- మమత మర్డర్ కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు
- ఎంక్వైరీలో తీవ్ర జాప్యంతో రాజకీయ రంగు
నిజామాబాద్, వెలుగు : సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన పుర్రె మమత(30) మర్డర్ కేసులో నెలన్నర గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. నిందితులను గుర్తించేందుకు ఒక్క ఆధారాన్ని కూడా సేకరించలేకపోయారు. అంతలోనే ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఎంపీ అర్వింద్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరస్పరం ఆరోపణలు చేసుకునేదాక వెళ్లింది.
అక్టోబర్ 3న హత్య
సాయిలు, మమత దంపతులకు ఇద్దరు కొడుకులు జశ్వంత్(13), రిత్విక్(11) ఉన్నారు. భర్త రోజూ గొర్రెల మందను అడవికి మేతకు తోలుకెళ్లేవాడు. ఆమె రోజూ గ్రామ శివారులోని తమ పొలానికి వెళ్లి వ్యవసాయ పనులు చేస్తుండేది. గడ్డి కోసి గేదెలకు వేసేది. అక్టోబర్ 3న భర్త అడవికి వెళ్లిపోయిన తర్వాత తానూ భోజనం చేసి పొలానికి వెళ్లింది. సాయిలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి ఆమె గురించి పిల్లలను అడగ్గా రాలేదని చెప్పారు. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్లి వెతికారు. పొలంలో బురద మడుగులో మమత డెడ్ బాడీ కనిపించింది. మెడపై కోసిన గాయం, ఒక కాలు విరిగిపోయి ఉంది. కొట్టినట్లు దెబ్బల గుర్తులు శరీరంపై కనిపించాయి. ఘటనా స్థలిలో ఆనవాళ్ల ప్రకారం ఎవరో అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసినట్లు అర్థమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆమె డెడ్ బాడీని హడావుడిగా అదేరోజు రాత్రి అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.
అనేక అనుమానాలు
డెడ్ బాడీని పోలీసులు హడావుడిగా షిఫ్ట్ చేయడంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలిలో ఆధారాలు సేకరించలేదని, డాగ్ స్క్వాడ్ కూడా రప్పించలేదని చెబుతున్నారు. ఓ మహిళ దారుణ హత్యకు గురైతే పోలీసులు సరైన విధంగా స్పందించలేదని, హడావిడిగా వ్యవహరించారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో పోలీసుల పనితీరు అనుమానాస్పదంగా ఉందని, పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తోందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.
45 రోజులు గడిచినా..
45 రోజులు గడుస్తున్నా మమత హత్య కేసులో మిస్టరీ వీడడంలేదు. ఈ కేసు విచారణలో పోలీసులు జాప్యం చేయడంపై ఇటీవల గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. జిల్లా కేంద్రానికి తరలి మమత హత్య కేసులో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో మహిళలు సీపీ ఆఫీస్ ను ముట్టడించారు. దీంతో సీపీ కార్తికేయ స్పందిస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. ఆతర్వాత పోలీసులు ఆధారాల కోసం ట్రాక్టర్ తో పొలాన్ని దున్నించారు. ఘటనా స్థలిలో ఓ కర్ర పాతిన పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించారో తేలలేదు.
చంపినోడు ఊళ్లెనే ఉన్నడు
అన్నెం పున్నెం ఎరుగని నా కోడలిని చంపినోడు ఊళ్లెనే ఉన్నడు. కాపుకాసి కిరాతకంగా చంపి, బురదలో కుక్కిండు. నా ఇద్దరు మనుమలను తల్లిలేని పిల్లలను చేసిండు. నా కొడుకు బతుకు ఆగం చేసిండు. పోలీసులు అతడిని పట్టుకుని విచారిస్తే అసలు నిజం బయటపడుతుంది.
– పుర్రె లింబవ్వ, మమత అత్త
నిందితులను త్వరలోనే పట్టుకుంటం
మమత మర్డర్ జరిగిన చోట ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే కేసు ఎంక్వైరీలో ముందడుగు పడటం లేదు. అంతే తప్ప మరే కారణాలు లేవు. అనుమానితులను విచారిస్తున్నం. ఈ కేసులో త్వరలోనే నిందితులను పట్టుకుంటం. మాపై ఎవరి ఒత్తిళ్లు లేవు.
– శ్రీనివాస్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ