కూడంకుళం ప్లాంట్ కోసం రష్యా నుంచి ‘కోర్ క్యాచర్’
రియాక్టర్ ప్రెజర్ వెజెల్, ఇతర ఎక్విప్మెంట్స్ పంపిన రష్యా
తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌లో నాలుగో యూనిట్ ఏర్పాటుకు అత్యవసరమైన పరికరాలు వచ్చే నెల ఇండియాకు చేరనున్నాయి. రియాక్టర్ ప్రెజర్ వెజెల్, కోర్మెల్ట్ లోకలైజేషన్ డివైస్ (కోర్ క్యాచర్/సీఎల్ఎండీ), ఇతర అత్యవసరమైన పరికరాలను రష్యన్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ ‘రాస్ఆటమ్’ షిప్పింగ్ చేసింది. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి షిప్పులో బయలుదేరిన ఈ ఎక్విప్ మెంట్1,500 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత జనవరిలో ఇండియాకు చేరతాయని రాస్ఆటమ్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ క్వాషా వెల్లడించారు. ‘‘సంవత్సరం చివరలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒప్పందం ప్రకారం కూడంకుళంలోని యూనిట్ 4 కు అవసరమైన కోర్ క్యాచర్, దాని ఇంటర్నల్ పార్ట్స్, స్టీమ్ జనరేటర్ల వంటి అత్యవసరమైన పరికరాలను పంపించగలిగాం” అని ఆయన చెప్పారు. న్యూక్లియర్ రియాక్టర్లో ప్రమాదం జరిగి, కోర్ భాగం డ్యామేజ్ అయ్యే సందర్భాల్లో ద్రవరూపంలోని కోర్ మెటీరియల్‌ను చల్లార్చి, లీక్ కాకుండా చేయడంలో సీఎల్ఎండీ ఉపయోగపడుతుందన్నారు. ఇది ఎంత పెద్ద ప్రమాదం జరిగినా, వాతావరణంలోకి రేడియో యాక్టివ్ ఎమిషన్ జరగకుండా అడ్డుకుంటుందని చెప్పారు. అలాగే యూనిట్ 3, 4లకు అవసరమైన వాల్వ్‌లను కూడా తయారు చేస్తున్నామని తెలిపారు. కూడంకుళంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రెండు యూనిట్లలోని వీవీఈఆర్ రియాక్టర్లను రష్యానే తయారు చేసింది. వాటికి ఫ్యూయెల్ పెల్లెట్స్నూ రాస్ఆటమ్ ఫ్యూయెల్ డివిజన్ ‘టీవీఈఎల్’ సరఫరా చేస్తోంది. మనదేశంలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు ఎక్విప్ మెంట్స్, ఫ్యూయెల్ సరఫరా చేస్తున్న సంస్థల్లో రాస్అటామ్ మొదటిస్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.