తేల్చి చెప్పిన కేంద్రం.. 11వ రౌండ్ చర్చలు ఫెయిల్
న్యూఢిల్లీ/భోపాల్: కొత్త అగ్రిచట్టాలపై ఢిల్లీలో 11వసారి కేంద్ర ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన చర్చలు సక్సెస్ కాలేదు. ఇక మీదట చర్చలు జరిగే అవకాశాలు తగ్గిపోయాయి. రైతులు ఎప్పట్లాగే చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. చట్టాలను 18 నెలలపాటు అమలు చేయకుండా ఆపుతామని, ఇంతకుమించి తాము చేయగలిగింది ఏమీ లేదని స్పష్టంగా చెప్పింది. ఈ ప్రపోజల్‌కు ఒప్పుకుంటేనే తరువాతి రౌండ్ చర్చలు ఉంటాయని పేర్కొంది. చట్టాల అమలును ఏడాదిన్నర ఆపాలన్న ప్రపోజల్‌పై ఆలోచించాలంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు నచ్చజెప్పారు. చట్టాల్లో లోపం ఏమీ లేదని, అయినా సస్పెండ్ చేసేందుకు ఒప్పుకున్నామని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 41 మంది రైతు సంఘాల లీడర్లు, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చల్లో పాల్గొన్నారు. తాము తెచ్చిన ప్రపోజల్స్ బాగున్నాయని, అయినా వ్యతిరేకించడం సరికాదని మంత్రులు రైతులతో అన్నట్టు తెలిసింది. చట్టాల సస్పెన్షన్తమకు సమ్మతం కాదని, పూర్తిగా రద్దు రైతులు చేయాలని కుండబద్దలు కొట్టారు.
ఆందోళన తీవ్ర తరం చేస్తాం: రైతులు
లంచ్ తర్వాత ఇరు వర్గాలూ తిరిగి భేటీ అయి అరగంట సేపు మాట్లాడుకున్నాయి. మీటింగ్ ముగిశాక భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ జోగిందర్ సింగ్ ఉగ్రహన్ మీడియాతో మాట్లాడుతూ చర్చలు ఫెయిలయినట్టు చెప్పారు. మీటింగ్ ఐదు గంటలపాటు సాగినా, మంత్రులు తమతోపాటు అరగంట సేపే మాట్లాడారని, మూడున్నర గంటలు వెయిట్ చేయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 26న ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని, ఆందోళన తీవ్రం చేస్తామని ప్రకటించారు.
ఆందోళనలు కొనసాగాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి: తోమర్
తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ‘శక్తులు’ రైతుల ఆందోళనలు కొనసాగాలని కోరుకుంటున్నాయని తోమర్ మీడియాతో అన్నారు. చట్టాల సస్పెన్షన్‌కు ఒప్పుకుంటే శనివారం మరోసారి చర్చలకు రావాల్సిందిగా కోరామని
వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ