- ప్రమోషన్లు పొందినా ట్రాన్స్ ఫర్లు కావట్లే
- కొన్ని సెక్షన్లలో 20 నుంచి 30 ఏండ్లుగా పనిచేస్తున్న అధికారులు
- కొందరు సీనియర్లు నామమాత్రంగా విధులకు హాజరు
- ఓటీలతో కొంతమంది సిబ్బందిపై మరింత భారం
హైదరాబాద్, వెలుగు: వాటర్ బోర్డులో ఉద్యోగుల బదిలీలు జరగడం లేదు. 20 నుంచి 30 ఏండ్లుగా ఒకేచోట పనులు చేస్తున్న వారిని కూడా కదిలించడం లేదు. సిబ్బంది కొరత ఒక కారణమైతే, ఒకచోట నుంచి మరో చోటుకు ట్రాన్స్ఫర్ చేస్తే పనుల వివరాలు తెలుసుకునేందుకు టైమ్ పడుతుందనే ఉద్దేశంతో చేయడం లేదని తెలుస్తోంది. ఈ సాకుతో బదిలీలు చేయకపోవడంతో వాటర్ బోర్డులో చాలా మంది ఏండ్లుగా ఒకేచోట పనులు చేస్తున్నారు. బదిలీలు కావాలని కొందరు కోరుతుండగా, బదిలీ అవుతుందేమోనని భావించి ప్రమోషన్లు కూడా తీసుకోని వారు మరికొందరు ఉన్నట్లు సమాచారం.
కొందరిపైనే పనిభారం
ఒకేచోట పనులు చేస్తున్న కొందరు సీనియర్లు విధులకు నామమాత్రంగా హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లు ఇష్టానుసా రంగా డ్యూటీలకు వచ్చి వెళుతుండటంతో మిగతావారిపై పనిభారం పడుతోంది. కొందరు కేవలం అటెండెన్స్ వేసి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం ఫోకస్పెట్టకపోవడంతో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శివారు సెక్షన్లలో పరిస్థితి దారుణంగా ఉంది. కాగా వీరి పనిని ఇతరులు చేయాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో సిబ్బంది ఓటీలు కూడా చేస్తున్నారు. పలు సెక్షన్లలో ప్రతినెలా ఒక్కొక్కరు ఐదారు ఓటీలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటీలతో ఇటు వాటర్‌బోర్డు ఆదాయానికి గండి పడుతోంది.
ఔట్ సోర్సింగ్ స్టాఫే ఎక్కువ..
వాటర్‌బోర్డులో రోజురోజుకు పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తక్కువవుతోంది. రిటైర్డ్ అయిన వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయకపోతుండటంతో సిబ్బంది కొరత తీవ్రమైంది. పర్మినెంట్ స్టాఫ్‌తో పోలిస్తే ఔట్ సోర్సింగ్ స్టాఫ్ సంఖ్య ఎక్కువగా ఉంది. జీపీ(జనరల్ పర్పస్), ఎస్పీ(స్పెషల్ పర్పస్), టెక్నీషియన్ గ్రేడ్–2, జేటీవో(జూనియర్ టెక్నీషియన్ ఆఫీసర్), ఏటీవో(అసిస్టెంట్ టెక్నీషియన్) తదితర పోస్టుల్లో పర్మినెంట్ ఉద్యోగులు 3,600 మంది పనిచేస్తున్నారు. కాగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 4 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవారిని భర్తీ చేయకపోతుండంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది.
ప్రమోషన్లు ఇచ్చినా అంతే..
ప్రమోషన్లు పొందిన వారిని ఎక్కడ పోస్టు ఖాళీ ఉంటే అక్కడకు పంపించాల్సి ఉంటుంది. కానీ వాటర్‌బోర్డులో ప్రమోషన్లు పొందినవారు కూడా ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లడంలేదు. కొద్దినెలల క్రితం టెక్నీషియన్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నీషియన్ ఆఫీసర్లను బదిలీ చేసినప్పటికీ ఒక్క నెల మాత్రమే వేరే చోట పనులు చేయించి మళ్లీ మునుపటి స్థానంలోకే తీసుకొచ్చారు. రిటైర్ మెంట్‌కు దగ్గరలో ఉన్న వారైతే ప్రమోషన్లు తీసుకోకుండానే ఉన్న చోటనే పనులు చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు.
చర్యలు తీసుకుంటాం
ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తాం. ప్రమోషన్లు ఇచ్చిన వారిని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేశాం. డ్యూటీల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం.
–శ్రీధర్ బాబు, వాటర్బోర్డ్ డైరెక్టర్ అడ్మిన్