రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ జరపలేదు: ఆదిలాబాద్ ఎస్పీ

రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం ఐపీ ఎస్.  జిల్లా పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చదరగొట్టారన్నది అవాస్తవమని చెప్పారు. రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరినీ ఒక క్రమబద్ధీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసం పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తుంటారని గ్రహించాలని తెలిపారు. 

దుకాణాల్లోకి దూసుకెళ్లకుండా పోలీసుల సహకారంతో ప్రశాంతంగా రైతులు వరుస క్రమంలో విత్తనాలను సేకరించి తిరిగి వెళుతున్నారని ఆయన చెప్పారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదన్నారు. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదని స్పష్టం చేశారు. పోలీసులు ఏ ఒక్క రైతుపై కూడా లాఠీచార్జ్ చేయలేదన్నారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన, వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని సూచించారు. అవాస్తవమైన వార్తలను, స్క్రోలింగ్ లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గౌస్ హెచ్చరించారు.