
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ పరిసరాల్లో ప్రణాళికరహిత నిర్మాణాల అభివృద్ధి జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. డీటీసీపీ, జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తూ బుధవారం (ఏప్రిల్ 2) ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జేఎండీకి కూడా కమిటీలో చోటు కల్పించింది. మూసీకి 50 మీటర్ల వరకు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ | కంచె గచ్చిబౌలి భూములపై నివేదికివ్వండి..తెలంగాణకు కేంద్రం ఆదేశం
అలాగే.. మూసీకి 50 నుంచి 100 మీటర్ల వరకు కొత్తగా అనుమతులు ఇవ్వొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు కొత్త అనుమతులు ఇవ్వొద్దని తెలిపింది. పర్మిషన్లకు సంబంధించి కమిటీ క్లియర్ చేసే వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని అధికారులను ఆదేశించింది. మూసీకి 100 మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్ని ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. మూసీ పర్యావరణ సమతుల్యత పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.