- సిటీలో ఫుడ్ నాణ్యతపై జనం కంప్లయింట్లు
- డైలీ బల్దియాకు20కిపైగా వస్తున్నయ్
- నిర్లక్ష్యం వీడని హోటల్స్, రెస్టారెంట్లు
- గతేడాది 1,500కు పైగా నోటీసులు జారీ చేసిన బల్దియా
- 150కి పైగా కేసులు నమోదు చేసిన అధికారులు
- ప్రస్తుతం 120 క్రిమినల్ కేసులపై కోర్టుల్లో విచారణ
హైదరాబాద్, వెలుగు: సిటీలో ఫుడ్ సేఫ్టీపై బల్దియాకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ట్విట్టర్, మై జీహెచ్ఎంసీ యాప్, హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు రోజుకు 20కిపైగా కంప్లయింట్లు చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీ, సూపర్ మార్కెట్ల నుంచి ఆఫీసర్లు శాంపిల్స్ తీసుకుంటున్నారు. అయితే.. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెలకు ఆరు శాంపిల్స్సేకరించాల్సి ఉంటుంది. ఇలా 22 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నెలకి దాదాపు140 శాంపిల్స్ తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధికారిక లెక్కల్లో మాత్రం కనిపించడం లేదు. శాంపిల్స్ సేకరించిన వాటి రిపోర్టులు వచ్చేందుకు టైం పడుతుందని చెబుతూ అధికారులు దాటవేస్తున్నారు. ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదుదారులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై అధికారులను అడిగితే శాంపిల్ సేకరించి షోకాజ్ నోటీసులు జారీ చేయడం వరకు మాత్రమే తమ డ్యూటీ అని, పెనాల్టీలను జాయింట్‌కలెక్టర్లు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతేడాది పలుచోట్ల తనిఖీలు చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేసిన అధికారులు 1500కుపైగా నోటీసులు జారీ చేశారు. 150 వరకు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం 120 క్రిమినల్ కేసులకు సంబంధించి కోర్టుల్లో విచారణ కొనసాగుతుంది. కేసులు బుక్ చేస్తున్నా కూడా హోటల్స్, రెస్టారెంట్లతో పాటు సూపర్ మార్కెట్లు, స్టోర్లలో మార్పు కనిపించడం లేదు. గ్రేటర్లో కోటికిపైగా జనాభా ఉండగా, అధికారులు కేవలం 22 మంది మాత్రమే ఉండటంలో అన్నిచోట్లతనిఖీలు నిర్వహించలేకపోతున్నారు. ఫుడ్ సేఫ్టీపై బల్దియాతో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ )కు కూడా ఫిర్యాదులు చేస్తున్నారు.
స్టాంపులు ఉండట్లే..
సిటీలోని షాపుల్లో ఔట్ డేటెడ్ మాల్ అమ్ముతున్నారు. పాలు, పెరుగు, బ్రెడ్‌తో పాటు పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్ల వరకు అన్ని అలాగే లభిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్టాంపు లేకుండానే వస్తువులు మార్కెట్లోకి అమ్మకానికి వస్తున్నాయి. వంటలోకి వాడే పొడులు, మసాలాలపై అసలు ఎలాంటి ముద్ర ఉండటం లేదు. ఇలా ఎప్పుడు తయారైందనే విషయం కూడా తెలియడం లేదు. ఔట్ ఆఫ్ డేట్‌పై ప్రజల్లో కూడా అవేర్ నెస్ లేకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ఏది పడితే అది తింటూ అనారోగాల పాలవుతున్నారు. పరిస్థితి మితిమీరుతుండటంతో కొందరైతే ఏకంగా హాస్పి టల్స్‌లో చేరుతున్నారు. చిన్న పిల్లలు తినే స్నాక్స్ ప్యాకెట్లు అయితే నకిలీ పేర్లతో పిల్లలను ఆకట్టుకు నేలా అనేక రకాల్లో కిరాణ షాపుల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. బ్రాండెడ్ తరహాలోనే ఈ ప్యాకెట్లు ఉంటున్నాయి. కానీ వీటిపై ఎటువంటి ముద్రలు ఉండటంలేదు. బ్రాండెడ్ ప్యాకెట్లతో పోలిస్తే వీటిపై ఎక్కువ బెనిఫిట్ ఉండటంతో షాపుల యజమానులు కూడా వీటినే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో చిన్నారులు క్వాలిటీ లేని ఫుడ్‌ను తీసుకొని రోగాల బారినపడుతున్నారు.
అసలు ముద్రించట్లే, ఉన్నది కనిపించట్లే..
ప్యాకింగ్ వస్తువులపై కొన్నింటికి తయారు చేసిన తేదీలతో పాటు వినియోగించే తేదీలను అసలు ముద్రించడం లేదు. ముద్రించిన వాటిపై కూడా కనిపించడం లేదు. పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తుల వస్తువులను ఎక్కువగా రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచి అమ్ముతున్నారు. వినియోగించే తేదీలు ఉండకపోవడంతో వారం రోజులైనా కూడా వాటినే అమ్ముతున్నారు. షాపు యజమానులపై నమ్మకంతో తీసుకెళ్లి వాడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీలవి కూడా సిటీలోని ఏ షాపుకి వెళ్లి చూసినా పాలు, పెరుగు, బ్రెడ్ ప్యాకెట్లు మరుసటి రోజు కాలం చెల్లుతుండటం లేదా కాలం చెల్లినవే ఉంటున్నాయి. ఇలా అనేక రకాల వస్తువులు ఇలాగే అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్స్ విషయానికొస్తే వెహికల్స్ పై అమ్ముతున్న వాటిపై ఎలాంటి ముద్రలు ఉండటం లేదు. ఎప్పుడు తయారైందని, ఎప్పటి వరకు తినొచ్చనే వివరాలు కూడా ఉండటం లేదు.
“ అంబర్‌పేటకు చెందిన ప్రభ.. వారం కిందట ఫ్రెండ్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని బావర్చీలో బిర్చానీ తినేందుకు వెళ్లింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా, లెగ్ పీస్ కి కోడి ఈకలు కనిపించాయి. ఇదేంటని రెస్టారెంట్ సిబ్బందిని ప్రశ్నించగా మరో పీస్ ఇస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.’’
“ ఇటీవల జియాగూడకి చెందిన ప్రవీణ్ ఓ బండి వద్ద ఐస్ క్రీమ్ కొన్నాడు. దానిపై ఎలాంటి కంపెనీ లేబుల్ లేదు. ఎప్పుడు తయారు.. గడువు తేదీ కూడా లేదు. తార్నాకకు చెందిన ఐస్‌క్రీమ్ కంపెనీ పేరుతో పాటు ఫోన్ నంబర్ మాత్రమే ఉంది. ఆ నంబర్‌కు కాల్ చేసి ప్రశ్నించాడు. క్షమించండి కంపెనీలో మెషీన్ ఇటీవలే కొనుగోలు చేశా. కొద్దిరోజుల్లో ఇబ్బంది ఉండదని ఐస్ క్రీమ్ కంపెనీ ఓనర్ సమాధానంగా చెప్పాడు.’’
“ ఉప్పల్‌కు చెందిన కొంపల్లి రాజు నాలుగు రోజుల కిందట ఉప్పల్‌లోని పిస్తాహౌస్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, చికెన్ పీస్ ఉడకలేదు. సిబ్బందిని ప్రశ్నిస్తే సారీ ఇంకో బిర్యానీ ఇస్తామని నచ్చజెప్పారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’’