టీచర్లకు స్పెషల్ టెట్ లేనట్టే!

టీచర్లకు స్పెషల్ టెట్ లేనట్టే!
  • అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టనున్న విద్యాశాఖ

  • ఇన్​ సర్వీస్​ వారికి సపరేట్ టెట్ రూల్ లేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు.  కొత్తగా రిక్రూట్ అయ్యే టీచర్లతో పాటు ప్రమోషన్లు పొందే టీచర్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి అని నేషనల్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఫర్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీటీఈ) తీసుకొచ్చిన నిబంధనతో సమస్య మొదలైంది. ఏండ్ల నుంచి టీచర్ జాబ్ చేస్తున్నా.. ప్రమోషన్ పొందాలంటే పరీక్ష రాయమనటం ఏంటని సీనియర్ టీచర్లు వాపోతున్నారు. టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ పెట్టాలనే నిబంధనేమీ లేదంటూ  విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

  •  రెండు గ్రూపులుగా విడిపోయిన టీచర్లు

ఎన్‌‌‌‌‌‌‌‌సీటీఈ  ప్రకారం..ప్రస్తుతం టెట్ క్వాలిఫై అయినవారినే  టీచర్ పోస్టుకు ఎంపిక చేస్తున్నారు. కొత్త రిక్రూటమ్ మెంట్ లో  ఈ నిబంధన అమలు చేసిన సర్కారు..సీనియర్ టీచర్ల ప్రమోషన్లకు మాత్రం  ప్రత్యేక పర్మిషన్ తో  కొన్నేండ్లు టెట్ నిబంధన అమలు చేయలేదు. అయితే, ఎన్‌‌‌‌‌‌‌‌సీటీఈ అనుమతి ఇచ్చిన గడువు ముగియడంతో అనివార్యంగా 2023 నుంచి ప్రమోషన్లకూ టెట్ నిబంధన అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని మరిచిపోయిన విద్యాశాఖ ప్రమోషన్లను పాత పద్ధతిలో నిర్వహించే ప్రయత్నం చేసింది. దాంతో కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. టెట్ క్వాలిఫై అయిన వారితోనే  ప్రమోషన్ల జాబితా ఇవ్వాలని విద్యాశాఖను కోర్టు ఆదేశించింది. దీంతో ప్రమోషన్ల ప్రక్రియ మధ్యంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలోనే టెట్, నాన్ టెట్ పేరుతో టీచర్లలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.  

  • క్వాలిఫై మార్కులతో ఇబ్బంది

ఏండ్లుగా పనిచేస్తున్న వారికీ ప్రమోషన్ పొందే టైమ్​లో ‘టెట్’ ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్​గా ప్రమోషన్ పొందాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. అయితే, చాలామంది టీచర్లు ఎస్జీటీలుగా రిక్రూట్ అయి.. ఇంకా ఎస్జీటీలుగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం లాంగ్వేజీ పండిట్లకు సబ్జెక్టులో సంబంధం ఉండదు. కానీ టెట్ ఎగ్జామ్​లో వారు సబ్జెక్టులు చదువుకోవాల్సి ఉంటుంది. కులాల వారీగా క్వాలిఫైయింగ్ మార్కులు వేర్వేరుగా  ఉండటం కూడా ఇన్ సర్వీస్ టీచర్లకు ఇబ్బందిగా మారింది.

  • టెట్ రాసే టీచర్లకు పర్మిషన్ అవసరం లేదు

రాష్ట్రంలో టీఎస్ టెట్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు సాయంత్రం నాటికి 4305 మంది ఫీజు చెల్లించగా, 4050 మంది అప్లై చేసుకున్నారు. పేపర్ 1కు 1593 మంది అప్లై చేసుకోగా, పేపర్ 2కు 2062 మంది దరఖాస్తు చేసుకున్నారని టెట్ కన్వీనర్ రాధారెడ్డి చెప్పారు. కాగా, రాష్ట్రంలో సర్కారు టీచర్లు టెట్ రాయాలనుకుంటే.. ముందుస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. అనుమతి తీసుకోవాలనే ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చారు.