వీసీల కేసులు తేలితేనే వర్సిటీల సమస్యలకు మోక్షం!

రాష్ట్రంలోని వర్సిటీలు ఇన్​చార్జి వైస్​చాన్స్ లర్ల (వీసీల) పాలన నుంచి ఏడాది కిందట రెగ్యులర్ వీసీల పాలనలోకి మారినా ఆయా వర్సిటీలకు నిధుల మంజూరు విషయంలో, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల నియామకాల్లోనూ ఎలాంటి అభివృద్ధి కనబడటం లేదు. ఆయా వర్సిటీల్లో వీసీల పాలనా తీరుపై విద్యార్థి, ప్రొఫెసర్ల, నాన్-టీచింగ్ ఉద్యోగుల సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎలాంటి మెరిట్ లేకుండానే, అనర్హులైన వారిని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వీసీలుగా ప్రభుత్వం నియమించిందని, అలాంటి వారిని తొలగించాలని గత సంవత్సరం రాష్ట్ర హైకోర్టులో మొత్తం ఏడుగురు పిటీషన్లు దాఖలు చేశారు. అనుకున్న రీతిలో వర్సిటీల్లో పాలన వీసీల ఇష్టారాజ్యంగా మారింది. వీసీల నియామకాల్లో రాజకీయ జోక్యం స్పష్టంగా కనబడుతుండటంతో రాజకీయ నాయకుల అండ దండలు చూసుకొని వారు ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంతో విమర్శల పాలుకావాల్సి వస్తున్నది. వీసీల నిర్ణయాన్ని అమలు పరిచే వ్యవస్థ పాలక మండళ్లకు ఉన్నప్పటికీ ఒక్కో వర్సిటీల్లో ఒక్కో లాగ పాలక మండలి పనితీరు కనబడుతుందని ఇటీవల తెలంగాణా వర్సిటీ విషయంలో జరిగిన సంఘటనను చూస్తే అర్థమవుతున్నది.

పాలక మండలి తీరుపై విమర్శలు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వర్సిటీల్లో తెలంగాణ వర్సిటీ ఒకటి. ఆ వర్సిటీ ఉపకులపతి తన ఇష్టానుసారంగా పాలక మండలి అనుమతి లేకుండా రిజిస్ట్రార్ ను నియమించుకోవడం, టీచర్లకు పదోన్నతులు ఇవ్వడంతో పాటు నిర్మాణాలు, కొనుగోళ్లు చేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆ వర్సిటీ పాలకమండలి ఇటీవల ఒక సమావేశం నిర్వహించింది. పాలకమండలి అనుమతి లేకుండా నియమితులైన ఆ వర్సిటీ రిజిస్ట్రార్ ను సమావేశం నుంచి బయటకు పంపగా ఆ వర్సిటీ వీసీ, పాలకమండలి సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకవైపు వీసీల పనితీరుపై, మరొక వైపు పాలక మండలి పనితీరుపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈసీ ఓక రిజిస్ట్రార్ ను, వీసీ ఒక రిజిస్ట్రార్ ను నియమించడంతో ఉద్యోగుల జీతాలకు ఎవరి సంతకాలు చెల్లుతాయో తెలియక సదరు బ్యాంకు అధికారులు సైతం ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు రాజకీయ నాయకులు వీసీ, ఈసీలతో సమావేశం పెడితే కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో వీసీల తీరుపై పాలకమండలికి ఫిర్యాదులు అందినప్పటికీ కేవలం తెలంగాణ వర్సిటీ వీసీ విషయంలో ఇలా జరగడంతో పాలకమండలి సభ్యుల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని వర్సిటీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉస్మానియా వర్సిటీలో కూడా యూజీసీ నిబంధనలను అతిక్రమించి కొందరికి పదోన్నతులు కల్పించారని, ఇతర నియామకాల విషయంలో అధ్యాపక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. వీసీ ఏడాది పని తీరుపై విద్యార్థి సంఘాలు చార్జ్​షీట్​లు వేసి ఉద్యమాలు చేస్తున్నా, పాలక మండలి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వస్తున్నాయి. 

వీసీల కేసులు తేలితేనే.. సమస్యలకు పరిష్కారం 

విద్యార్థుల సమస్యలు, టీచింగ్​స్టాఫ్, నాన్-టీచింగ్ ఉద్యోగుల సమస్యలు అన్ని వర్సిటీల్లో ఎక్కడివక్కడే ఉన్నాయి. వర్సిటీల వీసీలు కానీ, ఆయా వర్సిటీల పాలక మండలి సభ్యులు కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వర్సిటీల్లో వీసీల పాలన ఇష్టారాజ్యంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కి పది సంవత్సరాలు కనీస ప్రొఫెసర్ గా అనుభవం లేని వారిని, పదవీ విరమణ పొందిన వారిని దాదాపు అన్ని వర్సిటీలకు వీసీలుగా నియమించడంతో అసమర్థ పాలన కొనసాగుతోందని, పాలన సజావుగా సాగి, వర్సిటీలు అభివృద్ధి బాట పట్టాలంటే మొదట వీసీల నియామకాలపై హైకోర్టు నిగ్గు తేల్చాలని లేదా అధికారులందరూ ఎవరికి వారు తమ అర్హతపై శ్వేత పత్రం జారీచేయాలని లేదా ఆత్మ విమర్శ చేసుకొని తమ పదవులకు రాజీనామాలు చేసి బయటకు రావాలని వర్సిటీల మేధావులు కోరుతున్నారు. వీలైతే అన్ని వర్సిటీల వీసీల నియామకాలపై గవర్నర్​ ఆధ్వర్యంలో కమిటీలు వేసి నిజాలు నిగ్గు తేల్చాలని విద్యార్థి సంఘ నాయకులు, ఉద్యోగులు డిమాండ్​ చేస్తున్నారు.

రాజకీయ మాస్కుతో నిరంకుశ ధోరణి

కాకతీయ యూనివర్సిటీలో కూడా ఆ వర్సిటీ వీసీ, ఒకే సంవత్సరంలో నలుగురు రిజిస్ట్రార్ లను మార్చిన తీరుపై, రిజిస్ట్రార్ నియామకంపై, టీచింగ్​స్టాఫ్​పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరికి పదోన్నతులు నిలిపివేయడం, మరి కొందరికీ షోకాజ్ నోటీసులు జారీచేసి, వారిపై కమిటీలు వేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై పలుసార్లు పాలకమండలికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనబడకపోవడంతో పాలక మండలి పనితీరులో కూడా రాజకీయ జోక్యం కనబడుతుందని పలువురు అభిప్రాయబడుతున్నారు. గతంలో పదవీ విరమణ పొందిన కొందరు ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతి కల్పించకుండా, ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్ లు మాత్రం పదవీ విరమణ కాకమునుపే యూజీసీ నిబంధనలను, ప్రభుత్వ జీవోలను, వర్సిటీల చట్టాన్నిఉల్లంఘిస్తూ సీనియర్ ప్రొఫెసర్ ప్రమోషన్ పొందిన తీరుపై,  కొందరికి పదోన్నతి నిలిపివేయడంపై ఆ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హైకోర్టును ఆశ్రయించడం వంటి సంఘటనలు అధికారుల నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నాయని ఆ వర్సిటీ టీచింగ్​ స్టాఫ్​ సంఘ నాయకులు అంటున్నారు.  

- డా. మామిడాల ఇస్తారి,జనరల్ సెక్రటరీ,  కేయూ టీచర్స్ అసోసియేషన్