- రాజీవ్ స్వగృహ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తలే!
- ఫుల్పేమెంట్ చేసినా పట్టించుకుంటలేరు
- ఆలస్యం చేస్తుండడంతో పైసలు వాపస్ ఇవ్వాలని డిమాండ్
- రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వని ఆఫీసర్లు
మహబూబ్‌నగర్, వెలుగు: సర్కారే ప్లాట్లు అమ్ముతుండడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకున్నారు. అప్పులు చేసి మరీ డబ్బులు కట్టారు. నెలలు గడుస్తున్నా సర్కారు రిజిస్ట్రేషన్ మాటే ఎత్తకపోవడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని, ప్లాట్లు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని, లేదంటే డబ్బులు రిటర్న్ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని సారిక టౌన్ షిప్లో 240 ప్లాట్లను ఈ ఏడాది మార్చి 14 నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వం వేలం ద్వారా అమ్మింది. బిడ్లు వేసినంక ప్లాట్ల గజం ధర పెంచారని, ఇతర కారణాలతో 104 మంది డ్రాప్ అయ్యారు. మిగిలిన 136 మంది సక్సెస్ఫుల్ బిడ్డర్లు ఉండగా, వారిలో 59 మంది ఫుల్పేమెంట్ చేశారు. వీరు బిడ్డింగ్అమౌంట్ మొత్తం రూ.20.34 కోట్లకు 2శాతం రాయితీ పోగా రూ.19.94 కోట్లు చెల్లించారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌లో కలెక్టర్ ప్రొసీడింగ్ఆర్డర్స్ కూడా ఇచ్చారు. కానీ ఫుల్ పేమెంట్కట్టిన వారికి ఇంకా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయలేదు.
ముందో మాట.. ఇప్పుడో మాట
వేలం జరగకముందు నిర్వహించిన సదస్సుల్లో ఫుల్పేమెంట్ చేసినవారికి వెంటనే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తారని ఆఫీసర్లు చెప్పారు. లోన్లు తీసుకున్నవారికి మాత్రం అది క్లియర్ అయినంక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తామని అన్నారు. కానీ, ఫుల్పేమెంట్ చేసినవారికి నెల రోజులు కావస్తున్నా రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి ఆథరైజేషన్ పర్సన్‌గా ఎవరినీ నియమించలేదని తెలిసింది. పైగా కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సారిక టౌన్షిప్సెక్షన్లో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని కొందరు బాధితులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను తమనే తెచ్చుకోమని చెబుతున్నారని అంటున్నారు. అసలు ప్లాట్ బౌండరీలు ఎక్కుడున్నాయో కూడా తమకు తెలియడం లేదని చెబుతున్నారు. ఇండివిడ్యువల్ ప్లాట్లకు అయితే కొన్నవారే డాక్యుమెంట్ చేయించుకుంటారని, గవర్నమెంట్ వెంచర్లలో ఇది వర్తించదని, ఒకవేళ తాము డాక్యుమెంట్ రైటర్లతో పేపర్లు తీసుకొచ్చినా, అందులో తప్పులు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే డాక్యుమెంట్ రైటర్లను పెట్టి, వారితో పేపర్లు తయారు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
లోన్లు రాక అప్పులు
బిడ్డింగ్‌లో ప్లాట్లు విన్ అయిన చాలామందికి బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు. వారి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని లోన్లు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో లోన్లు రానివారు ప్రైవేట్ వ్యాపారుల వద్ద వడ్డీలకు డబ్బులు తెచ్చుకున్నారు. ఇప్పటికే కొందరు వడ్డీ డబ్బులు కూడా కడుతున్నారు. కానీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో చాలామంది కట్టిన పైసలు వాపస్ ఇవ్వాలని కోరుతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రెండు రూపాయల వడ్డీకి తెచ్చి కట్టామని, తీరా ఇప్పుడు ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయకుండా సతాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కలెక్టరేట్లోని ఓ సెక్షన్ తహసీల్దార్‌కు ఆథరైజేషన్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు కలెక్టరేట్లోని కొందరు ఆఫీసర్లు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉందని, అదే ఇక్కడా అమలవుతుందని అంటున్నారు. మోడల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇప్పటికే సేకరించామని, జిల్లా రిజిస్ట్రార్‌తో మాట్లాడినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. మోడల్ డాక్యుమెంట్లను ప్లాట్లు కొన్న విన్నర్లకు కూడా ఇచ్చారని, వారు ఆ మోడల్ ప్రకారం పేపర్లు తీసుకొస్తే రిజిస్ట్రేషన్లు చేస్తారని వివరిస్తున్నారు.
అప్పు చేసి కట్టిన
బిడ్డింగ్‌లో గెలుచుకున్న ప్లాట్‌ను నాకు రిజిస్ట్రేషన్ చేస్తలేరు. నా ప్లాట్ విలువ రూ.30.90 లక్షలు. 2 శాతం రాయితీ ఇస్తారనడంతో రూ.10 లక్షలు చేతిపొంటి, రూ.20 లక్షలు లోన్ తీసుకొని ఏప్రిల్ 30న కట్టిన. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలే. బ్యాంకర్లు మాత్రం మార్టిగేజ్ చేయడానికి డాక్యుమెంట్లు ఇవ్వాలని మాపై ఒత్తిడి తెస్తున్నరు. రిజిస్ట్రేషన్లకు ఇంతవరకు ఆథరైజ్డ్ పర్సన్‌ను డిసైడ్చేస్తలేరు. కలెక్టర్ బాధ్యత తీసుకోవాలె. వాళ్ల తరఫున ఆఫీసర్‌ను నియమించి రిజిస్ర్టేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలె. - సంజీవ్‌కుమార్, పాలమూరు
ఏం చెబుతలేరు
నేను ప్లాట్ విన్ అయిన తరువాత 33 శాతం కట్టిన. తర్వాత లోన్ రావడంతో మొత్తం రూ.19 లక్షలు కట్టిన. త్వరగా రిజిస్ట్రేషన్ చేయమని కవరింగ్ లెటర్ కూడా పెట్టిన. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇయ్యలే. రెండు మూడు రోజుల్లో కలెక్టర్‌ను కూడా కలిసి మాట్లాడతా. మేం మొత్తం పైసలు కట్టినం. మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇయ్యాలె. - నాగిరెడ్డి, పాలమూరు