- పాత పైపులు, క్వాలిటీ లేని పనులు
గద్వాల, వెలుగు: గట్టు లిఫ్ట్ పనుల్లో క్వాలిటీ కనిపించడం లేదు. పాతపైపులు, నాసిరకం పనుల కారణంగా ఇది మరో ర్యాలంపాడు అవుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆనకట్ట పనుల్లో నల్లమట్టి వేసి రోలింగ్ చేయట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా రిజర్వాయర్ మట్టితోనే పనులు కానిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పాత పైపులే దిక్కు..
రూ.581 కోట్ల అంచనాతో పనులు ఖరారు కాగా, రూ.328 కోట్లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం అప్రోచ్ ఛానల్, పంప్ హౌస్, మెజర్మెంట్ పైప్ లైన్, రిజర్వాయర్ పనులకు టెండర్లు ఖరారు అయ్యాయి. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పాత పైపులను తీసుకొచ్చారు. వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండానే పడేశారు. ఈ ప్రాజెక్టుకు వాడే పంపులను కూడా అక్కడి నుంచే తీసుకువస్తున్నారు. 50 రోజులు నీటిని ఎత్తి పోసేలా పంపులను డిజైన్ చేశారు. 3 మీటర్ల డయా ఉన్న పైపుల ద్వారా 810 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే విధంగా ప్లాన్ చేశారు. నడిగడ్డలో ముఖ్యమైన ప్రాజెక్టుకు పాత పైపులు వాడడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ పనులను 18 నెలల్లో కంప్లీట్ చేయాల్సి ఉన్నా స్లోగా జరుగుతున్నాయి. 8 నెలలు గడస్తున్నా 10 శాతం పనులు కూడా కంప్లీట్ కాలేదు. ఇక ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నాసిరకంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కట్ట నిర్మాణం కోసం ట్రంచ్ కింది భాగాన్ని లెవెల్ చేసి నల్లమట్టి నింపాలి. ఆ తర్వాత రోలింగ్ చేసి లేయర్లుగా మట్టిని నింపాలి. కానీ ఇవేవీ లేకుండా టిప్పర్లతో ఇష్టానుసారంగా పునాదిని నింపేస్తున్నారు. ఇలా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండడంతో ర్యాలంపాడు రిజర్వాయర్ మాదిరిగానే ఈ ఆనకట్ట పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
ఎకరా భూమి సేకరించలే..
గద్వాల నియోజకవర్గంలోని గట్టు, కేటిదొడ్డి మండలాల్లో 3 వేల ఎకరాలకు, చెరువుల కింద 30 వేల ఎకరాలకు నీరు అందించేందుకు చేపడుతున్న ఈ లిఫ్ట్ కోసం 953 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక ఎకరా కూడా సేకరించకుండానే పనులు స్టార్ట్ చేశారు. కట్ట నిర్మాణం, అప్రోచ్ కెనాల్, ప్రెజర్ మెయిల్ కోసం 134 ఎకరాలు,.ముంపునకు గురయ్యే 819 ఎకరాలతో కలిపి 953 ఎకరాలు అవసరం. ఎన్నికల ముందు పనులను స్టార్ట్ చేసిన ప్రభుత్వం ఇప్పటికీ భూసేకరణ చేయకపోవడం గమనార్హం.
సర్కారు చిన్నచూపు..
నడిగడ్డలో చేపట్టే ప్రతీ ప్రాజెక్టుపై సర్కారు చిన్నచూపు చూస్తుందనే విమర్శలున్నాయి. గత ఎన్నికల ముందు తుమ్మిళ్ల లిఫ్ట్ పనులకు పాత పైపులు, పంపులు తీసుకొచ్చి బిగించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఊసేత్తడం లేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే పనులు స్టార్ట్ చేసి ఏడాదిలోగా పనులు కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ముందు గట్టు లిఫ్ట్ కు టెండర్లు పిలిచారు. భూసేకరణ చేయకుండానే పనులు చేస్తుండడంతో సర్కారు తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల ప్రకారమే..
నిబంధనల ప్రకారం పనులు చేస్తున్నాం. మా పర్యవేక్షణలోనే పనులు జరుగుతున్నాయి. పాత పైపులకు ట్రీట్మెంట్ చేశాకే వినియోగంలోకి తీసుకొస్తాం. పోస్ట్ ఫార్మేబులింగ్ టెస్టులు చేస్తున్నాం. ఆ తర్వాతే నల్ల మట్టి వేసేందుకు పర్మిషన్ ఇస్తున్నాం.
–రహీముద్దీన్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఇన్చార్జ్