మానేరు బ్రిడ్జి పైనుంచి పోలేరు
40 కోట్లతో కట్టినా జనానికి పనికొస్తలే
అప్రోచ్‌రోడ్డు లేక ఇక్కట్లు
రూ. 15 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి ప్రతిపాదన
పక్కా ప్లానింగ్ లేకపోవడంతో నిధుల వృథా
పెద్దపల్లి, వెలుగు: రూ. 40 కోట్లతో పెద్దపల్లి, కరీంనగర్జిల్లాల మధ్య కట్టిన బ్రిడ్జి అది.. పూర్తయి ఏడాదవుతున్నా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రాలేదు. బ్రిడ్జి ఎక్కడ కట్టాలనే విషయంలో సరైన ప్లానింగ్లేకపోవడంతో ఇప్పుడు దానిని వినియోగంలోకి తేవాలంటే మరో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి,- కరీంనగర్ జిల్లాల మధ్య ఉన్న మానేరు నదిపై బ్రిడ్జిలు నిర్మించి రెండు జిల్లాల గ్రామాల మధ్య దూరాభారం తగ్గించాలని ఎప్పటినుంచో ప్రజలు కోరుకుంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణం కోసం గ్రామాలకు వచ్చిన అనేకమంది నేతలకు వినతిపత్రాలు అందజేశారు. టీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్మండలంలోని నీరుకుళ్ల, కరీంనగర్జిల్లాలోని మానకొండూర్మండలం వేగురుపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించింది. రూ.40.20 కోట్ల అంచనాతో 2016 జనవరిలో పనులు ప్రారంభించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయి దాదాపు ఏడాది దాటింది. నేటికీ మానేరు బ్రిడ్జి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఆఫీసర్లకు ముందుచూపు లేకుండా బ్రిడ్జి కట్టడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావాలంటే ఇప్పుడు నీరుకుళ్ల సమీపంలో రూ. 20 కోట్లతో ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక పక్క ఇట్ల.. మరో పక్క అట్ల..
మానేరు నదిపై పెద్దపల్లి, కరీంనగర్జిల్లాలను కలుపుతూ నీరుకుళ్ల, వేగురుపల్లి గ్రామాల మధ్య కట్టిన బ్రిడ్జికి రెండు వైపులా ఆప్రోచ్ రోడ్డు నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. మానకొండూర్ మండలంలోని వేగురుపల్లి గ్రామం నుంచి మానేరు వరకు సుమారు కిలోమీటర్దూరం అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం భూసేకరణ చేసిన ఆఫీసర్లు నిర్వాసితులకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడిచిన నేటికీ వేగురుపల్లి వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. మరోవైపు మానేరు బ్రిడ్జి దాటిన తర్వాత నీరుకుళ్ల మీదుగా రాజీవ్ రహదారికి వెహికల్స్వెళ్లడానికి పెద్దపల్లి- – నిజామాబాద్రైల్వే లైన్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దారిలో అండర్‌బ్రిడ్జి ఉన్నప్పటికీ దాని కిందనుంచి భారీ వెహికల్స్వెళ్లే పరిస్థితి లేదు. దాంతో పెద్దపల్లి –- నిజామాబాద్ రైలు మార్గంలో నీరుకుళ్ల వద్ద ఆర్వోబీ నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు రూ. 15 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆర్వోబీ నిర్మాణానికి 8 ఎకరాల 20 గుంటల భూసేకరణ కోసం పెద్దపల్లి జిల్లా రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు అందజేశారు. భూసేకరణతో కలుపుకొని ఆర్వోబీ నిర్మాణానికి రూ. 20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.
కొంచెం ముందు కట్టి ఉంటే..
మానేరు నదిపై వేగురుపల్లి, నీరుకుళ్ల గ్రామాల మధ్య కట్టిన బ్రిడ్జి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల కిందికి కట్టి ఉంటే ఎలాంటి ఆర్వోబీ అవసరం లేకుండానే ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. సుల్తానాబాద్మండలంలోని గట్టెపల్లి, కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల మధ్య కడితే కరీంనగర్జిల్లాలోని ఉటూరు, చల్లూరు, మామిడాలపల్లి గ్రామాలకు కనెక్టివిటి అయ్యేది. ఆఫీసర్లు ముందుగా ఆలోచన చేసి ఇలా బ్రిడ్జి కట్టి ఉంటే రూ. 20 కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు ఆర్వోబీ కట్టాల్సిన అవసరం ఉండేది కాదు.
For More News..