న్యూఢిల్లీ: ఒడిశా సీఎం, బిజూ జనతా దళ్ (బీజేడీ) చీఫ్ నవీన్ పట్నాయక్ విపక్షాలకు షాక్ ఇచ్చారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తన పార్టీ ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తుందని ప్రకటించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను తమ స్టేట్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడానికి వచ్చానని తెలిపారు. ఎయిర్పోర్ట్ను భువనేశ్వర్ నుంచి పూరీకి మార్చడంపై చర్చించానని, సాధ్యమైన విధంగా సహాయం చేస్తానని ప్రధాని చెప్పారని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘బీజేడీ విపక్షాలతో కలవదు” అని తెలిపారు.
తనకు తెలిసినంత వరకు ఇప్పట్లో థర్డ్ ఫ్రంట్ కు అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలకు నవీన్ ప్రకటన పెద్ద దెబ్బ కొట్టినట్లు అయింది.