అమెరికా విమాన ప్రమాదం.. 67 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు..!

అమెరికా విమాన ప్రమాదం.. 67 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు..!

వాషింగ్టన్ డీసీ: అమెరికా విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విమాన ప్రమాదంలో ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడ లేదని, అందరూ చనిపోయారని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 27 మంది మృతదేహాలను విమానంలో, ఒకరి మృతదేహాన్ని హెలికాఫ్టర్లో గుర్తించినట్లు వాషింగ్టన్ డీసీ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ జాన్ ఎ.డొనెల్లీ తెలిపారు. 

ఈ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో రష్యాకు చెందిన స్కేటింగ్ ఛాంపియన్స్ కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. ఎవజెనియా సిస్కోవా, వాదిమ్ నౌమువ్ అనే రష్యన్ స్కేటింగ్ కపుల్ 1990లో వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. దురదృష్టవశాత్తూ ఈ ఇద్దరు కూడా అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.

రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్లో బుధవారం రాత్రి ఆర్మీ హెలికాఫ్టర్ను, 64 మంది ప్రయాణికులతో కూడిన విమానం గాల్లోనే ఢీ కొట్టింది. పీఎస్ఏ ఎయిర్ లైన్స్కు చెందిన బొంబార్డియర్ సీఆర్జే700 రీజనల్ జెట్, సికోర్స్కీ H-60 బ్లాక్ హాక్ ఆర్మీ హెలికాఫ్టర్ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో క్రాష్ అయిన విమానం, హెలికాఫ్టర్ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ఉండగా, హెలికాఫ్టర్లో ముగ్గురు ఉన్నారు.

ALSO READ | కంట్రోల్ టవర్ ఏం చేస్తుంది..? విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్..

విమానం కాన్సాస్లోని విచిత నుంచి వాషింగ్టన్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానం, హెలికాఫ్టర్ ఢీ కొట్టగానే గాల్లోనే పేలిపోయింది. అమెరికాలో 2009 తర్వాత ప్రయాణికులతో వెళుతున్న విమానాలు ప్రమాదానికి గురైన దుర్ఘటనలు జరగలేదని, మళ్లీ ఇప్పుడే ఈ ఘోరం జరిగిందని తెలిసింది.

ఈ దుర్ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏవియేషన్ అథారిటీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గాలిలో విమానం ఉందని హెలికాఫ్టర్ను అలర్ట్ చేయడంతో పాటు ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో హెలికాఫ్టర్ పైలట్కు కంట్రోల్ టవర్ ఎందుకు చెప్పలేదని ఏవియేషన్ అథారిటీని ట్రంప్ ప్రశ్నించారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని, ప్రమాదం జరగకుండా నిరోధించే అవకాశం ఉన్నప్పటికీ నిరోధించలేకపోవడం ఏమాత్రం బాలేదని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.