు రావట్లే, మోడీ డబ్బులు కూడా పడట్లేదు.
– బలంతు వెంకయ్య, బాధిత రైతు, ముదిగొండ
ఏ ఒక్కరికీ పట్టా ఇవ్వలే
యూజర్‌చార్జీల రూపంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ.4 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించారు. మీ సేవా సెంటర్ల నిర్వాహకుల దోపిడీతో దీనికంటే నాలుగు రెట్లు ఎక్కువగా రైతుల జేబులకు చిల్లు పడింది. అయినా ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా సాదాబైనామా కింద ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు.
– గంగాధర కిషోర్‌కుమార్, ఆర్టీఐ కార్యకర్త