ఆ తల్లి బాధ చూసి బెయిల్ ఇస్తున్నాం.. యువతను నిందించి ఏం ఉపయోగం : కోర్టు కీలక వ్యాఖ్యలు

ఆ తల్లి బాధ చూసి బెయిల్ ఇస్తున్నాం.. యువతను నిందించి ఏం ఉపయోగం : కోర్టు కీలక వ్యాఖ్యలు

తల్లిపై కత్తితో దాడి చేసిన యువకుడికి బెయిల్ మంజూరు చేసింది కేరళ హైకోర్టు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిపై దాడి చేశాడు 25ఏళ్ళ సమ్మిల్. సమ్మిల్ కి బెయిల్ మంజూరు చేసిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువతను నిందించి ఏం ఉపయోగం లేదని.. తమ పిల్లల ప్రవర్తన, నడవడికపై తల్లిదండ్రులు ఎప్పడూ నిఘా ఉంచాలని వ్యాఖ్యానించింది కోర్టు.

సమ్మిల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన పీవీ కున్ని కృష్ణన్ నేతృత్వంలో సింగిల్ జడ్జి బెంచ్ ఈమేరకు వ్యాఖ్యలు చేసింది.ఈ తరం యువత మానసిక స్థితి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కోర్టు.. ఈ కేసులో తల్లి ఆవేదన చూసి బెయిల్ ఇస్తున్నామని.. ఇలాంటి విషయాల్లో యువతను నిందించి ఉపయోగం లేదని అభిప్రాయపడింది.

న్యూఇయర్ రోజు ఏం జరిగింది:

న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు సమ్మిల్ తల్లిని డబ్బులు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేందుకు తల్లి ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుండి కోపంగా వెళ్లిపోయిన సమ్మిల్ తిరిగి ఇంటికి వచ్చి కత్తితో తల్లిపై దాడికి పాల్పడ్డాడు.ఈ దాడిలో సమ్మిల్ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో 2025 జనవరి 1న సమ్మిల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సమ్మిల్ ను జైలుకు తరలించారు.

ALSO READ | చర్చ జరగాల్సిందే.. ఓటింగ్ అక్రమాలపై రాహుల్ పట్టు.. హిందీ, డీలిమిటేషన్ అంశాలపై దద్ధరిల్లిన పార్లమెంట్

అయితే.. తన కొడుకును జైల్లో చూడలేకపోతున్నానని... బెయిల్ మంజూరు చేయమని కోరుతూ తల్లి పిటిషన్ దాఖలు చేయడంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. తల్లి పిటిషన్ పై విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఈ బెయిల్ పిటిషన్లో ఒక తల్లి ఆవేదన, కన్నీళ్లు ఉన్నాయని.. ఆమె ఒంటిపై కొడుకు చేసిన గాయాలు ఇంకా మనకపోయినా తల్లి ప్రేమ ఆ గాయాలను అధిగమించిందని భావిస్తున్నట్లు పేర్కొంది ధర్మాసనం.

తల్లి ఆవేదన చూసి బెయిల్ మంజూరు చేస్తున్నామని.. యువత ఆలోచనాతీరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది కోర్టు. ఈ విషయంలో కేవలం యువతను నిందించి లాభం లేదని.. యువత ప్రవర్తనపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఎంతో అవసరమని పేర్కొంది కోర్టు.