వెపన్స్ ఇచ్చే వరకు పోడు భూముల సర్వే చేయం : ఫారెస్ట్ ఆఫీసర్లు

తమకు రక్షణ కల్పించేవరకు పోడు భూముల సర్వే చేయమని ఫారెస్ట్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో మృతి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావుకు నివాళులర్పించే కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్  సిబ్బందికి రక్షణ కల్పించి వెపన్స్ అందించే వరకు పోడు భూముల సర్వే చేయమని ధర్మపురి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనాథ్  తెలిపారు. స్టాఫ్ లేరని దాడులు చేస్తే తమ కుటుంబాలకు దిక్కు ఎవరని డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు నిలదీశారు. ఈ క్రమంలోనే కంటితడి పెట్టుకున్న పలువురు సిబ్బంది.. ఆవేదన వ్యక్తం చేశారు.

ప్లాంటేషన్​లో పశువులను మేపొద్దన్నడని గొత్తికోయలు ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​పై వేట కొడవలితో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడిన ఆయన  ఖమ్మం హస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులోని ఎర్రబోడులో ఈ ఘటన జరిగింది. అప్పటికే స్పృహ కోల్పోయిన రేంజర్​ను కారులో చండ్రుగొండ పీహెచ్​సీకి తరలించారు. బీపీ డౌనై, పల్స్ పడిపోయినట్టు గుర్తించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం  ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేంజర్​ చనిపోయారు.  శ్రీనివాసరావుకు భార్య భాగ్యలక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. దాడి విషయం తెలియగానే వారు ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. 

అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు

రేంజర్ శ్రీనివాసరావు సొంతూరు ఈర్లపూడిలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం జరగనున్నాయి. కాగా, దాడి చేసిన ఇద్దరు గొత్తికోయలు తండ్రీకొడుకులని తెలిసింది. రాత్రి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.