21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

21 ఏండ్ల ప్రభుత్వ కొలువులో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె

రిటైర్మెంట్‍ టైం వచ్చినా ఇంకా అదే పోస్ట్ , అదే జీతం

జోనల్‍ కేడర్‍ స్కూల్‍ అసిస్టెంట్‍ టీచర్ల దుస్థితి

అసెంబ్లీలో హామీ ఇచ్చినా న్యాయం జరగలే

సర్కారు పట్టనితనంపై ఆందోళనలో టీచర్లు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: ఒక్కసారి గవర్నమెంట్ జాబ్​కొట్టినమంటె సాలు, ఇగ ఇంక్రిమెంట్లు..  ప్రమోషన్లు.. లైఫ్ బిందాస్ ​ఉంటదని అందరూ కలలు కంటరు. అందుకు తగ్గట్లే చాలా డిపార్ట్​మెంట్లలో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల ప్రాసెస్ ​దానంతటదే జరిగిపోతది. కానీ ప్రభుత్వ కొలువులో చేరి 21 ఏండ్లు గడిచినా కనీసం ఒక్కటంటే ఒక్క ప్రమోషన్‍ రానివాళ్లు కూడా ఉన్నరు. వాళ్లే జోనల్‍ కేడర్‍ స్కూల్‍ అసిస్టెంట్లు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఫీసర్లు చేసిన పొరపాటుకు సొంత రాష్ట్రంలోనూ శిక్ష అనుభవిస్తున్నరు. తెలంగాణ వచ్చాక తప్పును సరిద్దాలని కోరుతూ సీఎం, మంత్రులు, చీఫ్‍ సెక్రటరీ వద్దకు వందలసార్లు తిరిగినా న్యాయం జరగలేదు. దీంతో దగ్గరదగ్గర 500 మంది టీచర్లు ప్రమోషన్లు​ రాకుండానే రిటైర్​మెంట్​కు దగ్గరవుతున్నరు.

1997 ఏపీపీఎస్సీ బ్యాచ్‍ రిక్రూట్‍మెంట్‍..

ఉమ్మడి ఏపీలో స్కూల్‍ అసిస్టెంట్‍ ఉద్యోగాల కోసం అప్పటి సర్కారు 04/1997 నోటిఫికేషన్‍ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‍ పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ (ఏపీపీఎస్సీ) ద్వారా టీచర్లను ఎంపిక చేసింది. మూడంచెల పద్దతిలో.. 100 మార్కుల ఆబ్జెక్టివ్‍, 200 మార్కుల డిస్క్రిప్టివ్​, చివర్లో ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు చేపట్టింది. మెరిట్‍ ప్రకారం 70 శాతం లో కల్​ కోటా కాగా, మరో 30 శాతం నాన్​లోకల్​కు  కేటాయించారు. రిక్రూట్‍మెంట్‍ ప్రాసెస్‍ అనంతరం వీరంతా 1999లో వారికి కేటాయించిన పాఠశాలల్లో స్కూల్‍ అసిస్టెంట్‍ టీచర్లుగా ఉద్యోగాల్లో చేరారు. ఈ లెక్కన 2003 నుంచి అర్హత ఆధారంగా ప్రమోషన్లు పొందాల్సి ఉండగా ఇప్పటి వరకు అది జరగడంలేదు.

జోనల్‍.. కాదు కాదు డిస్ట్రిక్ట్​..

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‍ ఆధారంగా జోనల్‍ స్థాయి స్కూల్‍ అసిస్టెంట్‍ టీచర్లుగా వీరంతా ఎంపికైనా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీరి ఎంపిక తీరును జిల్లా కేడర్‍ అని చెప్పింది. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి నియామకాలు ఏంటి.? జోనల్‍, స్టేట్‍ లెవల్‍ రిక్రూట్‍మెంట్‍ ఏంటనేది చూసినా.. తాము జోనల్‍ స్థాయిలోకి వస్తామని టీచర్లు నెత్తి నోరు కొట్టుకున్నారు. ఏపీపీఎస్సీ తరఫున రిక్రూట్‍మెంట్‍ అంటేనే జోనల్‍ స్థాయనే విషయాన్ని ఏండ్ల తరబడి చెబుతూనే ఉన్నారు. ఒకవేళ తామంతా జిల్లాస్థాయి ఎంపికలో వచ్చి ఉంటే.. అభ్యర్థుల ఎంపిక లోకల్​ కోటా 80 శాతం.. నాన్​లోకల్​ 20 శాతంగా ఉండేదని చెప్పారు. తమది జోనల్‍ స్థాయి కాబట్టే వాటి నిబంధనల ప్రకారం లోకల్‍ 70 శాతం.. నాన్‍ లోకల్‍ 30 శాతంతో మొత్తం 480 మందిని ఎంపిక చేశారన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో ఎంపిక జరిగితే ఉద్యోగులందరినీ కేవలం వారివారీ జిల్లాలో మాత్రమే కేటాయిస్తారని, తమది జోనల్‍ స్థాయి కాబట్టే జిల్లాలతో సంబంధంలేకుండా ఇతర జోన్లలో కేటాయించారని వివరించారు. ఆధారాలను ప్రజాప్రతినిధులతో పాటు సంబంధితశాఖ ఉన్నాతాధికారుల ముందు పెట్టారు. అయినా ఇప్పటికీ ఫలితం దక్కలేదు.

ప్రమోషన్‍లేని రిటైర్‍మెంటే ఇక.. 

పోలీస్‍, రెవెన్యూ వంటి ఇతర డిపార్టుమెంట్లలో తమ బ్యాచ్‍లో ఇదే కేడర్‍ గవర్నమెంట్‍ జాబ్‍ పొందినవారు మూడు, నాలుగు ప్రమోషన్లు తీసుకోగా.. మాకేందుకు ఈ శిక్ష అంటూ స్కూల్‍ అసిస్టెంట్‍ టీచర్లు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 480 మందిలో కొందరు ఆంధ్రాకు వెళ్లగా మిగిలినవారు వారికి కేటాయించిన చోటే డ్యూటీలు చేస్తున్నారు. సకాలంలో తమకు ప్రమోషన్లు ఇచ్చి ఉంటే డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టుల్లో ఉండాల్సినవాళ్లు ఇంకా టీచర్లుగానే ఉండిపోయారు. టైంకు ప్రమోషన్‍ ఇవ్వకపోవడంతో జీతాలు సైతం రూ.30 నుంచి 40 వేలు పెరిగే అవకాశాన్ని కొల్పోతున్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు టీచర్లుగానే రిటైర్‍మెంట్‍ తీసుకున్నారు. ఇదిఇలా ఉంటే.. రాబోయే ఐదారేళ్లలో 50 శాతం మంది ఉద్యోగులు ఒక్క ప్రమోషన్‍ లేకుండానే  రిటైర్​కావాల్సిఉంటుందని ఆవేదన చెందుతున్నారు.

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మరిచిన్రు..

జోనల్‍ స్థాయి స్కూల్‍ అసిస్టెంట్లకు జరుగుతున్న అన్యాయంపై 2018 మార్చి అసెంబ్లీ జీరో అవర్‍లో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్​ మాట్లాడారు. ఏండ్ల తరబడి ప్రమోషన్లు లేక, జీతాలు పెరగక టీచర్లు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాగా, స్కూల్‍ అసిస్టెంట్లు జోనల్‍ పరిధిలో వస్తారా.. జిల్లా పరిధిలోకి వస్తారా.. అనే అంశంపై నాటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, లక్ష్మణ్​ మధ్య వాడివేడి చర్చ నడిచింది. నొటిఫికేషన్‍, ఎంపిక విధానంపై ఎమ్మెల్యే స్పష్టత ఇచ్చారు. ఏవైనా టెక్నికల్‍ ఇష్యూస్‍ ఉంటే క్లియర్‍ చేసి త్వరితగతిన వారికి న్యాయం చేయాలని లక్ష్మణ్​ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. రిక్రూట్‍మెంట్‍ విధానాన్ని మరోమారు పరిశీలించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం టీచర్లు.. మంత్రితో పాటు నాటి చీఫ్‍ సెక్రటరీ, ప్రిన్సిపల్‍ సెక్రటరీలను కలిసి వారివద్ద ఉన్న వివరాలు అందించారు. ప్రభుత్వం సైతం వీరి రిక్రూట్‍మెంట్‍ ఏ పరిధిలోకి వస్తుందనే ఇన్ఫర్మేషన్‍ కోసం ఆంధ్రప్రదేశ్‍ పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍కు లేఖ రాసింది. కాగా, 1997 స్కూల్‍ అసిస్టెంట్ల ఎంపిక జోనల్‍ స్థాయిలో వస్తుందని.. కేవలం నియామకం మాత్రమే డీఈఓ పరిధిలో చేశారంటూ ఏపీపీఎస్సీ సైతం బదులిచ్చింది.