రష్యా కరోనా వ్యాక్సిన్ పై సీసీఎంబీ డైరెక్టర్
ఫేజ్ 3 ట్రయల్స్ చేసుంటే డేటా బయటపెట్టాలన్న రాకేశ్ మిశ్రా
హైదరాబాద్ : సరైన ట్రయల్స్ డేటా లేకుండా రష్యా వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పలేమన్నారు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా. వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీ (సామర్థ్యం)పై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమన్నారు. ‘‘రష్యా వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీ ఏంటన్నది ఇంకా ఎవరికీ తెలియదు. వాళ్లు సరైన ట్రయల్స్ చేయనేలేదు. ఫేజ్ 3 ట్రయల్స్ లేకుండానే రిలీజ్ చేశారు. వ్యాక్సిన్ సత్తా ఏంటన్నది తేలేది ఆ స్టేజ్ లోనే. అందుకు పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ ట్రయల్స్ కు కనీసం రెండు నెలలు పడుతుంది. రష్యా నిజంగా ఫేజ్ 3 ట్రయల్స్ చేసుంటే.. ఆ డేటాను
బయటపెట్టాలి. దాన్ని అంత రహస్యంగా ఉంచాల్సిన పని లేదు’’ అని ఆయన అన్నారు. ఓ దేశం గానీ, ఓ కంపెనీగానీ ఎలాంటి ట్రయల్స్ డేటా లేకుండా వ్యాక్సిన్ ను విడుదల చేయడమంటే దాని కన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదన్నారు. తన దృష్టిలో ట్రయల్స్ లేకుండా రిలీజ్ చేసిన రష్యా వ్యాక్సిన్ అంత సేఫ్ కాదని అభిప్రాయపడ్డారు. అక్కడ వ్యాక్సిన్ వేసుకునే ప్రజలు అదృష్టవంతు లైతే వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు. వ్యాక్సిన్లను వేగంగా తయారు చేసేందుకు రెండు నెలల క్రితమే ఆ దేశం ఓ చట్టం చేసినట్టు తెలుస్తోందన్నారు. మన దేశానికి చెందిన వ్యాక్సిన్ల ట్రయల్స్ డేటా ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ ప్రారంభంలోగానీ వచ్చే అవకాశాలున్నా యని రాకేశ్ మిశ్రా అన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2 ట్రయల్స్ సక్సెస్ అయినంత మాత్రాన సరిపోదని, అసలైన టెస్ట్ ఫేజ్ 3 ట్రయల్స్ లోనే ఉంటుందని అన్నారు.
యాంటీ బాడీలు ఎన్ని రోజులుంటాయన్నది ముఖ్యమే: ఎయిమ్స్ డైరెక్టర్
రష్యా వ్యాక్సిన్ ను పెద్ద సంఖ్యలో ప్రొడ్యూస్ చేసే మన దేశానికి కెపాసిటీ ఉన్నా .. ఆ వ్యాక్సిన్ సేఫ్టీ, ఎఫికసీపై టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నా రు. వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ రావొద్దని, ఇమ్యూనిటీని పెంచి రక్షణ కల్పిస్తుందని తేలితేనే వ్యాక్సిన్ ను వాడాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తుందని తేలినా ఆ యాంటీ బాడీలు శరీరంలో ఎప్పటిదాకా ఉంటాయన్నది తెలియాల్సి ఉంటుందన్నారు.