శోభిత ఆత్మహత్యపై అనుమానాల్లేవు

శోభిత ఆత్మహత్యపై అనుమానాల్లేవు
  • పోలీసులకు తెలిపిన కుటుంబసభ్యులు
  • ఉస్మానియా హాస్పిటల్​లో పోస్టుమార్టం పూర్తి
  • డెడ్ బాడీ కర్నాటకకు తరలింపు, అక్కడే అంత్యక్రియలు

గచ్చిబౌలి, వెలుగు: కన్నడ సీరియల్ నటి శోభిత శివన్న ఆత్మహత్యపై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కర్నాటక నుంచి వచ్చిన శోభిత తల్లి, అక్కాచెల్లెళ్లు సోమవారం గచ్చిబౌలి పీఎస్​లో విచారణకు హాజరయ్యారు. ఆమె ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు.

 ఉస్మానియా హాస్పిటల్​లో పోస్టుమార్టం పూర్తి కాగా, రిపోర్టులో సైతం శోభితది ఆత్మహత్యే అని తేలిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. కన్నడలో ప్రముఖ సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శోభిత హైదరాబాద్​తుక్కుగూడకు చెందిన సుధీర్​రెడ్డితో వివాహం చేసుకొని, ఇక్కడే ఉంటోంది. 

పెళ్లి తర్వాత సీరియల్స్, సినిమాలు మానేసింది. ఈ మధ్యే తెలుగు సీరియల్స్​లో అవకాశాల కోసం వెతుకుతుందని కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండడంతో డిప్రెషన్​లోకి వెళ్లి, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్నారు. 

‘యు కెన్ డూ ఇట్’ అంటూ సూసైడ్ నోట్

అయితే, శోభిత ఆత్మహత్య చేసుకున్న సంఘటనా స్థలంలో సూసైడ్​నోట్​ను పోలీసులు గుర్తించారు. అందులో ‘‘సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్’’ అంటూ రాసి ఉంది. ఈ నోట్​ను శోభిత ఎవరిని ఉద్దేశించి రాసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇప్పటికే శోభిత భర్తతో పాటు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారి స్టేట్​మెంట్లను రికార్డు చేసుకున్నారు. చనిపోయే ముందు శోభిత తన సోదరికి కాల్​చేసి తాను హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. భార్యభర్తల మధ్య ఎలాంటి విబేధాలు లేవని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీని కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియల కోసం కర్నాటకలోని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు.