- భగవద్గీతే స్ఫూర్తి.. శ్రీకృష్ణుడే మార్గదర్శి
- ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ: సీఎం రేవంత్‌రెడ్డి
- జనహితం కోసం ఆక్రమణలపై యుద్ధం తప్పదు
- అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదు
- ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోం.. ఎంతటివారినైనా వదలం
- అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే
- చెరువులను కాపాడుకోకపోతే హైదరాబాద్‌కు వయనాడ్ పరిస్థితేనని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: చెరువులను కబ్జా చేసినవాళ్ల భరతం పడతామని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణ బాధ్యతను చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేదని స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావొద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవని సీఎం చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిగా, శ్రీకృష్ణుడే మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మ రక్షణగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.
Also Read:-రెండు నెలలు.. 166 కూల్చివేతలు
ఎవరు ఏమనుకున్నా.. ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా.. వాటన్నిటిని పక్కనపెడ్తం. చెరువులను ఆక్రమించుకున్న వాళ్ల భరతం ఈ ప్రభుత్వం పడుతుంది” అని ఆయన హెచ్చరించారు. కోకాపేట్లో ఆదివారం హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులను చెరపట్టిన వాళ్లను, ఆక్రమించుకున్న వాళ్లను ఎవరిని వదిలిపెట్టకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచనతో హైడ్రాను తీసుకువచ్చామని తెలిపారు.
‘‘ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు, అర్జునుడు నిలబడితే ఆ ధర్మం కాపాడింది. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఈ రోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. దీనికి అందరి సహకారం కావాలి’’ అని సీఎం కోరారు. ‘‘చెరువుల్లో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌసుల్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాల్లో ఉన్న చాలా మంది వ్యక్తులవి ఉండొచ్చు. సమాజన్ని బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులవై ఉండొచ్చు. కానీ, అక్రమాల కూల్చివేతల విషయంలో రాజకీయాలకు సంబంధం లేదు. ఇది భవిష్యత్ తరాలకు సంబంధించింది. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న. రాజకీయాల కోసమో.. లేకపోతే రాజకీయ నాయకులను కొంతమంది దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కానే కాదు. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు.. వాళ్ల పిల్లలకు అందించే సంపద. చెరువులను కాపాడుకోవాలి. హైడ్రా అదే చేస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు.
కాపాడుకోకపోతే ఉత్తరాఖండ్, వయనాడ్ పరిస్థితే
చెరువులు, సరస్సులు, ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మనమీద కక్ష కడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రకృతి మనమీద కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్ లాంటి ప్రాంతాల్లో వచ్చిన వరదలే సాక్ష్యమని గుర్తుచేశారు. ఇవన్నింటిని చూసే హైదరాబాద్ నగరాన్ని రక్షించుకునేందుకు ఈ నగరానికి అందమైన చెరువులను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటున్నదని చెప్పారు. చెరువులు హైదరాబాద్ సంస్కృతి అని ..1908లో వచ్చిన వరదలు ఈ నగరం మీద ఉప్పెనలా కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నాయని సీఎం గుర్తుచేశారు.
‘‘ఆనాటి పాలకుడు నిజాం చలించిపోయి.. వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించేందుకు ఏం చేయాలనే దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నియమించుకున్నారు. ఆయన ఈ ప్రాంతాన్ని , ఈ భూమి నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని.. వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండటానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించారు. ఫిరంగి కాలువ ద్వారా మూసీ నదిని నియంత్రించి, ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చారు. గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. హైదరాబాద్ సిటీ అంటే లేక్ సిటీ” అని తెలిపారు. హైదరాబాద్‌లోని చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలి
పేద పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నారని, వారికి పోషకాహారం అందించే విషయంలో అక్షయ పాత్ర ద్వారా హరే కృష్ణ పెద్దలు ప్రభుత్వానికి సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన అంశాలని చెప్పారు. ‘‘ఇయ్యాల గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిజాం, క్యాన్సర్ హాస్పిటల్స్‌కు పేదవాళ్లు వస్తున్నారు. ఆపతిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీర్చుకోవాలో వాళ్లకు తెలియదు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ సహా ఎక్కడైతే పేదలకు ఆహారం అవసరం ఉంటుందో అక్కడ అందించడానికి హరే కృష్ణ ఫౌండేషన్ ముందుకు రావాలి. అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది” అని ఆయన హామీ ఇచ్చారు.
430 అడుల ఎత్తులో హరేకృష్ణ హెరిటేజ్ టవర్
కాంక్రీట్ జంగల్ గా మారిన కోకాపేట ప్రాంతంలో హరే కృష్ణ హెరిటేజ్ భవనం ద్వారా యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని, ఇలాంటి మహోత్తమ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 430 అడుగుల ఎత్తులో ఈ మందిరం నిర్మిస్తుండటం గర్వకారణమని చెప్పారు. ఈ నిర్మాణం 36 నెలల నుంచి 42 నెలల్లో పూర్తి చేయాలని నిర్వాహకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందే
అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘కురుక్షేత్రంలో అర్జునుడు ఆయుధాలను కిందపడేసి.. రాజ్యం కోసం నా సహోదరులందరూ ఆ పక్కన నిలుచుంటే వారిని సంహరించి రాజ్యాన్ని సాధించుకుంటే ఏం మనశ్శాంతి వస్తుందని చెప్పి యుద్ధతంత్రం నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు.. చంపించేదేవరు.. లోక కళ్యాణం కోసం నీ బాధ్యత నీవు నెరవేర్చాల్సిందే.. ధర్మం గెలవాల్సిందే... అధర్మ ఓడాలి అంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే.. అని యుద్ధనీతిని ఆనాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిండు. ఆస్పూర్తితోనే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని తీసుకుంటున్న’’ అని ఆయన తెలిపారు. ధర్మాన్ని కాపాడాలన్న శ్రీకృష్ణుడి బోధనల స్ఫూర్తిగా ప్రభుత్వం ధర్మంవైపు నిలబడుతుందని చెప్పారు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తున్నది. ఇది రాజకీయ కక్షల కోసం కానేకాదు. భవిష్యత్ తరాల మేలు కోసమే. హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పట్టించుకోం. చెరువుల ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేది లేదు. - సీఎం రేవంత్‌రెడ్డి
హైడ్రా సపోర్ట్ వాక్
గండిపేట చెరువు వద్ద ఆదివారం ఉదయం గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘హైడ్రా
సపోర్ట్ వాక్’ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రకృతి ప్రియులు, సీబీఐటీ స్టూడెంట్లతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెరువుల్లో ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాకు అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. సేవ్ లేక్స్..సేవ్ లైఫ్, హైడ్రాకు మద్దతిద్దాం-హైదరాబాద్‌ను కాపాడుకుందాం, హైదరాబాద్ మనది- హైడ్రా మనందరిది.. అంటూ నినాదాలు చేశారు.