బీఆర్ఎస్ ​గ్రాఫ్​ ఢమాల్ కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ

బీఆర్ఎస్ ​గ్రాఫ్​ ఢమాల్ కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ
  • ఐదేండ్లలో 47% నుంచి 17%కు దిగజారిన బీఆర్ఎస్​ ఓట్​ షేర్​
  • అసెంబ్లీతో పోలిస్తే లోక్​సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్​ 
  • ఆరు నెలల గ్యాప్​లో 20 శాతం కారు ఓట్లకు గండి
  • ఆ ఓట్లన్నీ మళ్లడంతో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు
  • 14 శాతం నుంచి 35 శాతానికి ఎగబాకిన కమలం పార్టీ 
  • ఐదేండ్లలో కాంగ్రెస్​కూ పెరిగిన ఓట్ షేర్​​

హైదరాబాద్​, వెలుగు:  పదేండ్లపాటు రాష్ట్రంలో చక్రం తిప్పి, వివిధ ఎన్నికల్లో సత్తాచాటుతూ వచ్చిన బీఆర్ఎస్​క్రమంగా ఓటుబ్యాంకు కోల్పోతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 9శాతం ఓట్ షేర్ తగ్గిన బీఆర్ఎస్, 2019  పార్లమెంట్​ ఎన్నికలతో పోలిస్తే తాజా లోక్​సభ ఎన్నికల్లో ఏకంగా 25శాతం ఓట్లను కోల్పోయింది. మొత్తంగా 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు బీఆర్ఎస్​ 30శాతం ఓట్లను కోల్పోగా, అదే సమయంలో బీజేపీ 28శాతం ఓట్లను అదనంగా​ సాధించింది. గడిచిన ఐదేండ్లలో కారు ఓట్లన్నీ క్రమంగా కమలానికి టర్న్​ అయినట్లు స్పష్టమవుతున్నది.

బీఆర్ఎస్ కు మైనస్.. కమలానికి ప్లస్..

2018 అసెంబ్లీ నుంచి 2024 పార్లమెంట్ ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తే కాంగ్రెస్, బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది. బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87 శాతం, 2019 పార్లమెంట్41.29 శాతం,  2023 అసెంబ్లీ 37.62 శాతం, , 2024 పార్లమెంట్​ఎన్నికల్లో16.68 శాతం ఓట్లతో దిగజారుతున్నది. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది సీట్లు సాధించిన ఆ పార్టీ తాజా ఎన్నికల్లో జీరోకు పడిపోయింది. అదే సమయంలో బీజేపీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 శాతం, 2019 పార్లమెంట్​లో 19.45 శాతం, 2023 అసెంబ్లీలో  13.90శాతం, ఈ పార్లమెంట్​ ఎన్నికల్లో 35.08 శాతానికి తన ఓట్ ​షేర్ పెంచుకుంది. దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లకే పరిమితమైన కమలం పార్టీ, ఈ ఎన్నికల్లో 8 సీట్లు సాధించింది. అంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు క్రమంగా బీజేపీకి మళ్లినట్లు అర్థమవుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు కేవలం ఆరు నెలల వ్యవధిలో బీఆర్ఎస్ 20శాతం ఓట్లు కోల్పోవడం గమనార్హం.

కాంగ్రెస్​కూ పెరిగిన ఓట్ షేర్​..

2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2024 పార్లమెంట్ ఎలక్షన్ల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్​ ఓట్​షేర్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం, 2019 పార్లమెంట్​ఎలక్షన్లలో 29.48 శాతం, 2023 అసెంబ్లీ  ఎన్నికల్లో 39.69 శాతం, 2024 పార్లమెంట్​ఎన్నికల్లో 40.10శాతం ఓట్లు సాధించింది. మొత్తంగా ఐదేళ్లలో 11.67శాతం ఓట్లను పెంచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు సాధించిన కాంగ్రెస్​, 2023 ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. దీంతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో మూడు సీట్లకే పరిమితం కాగా తాజా ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 0.4 శాతం ఓట్లు అదనంగా రావడం విశేషం.

కేసీఆర్ గప్‌చుప్

హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల ఫలతాలపై కేసీఆర్ స్పందించలేదు. మొన్నటి వరకూ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఫలితాలు తారుమారుకావడంతో సైలెంట్ అయిపోయారు.  పార్టీ ఓటమిపైగానీ, పార్టీ కోసం కష్టపడ్డవారికి కృతజ్ఞతలు చెప్పే అంశంలోగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీలో గెలుపొందిన చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మాత్రం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ అంచనాలు అన్నీతప్పు అయ్యాయి. బీఆర్‌‌ఎస్‌ 14 సీట్లు గెలుస్తుందని, బీజేపీకి వన్ ఆర్ నన్ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ.. బీఆర్‌‌ఎస్‌కే జీరో వచ్చింది. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్‌‌ఎస్‌ కచ్చితంగా గెలుస్తుందని, కాంగ్రెస్ థర్డ్ ప్లేస్‌లో ఉంటుందని ఆయన చెపారు. 

అక్కడ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయపతాకం ఎగురవేశారు. బీఆర్‌‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌‌ డిపాజిట్ మాత్రమే దక్కించుకోగలిగి, థర్డ్‌ ప్లేస్‌కు పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో  గెలవని రఘునందన్‌రావు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని కూడా చెప్పారు. కానీ మెదక్‌లో రఘునందన్‌రావు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేసీఆర్ ఇలాగే సైలెంట్‌గా ఉండిపోయారు. గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని పదే పదే చెప్పే ఆయనే, ఓడినప్పుడు బయటకు రాకుండా సైలెంట్‌గా ఉండిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.