ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదు: నిర్మలా సీతారామన్

ఏ రాష్ట్రాన్ని విస్మరించలేదు: నిర్మలా సీతారామన్
  • బడ్జెట్​ ప్రసంగాల్లో ప్రతి స్టేట్​ పేరు చెప్పే అవకాశం ఉండదు
  • ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ 
  • పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపాటు
  • సభ నుంచి అపొజిషన్​ సభ్యుల వాకౌట్

న్యూఢిల్లీ: బడ్జెట్​లో ఏ రాష్ట్రాన్ని తాము విస్మరించలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పే అవకాశం ఉండదని చెప్పారు. రాజ్యసభలో బుధవారం ఆమె ప్రసంగించారు. కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్​లో దేశంలోని అన్ని రాష్ట్రాల పేర్లను ప్రస్తావించే అవకాశం రాదని పేర్కొన్నారు. 

‘‘మహారాష్ట్రలోని వందవన్​లో పోర్ట్​ ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నాం. కానీ, బడ్జెట్​లో మహారాష్ట్ర పేరే ఎత్తలేదు. అలాంటప్పుడు ఆ రాష్ట్రాన్ని విస్మరించినట్టు అవుతుందా?..  ఆ రాష్ట్రం అలాగే భావిస్తున్నదా? ఆ రాష్ట్రానికి నిధులే వెళ్లవా? ” అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలది దారుణమైన ఆరోపణ అని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాలకు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే భావన ప్రజల్లో కల్పించేందుకు అపొజిషన్​పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బడ్జెట్​ ప్రసంగాల్లో అన్ని రాష్ట్రాల పేర్లు ప్రస్తావించారా? అని అడిగారు. బడ్జెట్​లో అంశాలవారీగా కేటాయింపులు ఉన్నాయని వివరించారు.

వాకౌట్​ చేసిన ప్రతిపక్షాలు

రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభనుంచి వాకౌట్​ చేశాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇది అసమతుల్య బడ్జెట్ అని మండిపడ్డారు.  బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రాల మధ్య సమతుల్యత లేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. దీన్ని ఇండియా కూటమి తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. దీనిపై నిరసన చేపడుతామని తెలిపారు.