మబ్బులే తప్ప చినుకుల్లేవ్

మబ్బులే తప్ప చినుకుల్లేవ్
  • ఒక్క ఆసిఫాబాద్​లోనే ఫుల్ వానలు.. రాష్ట్రవ్యాప్తంగా నిల్​
  • జైనూర్​లో 12.6 సెంటీమీటర్ల వర్షపాతం

వెలుగు, ఆసిఫాబాద్ / నెట్​వర్క్: తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించినా, మంగళవారం రాష్ట్రంలో వానలు పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా మబ్బు పట్టినా ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జైనూర్ లో అత్యధికంగా12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లో సింగరేణి ఓపెన్​కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఈ మూడు ఏరియాల్లో మంగళవారం 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనూ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అశ్వాపురం, దుమ్ముగూడెం ఏరియాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  జూలూరుపాడులో 5.8 సెంటీమీటర్లు, మణుగూరు, చర్ల, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో 4 సెంటీమీటర్లు, సుజాతనగర్, కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి,  మండలాల్లో 3 సెంటీమీటర్లు నమోదైనట్లు ఆఫీసర్లు ప్రకటించారు. కాగా, ఖమ్మం జిల్లావ్యాప్తంగా జల్లులు పడ్తున్నాయి. సత్తుపల్లిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటలలో 23.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోధన్ మండలంలో అధికంగా 44 మిల్లీమీటర్లు నమోదు కాగా, నిజామాబాద్​లో 39 మిల్లీమీటర్లు రికార్డు అయింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో అత్యధికంగా 20.5 మిల్లీమీటర్లు నమోదైంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్​, మహబూబ్​నగర్​జిల్లాల్లో మబ్బులే తప్ప వానలు పడలేదు. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి.

కుమ్రంభీమ్ ప్రాజెక్టు 2 గేట్లు ఓపెన్​

ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాల వల్ల కాగజ్ నగర్ మండలం అందేవెల్లి దగ్గర పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బ్రిడ్జి కూలిపోయిన చోట రాకపోకలు బంద్ అయ్యాయి. సోమవారం వరకు వాగులో నీటి ప్రవాహం తక్కువ ఉండడంతో ప్రజలు నీటిలో నడుస్తూ వెళ్లారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల  పెద్దవాగు వరద పెరగడంతో తాత్కాలిక వంతెనకు బుంగ పడింది. దీంతో 54 గ్రామాలకు రాకపోకలు బందై కనెక్టివిటీ తెగిపోయింది. 

ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కుమ్రంభీం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1300 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ రిజర్వాయర్ కెపాసిటీ 10 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.8 టీఎంసీల వాటర్ నిల్వ ఉంది. గతేడాది వరదలకు కట్ట పూర్తిగా దెబ్బతినడంతో కవర్లు కప్పి కాపాడారు. ఏడాది గడుస్తున్నా రిపేర్లు చేయించకపోవడంతో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. దీంతో మంగళవారం రెండు గేట్లు ఎత్తి.. వరదను దిగువకు వదులుతున్నారు.

నాలుగు రోజులు వర్షాలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని మంగళవారం ప్రకటించింది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా అన్నాసాగర్​లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్​ జిల్లా నర్సాపూర్​లో 3.2, సంగారెడ్డి జిల్లా పాల్వట్లలో 2.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.