కొత్త పార్టీకి సమయం కాదు : బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో రాజకీయాలు నాయకుల చేరికల చుట్టూ తిరుగుతున్నాయి. తమ పార్టీలో ఎవరు చేరుతారని ఎదురుచూస్తున్న వైనం చూస్తుంటే అంతా ఇంతా కాదు ..వారి ఇండ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నిరాశ్రయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు చుట్టూ చేరికల రాజకీయాలు తిరుగుతున్నాయి. వారు నిజంగా ఏ పార్టీలో చేరతారో, పార్టీ పెడతారో తెలీదు కానీ.. వారి నిర్ణయం ఎలా ఉంటుందనేది మాత్రం అందరికీ ఆసక్తిగానే ఉంది. వారితో బీజేపీ బహిరంగంగానే చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ సైతం రాహుల్ టీమ్ చర్చలు జరిపినట్టు వారే ఒప్పుకుంటున్నారు.
ప్రస్తుతానికి కర్ణాటక ఎన్నికల ఫలితాల తదుపరి బీజేపీవైపు వారు చూడడం లేదని అర్థమవుతోంది. అయితే వారు పెడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఒకటో రెండో నియోజకవర్గాలైతే వారు ఒక పార్టీలో చేరబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇప్పటికే పది, పదిహేను నియోజకవర్గాల్లో దృష్టి పెట్టి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. చివరగా ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో కోదండరామ్ సైతం పాల్గొన్నారు. వీరు చెబుతున్నదొకటే. కేసీఆర్ ను గద్దె దించడమే మా లక్ష్యం అని స్లోగన్ ఎత్తుకున్నా అది విజయవంతం కావాలంటే వీరి ముందున్న తక్షణ కర్తవ్యమేంటి? అనేది కూడా ముఖ్యం.

కొత్తపార్టీ నిలబడలేదు

తామే ఒక టీమ్ గా ఏర్పడి, పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తే మాత్రం ఇది సమయం కాకపోవచ్చు. రెండేళ్ల క్రితమే ఈ ఆలోచన చేసి పార్టీ పెట్టి ఉంటే దానికి కొంత బలం చేకూరేది. ఈ ఎన్నికల సమయంలో నిజంగా వారు పార్టీ పెడితే కేసీఆర్ వ్యూహంలో వారు పడినట్టే. ఎందుకంటే.. గత అనుభవాలు మనకు చెబుతున్నవేంటంటే.. తెలంగాణ పేరు మీదొచ్చిన ఉద్యమ పార్టీలు నిలబడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ముందు వచ్చిన దేవేందర్ గౌడ్ పార్టీ, పీఆర్పీ, అన్ని కూడా అధికార పార్టీకే మేలు చేశాయి. మరోవైపు ఆలె నరేంద్రను, విజయశాంతి పార్టీలను కేసీఆర్ ఎలా నిర్వీర్యం చేశారో కూడా అనుభవాలున్నాయి. కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరడమే మంచిది.

ఈ ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోదండరామ్ తిరిగి అదే తప్పిదం చేస్తే కేసీఆర్​కు వాళ్లు మార్గం సుగమం చేసినవాళ్లవుతారు. వారిలో ఒక ఆలోచన ఉండొచ్చు. ఒక పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామన్న ధీమా వారిలో ఉండొచ్చు. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ కుదిరినా రెండు, మూడు సీట్ల కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండదు. కాంగ్రెస్ సాధ్యమైనంత వరకు ఒంటరిగానే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. అలాంటప్పుడు ఓ ఫ్రంట్ గా ఏర్పడి కామన్ వ్యూ పాయింట్ గా ఉండాలని వారు అనుకున్నా ప్రజా ఆమోదం ఉండకపోవచ్చు. నిజంగా వారి లక్ష్యం నెరవేరాలంటే రాజకీయ పార్టీలో చేరడమే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం వారు బీజేపీవైపు చూడడం లేదు కాబట్టి, వారు కాంగ్రెస్ లో చేరితే ముందు చెప్పినట్టుగా అది కాంగ్రెసుకి బలం, వాళ్లకీ బలం.

చారిత్రక తప్పిదం చేయొద్దు

సాధారణంగా ఒక పార్టీలో చేరాలనుకుంటే ఇన్నిరోజులు, ఇంత చర్చ ఉండదు. అందుకోసమే రాజకీయ సూచనలు కావొచ్చు, సలహాలు కావచ్చు.. ఇది కేవలం పొంగులేటి, జూపల్లి చేరికల రాజకీయం కాదు. వీరి వెనకాల ఇంకా ఎనిమిది మంది ఉన్నారనేది అర్థమవుతోంది. వారిపేరు నేనిక్కడ ప్రస్తావించకపోవచ్చు. కానీ ఒక పార్టీలో చేరాలని ప్రెజర్ బిల్డప్ చేయాలనుకోవడంలో తప్పు లేదు. అది ఒకవేళ వికటిస్తే కొత్త పార్టీగా రూపం దాల్చుకోవడం మాత్రం మరోసారి చారిత్రక తప్పిదమే అవుతుంది. అది కాంగ్రెసుకు కొంత ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ.. వారు మాత్రం రాజకీయంగా కనుమరుగయ్యే అవకాశముంది. ఎందుకంటే.. ఇది గతచరిత్ర చెపుతున్న సత్యం. ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే తప్పటడుగలు వేయకుండా, ఎదుటి వారి వ్యూహంలో పడకుండా రాజకీయ నిర్ణయం ఉంటే తప్పకుండా ఈ ఆత్మీయ సమ్మేళనాలు సరియైనవిగా మనం భావించవచ్చు.     

-  బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు