T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు.. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌లో కీలక మార్పు

T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు..  టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌లో కీలక మార్పు

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌లో కీలక మార్పు జరిగింది. రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డేని రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆట ఆలస్యమైతే ఆటను పూర్తిచేయడానికి అదనంగా 4 గంటల 10 నిమిషాల సమయం కేటాయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. రెండో సెమీఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టు.. 24 గంటల్లోపే ఫైనల్‌లో తలపడే గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో ఐసీసీ ఈ మార్పు చేపట్టింది. 

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి సెమీఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్‌లో, రెండో సెమీఫైనల్‌ జూన్ 27న గయానా వేదికగా షెడ్యూల్ చేశారు. ఈ రెండు మ్యాచ్‌లకు రిజర్వ్ డేలు కేటాయించారు. మొదటి సెమీఫైనల్ కు వర్షం ఆటంకం కలిగిస్తే.. జూన్ 27(రిజర్వ్ డే) మ్యాచ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. ఇది బాగానే ఉంది. ఇక, రెండో సెమీఫైనల్‌ కు వరుణుడు అడ్డుపడితే జూన్ 28న రిజర్వ్ డే నిర్ణయించారు. ఇక్కడే గందరగోళం తలెత్తింది. 

ఒకవేళ నిజంగానే రెండో సెమీఫైనల్‌ పోరుకు వరుణుడు అడ్డుపడితే.. జూన్ 28న మ్యాచ్ జరిగితే, అందులో విజేతగా నిలిచిన జట్టు 24 గంటల్లోపే ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. అందునా వారు గయానాలోని ప్రొవిడెన్స్ నుండి బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వరకు దాదాపు 900 కిలోమీటర్ల దూరం  ప్రయాణించవలసి ఉంటుంది. దీనిపై విమర్శలు రాగా.. ఐసీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 

రిజర్వ్ డే లేదు..

గయానా వేదికగా జరగాల్సిన రెండో సెమీఫైనల్‌కు రిజర్వ్ డేని రద్దు చేస్తూ.. వర్షం కారణంగా ఆట ఆలస్యమైతే ఆటను పూర్తిచేయడానికి అదనంగా 4 గంటల 10 నిమిషాలు సమయం కేటాయించారు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే, సూపర్-8లో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.