రూల్స్‌కు విరుద్ధంగా డిపార్ట్‌మెంట్ హెడ్స్ పదవీకాలం పొడిగిస్తున్న సర్కార్
స్పెషల్ రెజల్యూషన్ లేకుండా సింగరేణి సీఎండీకి మరో చాన్స్
ప్రభాకర్‌రావుకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా 7సార్లు ఎక్స్టెన్షన్
65 ఏండ్లు నిండినా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్‌గా పాపిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ కీలక విభాగాలకు వాళ్లే అధిపతులు. అందులో రిటైర్డ్ అధికారులూ ఉన్నారు. వారి పదవీ కాలం ముగిసినా ఎప్పటికప్పుడు వారికి సర్కార్ ఎక్స్టెన్షన్లు ఇస్తూనే ఉంది. బాగా పనిచేసే అధికారులు సర్వీసులో ఉన్నా.. వాళ్లను కాదని రూల్స్‌కు విరుద్ధంగా పాత వారికే ప్రభుత్వం పట్టం కడుతోంది. ఇంతకాలం జరిగిన పనుల్లో అక్రమాలు, లోపాలు, అంచనాల పెంపు వంటి విషయాలు బయటకు పొక్కుతాయన్న కారణంగానే కొత్త ఆఫీసర్లను నియమించట్లేదన్న టాక్ అధికార వర్గాల్లో నడుస్తోంది. ఎప్పుడో ఒకప్పుడు తప్పులు బయట పడతాయని, అప్పుడు ఆ ఆఫీసర్లే బలిపశువులు అవుతారని మాట్లాడుకుంటున్నారు. కీలకమైన సింగరేణి, ట్రాన్స్ కో, జెన్ కో, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లకు చీఫ్‌లను రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటిదాకా మార్చింది లేదు.
ప్రభాకర్‌రావుకు ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ సంస్థలైన ట్రాన్స్‌కో, జెన్కోలకు సీఎండీలుగా ఐఏఎస్ ఆఫీసర్లనే నియమించేవారు. రాష్ట్రం వచ్చాక రిటైరైన ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావును సీఎండీగా నియమించారు. పైగా పదవీకాలం ముగిసినా పొడిగించారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో చీఫ్ ఇంజనీర్‌గా పని చేసిన రఘుమారెడ్డిని, టీఎస్ఎన్పీడీసీఎల్లో సూపరింటెండ్ ఇంజనీర్‌గా పని చేసిన గోపాల్‌రావును సీఎండీగా కొనసాగిస్తున్నారు. వాళ్లంతా రిటైర్డ్ అధికారులే. ఐఏఎస్లైతే రూల్స్‌కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోరన్న ఉద్దేశంతోనే.. వాళ్లను పక్కనపెట్టి చెప్పిన మాట వినేటోళ్లకే సీఎండీ బాధ్యతలు అప్పగించారన్న విమర్శలున్నాయి. రాష్ట్రం వచ్చిన కొత్తలో కరెంట్ కొనుగోళ్లలో వేల కోట్ల అక్రమాలు జరిగాయని, యాదాద్రి, భదాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలను ఇష్టమొచ్చినట్టు పెంచారని ఆరోపణలున్నాయి. డిస్కంలకు అవసరం లేని పరికరాలు కొని వేల కోట్లు ఖర్చు చేశారన్న విమర్శలు వచ్చాయి.
బుజ్జగించేందుకే అడ్వైజర్ పోస్టులు!
ప్రభుత్వంలో ఒకప్పుడు కీలక పోస్టుల్లో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్లను సర్కార్ సలహాదారులుగా నియమించింది. వాళ్లు సర్వీసులో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులు, లోపాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే వారికి పదవులు ఇచ్చిననట్టు ప్రచారం ఉంది. రాష్ట్రానికి తొలి సీఎస్‌గా పనిచేసి రిటైర్ అయిన రాజీవ్ శర్మను చీఫ్ అడ్వైజర్‌గా సర్కార్ నియమించింది. ఆయన పదవీ కాలాన్ని 2024 డిసెంబర్ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే డీజీపీగా రిటైర్ అయిన అనురాగ్ శర్మను లా అండ్ ఆర్డర్ అడ్వైజర్‌గా, రిటైర్డ్ సీఎస్ ఎస్కే జోషిని ఇరిగేషన్ సలహాదారుగా, రిటైర్డ్ అడిషనల్ డీజీ ఏకే ఖాన్‌ను మైనారిటీ వెల్ఫేర్ అడ్వైజర్‌గా సర్కార్ నియమించింది.
కేంద్రం వద్దన్నా సింగరేణి సీఎండీ కొనసాగింపు
సింగరేణి సీఎండీగా ఐదేళ్లకు మించి ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి సంస్థ సీఎండీగా ఎన్. శ్రీధర్ కొనసాగుతున్నారు. ఎప్పుడో ఆయన పదవీ కాలం ముగిసినా.. ప్రభుత్వం మూడు సార్లు పొడిగించింది. తాజాగా ఈ మధ్య ఆయన పదవీ కాలాన్ని పొడిగించడంపై వివాదం నెలకొంది. బోర్డు మీటింగ్‌లో ఆయన ఎక్స్‌టెన్షన్‌ను సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. అయినా పట్టించుకోని రాష్ట్ర సర్కార్.. ఆర్డినరీ తీర్మానాన్ని ప్రవేశపెట్టి శ్రీధర్‌ను ఎక్స్టెండ్ చేసింది. నిజానికి సీఎండీ పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ప్రత్యేక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానం నెగ్గాలంటే అనుకూలంగా 70 శాతం ఓట్లు పడాలి. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం కావడం.. అప్పటికే శ్రీధర్ కొనసాగింపును కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించడంతో స్పెషల్ రెజల్యూషన్ పెట్టుంటే వీగిపోయేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆర్డినరీ రెజల్యూషన్‌ను స్పెషల్ రెజల్యూషన్గా మార్చాలన్నా 14 రోజుల ముందే కోల్ మినిస్ట్రీ నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. సీఎండీ పదవిని ఎక్స్టెండ్ చేయాలంటే ట్రైపార్టెడ్ అగ్రిమెంట్ ప్రకారం కోల్మినిస్ట్రీ అనుమతి కూడా తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే, అవేవీ పట్టించుకోకుండా శ్రీధర్‌ను కొనసాగించడాన్ని నిపుణులు, కార్మిక సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.
మురళీధర్‌కు అందుకేనా..?
రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచే నీటిపారుదల శాఖ (ఇరిగేషన్) ఈఎన్సీగా మురళీధర్ పనిచేస్తున్నా రు. రాష్ట్రం వచ్చాకా ఆయన్నే కొనసా గించారు. అప్పటి నుంచి ఇప్పటిదా కా ఆయన పదవీ కాలాన్ని 7 సార్లు పొడిగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో వేలాది కోట్ల అక్రమాలు జరిగాయని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం, పాల మూరు రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, ఇతర ప్రాజెక్టుల అంచనా ఖర్చులను పెంచి ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుల అంచనాల పెంపులో ఇరిగేషన్‌లోని ఉన్నతాధికారుల పాత్ర కీలకమని, అందుకే వారికి ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారని ఆరోపణ లు వస్తున్నాయి. జీవితకాలం పాటు ఇరిగేషన్ ఈఎన్సీగా మురళీధరే కొనసాగుతారని డిపార్ట్మెంట్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఆర్ అండ్ బీలో రిటైర్డ్ అధికారులే
ఆర్ అండ్ బీలోనూ రిటైర్డ్ అధికారులే ఈఎన్సీలుగా పనిచేస్తున్నారు. వాళ్ల పదవీ కాలాన్నీ సర్కార్ పొడిగిస్తూ వస్తోంది. బిల్డింగ్ వర్క్స్ బాధ్యతలు చూస్తున్న గణపతి రెడ్డి, రోడ్ల పనులు చూసే రవీందర్రావు ప్రగతిభవన్‌కు అత్యంత సన్నిహితులుగా మారారన్న ఆరోపణలున్నాయి. ప్రగతిభవన్ నిర్మాణం కోసం రూ.30 కోట్లకే అనుమతులున్నా.. ఇప్పటిదాకా దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే విధంగా కలెక్టరేట్లు, పోలీస్ టవర్ నిర్మాణం అంచనా ఖర్చులు రెండుమూడింతలు పెంచుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం టెండర్లు కోట్ చేసిన రేట్లు.. పని పూర్తయ్యే సరికి రెండుమూడు రెట్లు పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
మిషన్ భగీరథదీ అదే పరిస్థితి
ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథపైనా అనేక విమర్శలు, ఆరోపణలున్నాయి. వేలాది కోట్ల అక్రమాలు జరిగాయని, సబ్కాంట్రా క్టులను టీఆర్ఎస్ నేతలే తీసుకున్నా రని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పనులు దక్కించుకున్న వర్క్ ఏజెన్సీ లూ సరిగ్గా పనులు చేయలేదన్న ఫిర్యాదులున్నాయి. గతంలో భగీరథ ఈఎన్సీగా ఉన్న ఓ అధికారి.. భగీర థ పనుల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఆయన పదవీ కాలం ముగియగానే కృపాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది సర్కార్. చెప్పినట్టు వింటారని ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు రెండు సార్లే చాన్స్, అయినా..
ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవీ కాలాన్ని కేవలం రెండు సార్లే పొడిగించాలని, అది కూడా 65 ఏండ్ల లోపు వ్యక్తులనే నియమించాలని ఉన్నత విద్యామండలి యాక్ట్ 16 ఆఫ్1988 రూల్స్ చెబుతున్నాయి. కానీ, 2019 జూన్ 30 నాటికే పాపిరెడ్డికి 65 ఏండ్లు నిండాయి. కరోనా సాకుతో 2020 జులై 17న ఆయనకు సర్కార్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఆయన నియామకం చట్టవిరుద్ధమని, పాపిరెడ్డిని తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌కు ఫిర్యాదులూ వెళ్లాయి. అయితే, కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సులకు అనుమతి, సీట్ల పెంపు వంటి విషయాల్లో డబ్బు ముట్టజెప్పందే కౌన్సిల్లో పనులు కావని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి
రైతులు పంటలను మార్కెట్లోనే అమ్ముకోవాలె
ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?
పీహెచ్‌సీ నుంచే పెద్ద డాక్టర్‌కు చూపెట్టుకోవచ్చు