- ఫైర్ అయితున్న ఉద్యోగులు, ఆఫీసర్లు
- జనవరి 31 కే పూర్తి reచేయాలని కేసీఆర్ ఆదేశం
- సీఎం ఆర్డర్లూ పట్టించుకోవడం లేదని ఉద్యోగుల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: అన్ని శాఖల్లో ప్రమోషన్లు పూర్తి అయినప్పటికీ సీఎస్ సోమేశ్ కుమార్ ఇన్చార్జ్గా ఉన్న శాఖల్లో మాత్రం ఇంత వరకు ప్రమోషన్ల ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. దీనిపై ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనవరి 31 కల్లా అర్హత ఉన్న ఉద్యోగులు, అధికారులు అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా అమలు చేయడం లేదంటున్నరు. రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, ప్రిన్సిపల్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ డిపార్ట్ మెంట్లలో ఇంత వరకు ఒక్కరికీ ప్రమోషన్ ఇవ్వక పోవడంపై ఉద్యోగులు, అధికారులు మండిపడుతున్నారు.
కీలక శాఖలో ప్రమోషన్లు లేవ్
సెక్రటేరియట్ లో ప్రమోషన్లు ఇస్తే సుమారు 130 మందికి ప్రయోజనం కలగనుంది. అయితే గతంలో ఇచ్చిన ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని ఓ ఉద్యోగి కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ అభ్యంతరాలను రివ్యూ చేయాలని కోర్టు చెప్పింది. దీన్ని సాకుగా చూపి ప్రమోషన్లు ఆపారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే రెండేళ్ల నుంచి ప్రమోషన్లు ఇవ్వలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక రెవెన్యూ శాఖలో ఇటీవల డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లుగా పలువురికి ప్రమోషన్లు రావాల్సి ఉండగా ఇంకా ఇవ్వలేదు. ఎక్సైజ్ దేవాదాయ శాఖ, రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ లో కూడా ప్రమోషన్లు ఇవ్వలేదు. సాధారణంగా ఏటా ఏర్పడే ఖాళీలను బట్టి అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తుంటారు. ఇందుకోసం ప్రతి సెప్టెంబర్ 1 నుంచి తర్వాతి ఏడాది ఆగస్టు 31 వరకు ఒక ప్యానల్ ఇయర్ గా సర్కార్ నిర్ణయించింది. కానీ చివరి సారిగా 2018లో ప్రమోషన్లు ఇచ్చారు. మళ్లీ ఈ ఏడాదే ఇస్తున్నారు.
ఎండోమెంట్ లో మంత్రి వర్సెస్ కమిషనర్
దేవాదాయ శాఖలో చాన్నాళ్లుగా ప్రమోషన్లపై వివాదం నడుస్తోంది. ఈ అంశంలో మంత్రి ఒకటి చెబితే కమిషనర్ మరొకటి చేస్తున్నారని చర్చ జరుగుతోంది. కొంత మందికి మేలు చేసేందుకు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా కమిషనర్ పక్కన పెడుతున్నారని ఉద్యోగులు అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం కమిషనర్ పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. కమిషనర్ తీరుపై కొందరు ఉద్యోగులు ఈ మధ్య మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రమోషన్లు ఇవ్వలేదు
ప్రమోషన్లపై స్వయంగా సీఎం ఇచ్చిన ఆదేశాలు కింది స్థాయిలో అమలు గాని దారుణ స్ధితి నెలకొంది. సెక్రటేరియెట్, అసెంబ్లీలో ఇతర అనేక శాఖలలో ప్రమోషన్లు రాక ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లో రెండు నెలల్లో కనీసం 200 మంది కూడా ప్రమోషన్లు ఇవ్వలేదు. అటవీశాఖలో కేవలం 44, ఉపాధి కల్పన శాఖ లో 21 మాత్రమే ఇచ్చారు. ఎక్సైజ్ శాఖలో డీపీసీ ( డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ) అయినప్పటికీ ప్రమోషన్లు రావాల్సిన ఉద్యోగుల ఫైల్ పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ మరో వంద మందికి ప్రమోషన్లు రావాల్సి ఉంది. సీఎస్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉండడం అంతలోనే ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆరు వేల మందికి ప్రమోషన్లు ఆగిపోయినయ్. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ఇంకా చేపట్టలేదు.
– ఫైనాన్స్ డిపార్ట్ మెంట్కు చెందిన ఓ ఆఫీసర్