విభజన హామీల ఊసే లేదు: తమ్మినేని

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేసినప్పటికి, దానికి తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. 

పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదని, మూసీ ప్రక్షాళన గురించి రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకున్నా స్పందించలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.