మూసీకి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు

మూసీకి 100 మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్.. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు
  • 50 మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు
  • నలుగురు సీనియర్ ఆఫీసర్లతో కమిటీ
  • 50 నుంచి 100 మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి
  • మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: మూసీ, ఈసా నదుల వెంట ఇష్టారాజ్యంగా కొత్త నిర్మాణాలు వెలుస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. ‘మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ​లిమిటెడ్’ ద్వారా చేపట్టనున్న మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి వాటితో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. నదుల వెంట నిర్మాణాల నియంత్రణకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.

డీటీసీపీ (డైరెక్టర్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్), జీహెచ్‌‌‌‌ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్‌‌‌‌ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌‌‌‌, మూసీ కార్పొరేషన్ జేఏండీలతో కమిటీ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్‌‌‌‌జోన్‌‌‌‌లో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని, అలాగే 50 నుంచి 100 మీటర్ల దాకా.. మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని ఆదేశించారు. మూసీ వెంట కొత్త నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే అప్లికేషన్లను కొత్త కమిటీ క్లియర్ చేశాకే ముందుకెళ్లాలన్నారు.

మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. మూసీ, ఈసా నదుల వెంబడి ఉన్న ప్రాంతాల పునరుజ్జీవనం, అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మూసీ, ఈసా బఫర్ జోన్‌‌‌‌లలో ప్రణాళికేతర నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్టవేయకపోతే నది ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయని హెచ్చరించింది. ఉస్మాన్‌‌‌‌సాగర్, హిమాయత్‌‌‌‌సాగర్ నదుల నుంచి కొర్రెముల గ్రామం వరకు (ఓఆర్ఆర్) మూసీ నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్​గా ప్రకటించినట్లు స్పష్టంచేసింది. దీని ప్రకారం, మూసీ, ఈసా నదుల వెంట ఈ జోన్‌‌‌‌లో ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవద్దని పేర్కొంది.