లాయర్​ మల్లారెడ్డి మర్డర్‌‌లో నో ప్రొగ్రెస్‌

  • పని చేయని సీసీ కెమెరాలు
  • 22 కత్తిపోట్ల వల్ల చనిపోయినట్లు డాక్టర్ల ధ్రువీకరణ
  • హంతకులను శిక్షించాలని అడ్వకేట్ల నిరసన

జయశంకర్‌‌ భూపాలపల్లి, ములుగు, వెలుగు: ములుగు జిల్లా పందికుంట బస్‌‌ స్టేజీ వద్ద సోమవారం రాత్రి హత్యకు గురైన లాయర్​ ములగుండ్ల మల్లారెడ్డి (65) కేసులో సుపారీ గ్యాంగ్‌‌ల పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కేసును ఛేదించడం సవాల్‌‌గా మారింది. నిందితులను గుర్తించి అరెస్ట్‌‌  చేయడానికి ములుగు ఏఎస్పీ, ములుగు సీఐ, సీసీఎస్‌‌ సీఐలతో కూడిన మూడు ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ సంగ్రామ్‌‌ సింగ్‌‌ జి.పాటిల్‌‌ ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా పోలీసులు ఇప్పటికే  ఐదుగురు అనుమానితులను పిలిచి విచారించారు. న్యాయవాది మల్లారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో నిందితులను త్వరగా అరెస్ట్‌‌ చేసి కోర్టులో హాజరుపరచాలని మంగళవారం వరంగల్‌‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడ్వకేట్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మల్లారెడ్డి మెడ, కడుపు భాగంలో 22 కత్తి పోట్లు పొడవడం వల్ల స్పాట్‌‌లోనే చనిపోయినట్లుగా పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ధ్రువీకరించారు. 

హత్య చేసింది ఎవరు?

మల్లంపల్లి మైనింగ్ భూములకు సంబంధించిన వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతోనే న్యాయవాది మల్లారెడ్డి హత్య జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మల్లంపల్లి, రాంచంద్రాపురం ఏరియాలో మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల పేరిట వంద ఎకరాలకు పైగా భూములు, మూడు మైన్లు ఉన్నాయి.  మైనింగ్ లో భూములు కోల్పోయినవారు, తమ భూములను ఆక్రమించుకున్నారనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హత్య ఎవరు చేశారనే విషయంలో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదని అంటున్నారు. ములుగు, మల్లంపల్లి ఏరియాలో అమర్చిన సీసీ కెమెరాలు ఏవీ కూడా పనిచేయట్లేదట. దీంతో జిల్లా ఎస్పీ స్థానిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మృతుని భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన స్థలంలో మల్లారెడ్డి కారు డ్రైవర్‌‌ మాత్రమే ఉన్నాడు. అతను కూడా హత్య చేసిన వాళ్లను గతంలో ఎప్పుడు చూడలేదని.. అందరూ కొత్తవాళ్లలా ఉన్నారని చెప్పాడు. దీంతో సుపారీ గ్యాంగ్‌‌లతో హత్య చేయించి ఉంటారనే అనుమానంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మల్లారెడ్డి మర్డర్‌‌ కేసును ఛేదించడానికి క్లూస్‌‌ టీమ్‌‌లు రంగంలోకి దిగాయి. గతంలో మల్లారెడ్డిపై పోలీస్‌‌, రెవెన్యూ శాఖలలో పిటిషన్లు ఇచ్చిన వారిని పిలిచి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. వారు చెప్పే విషయాలను బట్టి ఆధారాలు దొరుకుతాయని పోలీసులు భావిస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌‌ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు మంగళవారం కుటుంబసభ్యులను పరామర్శించారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్ట్‌‌ చేసి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌‌ చేశారు.  

వరంగల్ లో అంత్యక్రియలు..

అడ్వకేట్ మల్లారెడ్డి అంత్యక్రియలు మంగళవారం వరంగల్ పద్మాక్షి గుట్టలోని శ్మశానవాటికలో జరిగాయి. బాలసముద్రంలోని శ్రీనివాసకాలనీలో ఉన్న మల్లారెడ్డి ఇంటి నుంచి మృతదేహాన్ని సాయంత్రం పద్మాక్షిగుట్టలోని శ్మశాన వాటికకు తరలించారు. మృతుడు మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.