Champions Trophy 2025: ఇక ఐపీఎల్ ఆడుకోవాల్సిందే.. భారత జట్టు నుంచి సిరాజ్ ఔట్

టీమిండియా స్టార్ బౌలర్లలో ఒకడైన మహమ్మద్  సిరాజ్ కు సెలక్టర్లు షాక్ ఇచ్చారు. కొంతకాలంగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న సిరాజ్ పై సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. శనివారం (జనవరి 18) ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో సిరాజ్ పేరు లేదు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ను ఎంపిక చేశారు. మెగా ఈవెంట్ లో నిన్నటివరకు సిరాజ్ పై వేటు పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

భారత్ వేదికగా జరిగిన వన్డే  వరల్డ్ కప్ 2023 ముందు సిరాజ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ నుంచి సిరాజ్ ఫామ్ దిగజారుతూ వస్తుంది. ఫార్మాట్ ఏదైనా సిరాజ్ విఫలమవుతున్నాడు. అయినప్పటికీ సెలక్టర్లు ఈ తెలుగు బౌలర్ పై నమ్మకముంచారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సిరాజ్ విఫలమయ్యాడు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పర్వాలేదనిపించిన అతను అంతకముందు ఫామ్ లేమితో జట్టుకు భారంగా మారాడు. 

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు ఇదే

షమీకి గాయం కావడంతో సిరాజ్ వరుస అవకాశాలు వచ్చాయి. అయితే షమీ రీ ఎంట్రీతో సిరాజ్ పై వేటు పడింది. ఐపీఎల్ కు ముందు సిరాజ్ కు ఇది పెద్ద షాకే అని చెప్పాలి. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు జాక్ పాట్ తగిలింది. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్ల రూపాయలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. మెగా ఆక్షన్ కు ముందు బెంగళూరు సిరాజ్ ను రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేయడంతో భారీ ధరకు సిరాజ్ ను గుజరాత్ దక్కించుకుంది. భారత జట్టులోకి రావాలంటే సిరాజ్ ఐపీఎల్ లో తనను నిరూపించుకోవాల్సిందే. ఒకవేళ ఐపీఎల్ లో విఫలమైతే ఇక భారత జట్టులో చోటు దక్కడం దాదాపు అసాధ్యం. 

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.