
‘‘సిగరెట్స్ తాగడం వల్ల లంగ్స్ పాడవుతాయి’’ అనేది బేసికల్ గా అందరికీ ఉండే నాలెడ్జ్. సిగరెట్ వలన ఏర్పడే దుష్పరిణామాలపై దాదాపు అందరికీ తెలిసేలా ప్రచారం కల్పించాయి ప్రభుత్వాలు. వీటి కన్జంప్షన్ వలన టీబీ, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు కూడా పదేపదే చెప్తుంటారు. అలాంటి కేసులు నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే సిగరెట్ తాగడం వలన ఊపిరి తిత్తులే కాకుండా మరో ఐదు శరీర భాగాలు డ్యామేజ్ అవుతాయని తెలిస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే. అవేంటో చూద్దాం.
ఇవాళ (మార్చి 12) నో స్మోకింగ్ డే సందర్భంగా ధూమపానం వలన లంగ్స్ తో పాటు డ్యామేజ్ అయ్యే బాడీ పార్ట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
గుండె (Heart):
సిగరెట్ స్మోకర్స్ లో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ ఇతరులతో పోల్చినపుడు 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుందట. వీటిలో ఉండే నికోటిన్, తార్ రక్త నాళాలను కుదిస్తాయట. దీని వలన బ్లడ్ సర్క్యులేషన్ పై ప్రభావం పడి గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సిగరెట్లలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తగ్గి్స్తుంది. దీని వలన బ్లడ్ ప్రెజర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్రమక్రమంగా ఇది స్ట్రోక్ రావడానికి దారి తీస్తుంది.
మెదడు (Brain)
సిగరెట్ స్మోకింగ్ వలన జ్ఞాపక శక్తి తగ్గి డిమెన్షియా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఉండే కెమికల్స్ వలన బ్రెయిన్ సెల్స్ ను డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నాడులపై ప్రభావం పడటంతో ఏకాగ్రత, ఆలోచనా శక్తి తగ్గిపోతుంది.
చర్మం Skin:
స్కిన్ లో ఉండే న్యూట్రియెంట్స్ ను సిగరెట్ స్మోక్ తగ్గిస్తుందట. దీని వలన గ్లో లేకుండా డల్ గా మారిపోవడం, ముడతలు, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. సిగరెట్స్ వలన కొల్లేజన్ విడుదల తగ్గిపోతుంది. దీనివలన వృద్ధాప్యం వచ్చినట్లు కనిపిస్తారట. లేదంటే ఎక్కువ వయసు ఉన్న వారి స్కిన్ లా మారిపోతుందట స్కిన్. అంతేకాకుండా బ్లడ్ లో ఆక్సిజన్ తగ్గిపోవడంతో స్కిన్ చాలా డల్ గా కనిపిస్తుంది.
మూత్ర పిండాలు (Kidneys ):
సిగరెట్ తాగడం వలన కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50 శాతం అధికంగా ఉంటుంది. సిగరెట్స్ లో ఉండే విష పదార్థాలు కిడ్నీ కణాలను డ్యామేజ్ చేస్తాయి. బ్లడ్ ప్రెజర్ పెరగటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
కళ్లు (Eyes) :
సిగరెట్ తాగడం వలన కళ్లలో ఉండే సున్నితమైన రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో రక్త ప్రసరణ తగ్గిపోయి కంటి చూపు మందగించే ప్రమాదం ఉంది. నిరంతరం సిగరెట్స్ తాగడం వలన దృష్టి దోషాలు ఏర్పడే ప్రమాదం ఉంది. వయసు రీత్యా రెటీనా డ్యామేజ్ అయ్యే వారిలో కంటే మూడు రెట్లు అధికంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. దీని వలన పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే ఇప్పటి వరకు చాలా మంది సిగరెట్ స్మోకింగ్ వలన కేవలం ఊపిరితిత్తులకే ప్రమాదం అనుకునే ఉంటారు. కానీ లంగ్స్ తో పాటు బాడీలోని ముఖ్యమైన భాగాలు అన్నింటిపై సిగరెట్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాస్త ఆలోచించండి.