రాజకీయాల్లో యూత్​కు చాన్స్​ ఇయ్యాలె

నేటి యువతే రేపటి దేశభవిత అన్న సూక్తులతో తప్ప వారి శక్తి సామర్థ్యాలను రాజకీయాల్లో ఉపయోగించుకునే అవకాశం ఏ రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. రాజకీయం అంటే పెట్టుబడులతో కూడుకున్న వ్యాపారంలా మారిపోయింది. అందులోనూ వారసత్వ రాజకీయాలు, తండ్రి, తాతలు ఇతర రక్తసంబంధీకుల అండదండలతో బరిలోకి దిగేవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కొత్తగా అభివృద్ధి, సమాజసేవ అనే ఆశలతో వచ్చే వాళ్లు ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ అధికార పార్టీలోనో, నామమాత్రపు పదవుల్లోనో, ఆర్థికంగా లేనివారు కార్యకర్తలుగానో  నిలదొక్కుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. 

బరిలో దిగేముందు కర్తవ్యాల గురించి, దిగాక కహానీలు చెప్పే నాయకులూ ఉన్నారు. దేశ అభివృద్ధిలో యువతను భాగం చేస్తూ రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు, పార్టీలు చేయడం లేదు. ఒకప్పటితో పోలిస్తే  ప్రస్తుతం ఉన్న సమాజంలో అన్ని రంగాల్లో యువతకు ప్రాధాన్యం లభిస్తుంది, అలాగే రాజకీయాల్లో కూడా యువత క్రియాశీల పాత్ర వహించే సదుపాయాలను కల్పించాలి. అందుకు రాజకీయ పార్టీల్లో ప్రక్షాళన  జరగాల్సిన అవసరం ఉన్నది. కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్​యూనియన్​ఎన్నికలు జరపాలి.  విద్యార్థి నాయకుల ద్వారా సమాజానికి మంచి నాయకులు వస్తారు. రాజకీయాల్లోకి యువత ప్రవేశించడం ద్వారా నవయువ సమాజం రూపుదిద్దుకుంటుంది. - పి. సుష్మ, మక్తల్​