కొత్తగూడెంలో దాహం..దాహం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  జిల్లా కేంద్రానికి కిన్నెరసాని నుంచి భగీరథ నీళ్లు అందకపోవడంతో అరకొరగా వచ్చే సింగరేణి నీళ్లే దిక్కవుతున్నాయి. నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ఆఫీసర్ల ప్రణాళికా లోపంతో మిషన్​భగీరథ నీళ్లు పూర్తిస్థాయిలో అందలేని దుస్థితి ఏర్పడింది. ప్రస్తుత మండుటెండల్లో నల్లా నీళ్లు ఎప్పుడొస్తాయోనని పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు. నీటి సరఫరా లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మున్సిపల్​ ఆఫీసర్లు అప్పుడప్పుడు సప్లై చేస్తున్నారు. పట్టణవాసులకు శాశ్వత నీటి ఎద్దడి నివారణకు రూ.130కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గత ఆర్నెళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఈ ప్రతిపాదనలు రికార్డులకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ ఒక్క పైసా రిలీజ్ కాకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ.40కోట్లతో చేపట్టిన వాటర్​స్కీం మూడేళ్లు దాటినా పూర్తి కాలేదు. పట్టణానికి సీఎం కేటాయించిన రూ. 40కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేషన్​ సాంక్షన్​అడ్డంకిగా మారింది. ఈ వేసవిలోనైనా నీటిని సరఫరా చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలని కలెక్టర్ అనుదీప్​ జారీ చేసిన ఆదేశాలను ఆఫీసర్లు లెక్కచేయడంలేదు. 

నీటి సరఫరా ఉత్త మాటలే..

పట్టణవాసులకు ప్రతి రోజు నీటి సరఫరా చేస్తామంటూ పాలకులు తరుచూ చెబుతున్న అవి నీటి మూటల్లాగే మారాయి. వారానికోసారి కిన్నెరసాని నీటి సరఫరా చేస్తుండడంతో పట్టణ ప్రజలు తాగు నీటి కోసం తండ్లాడుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 22వేలకు పైగా కుటుంబాలు, లక్ష జనాభా ఉంది. అధికార లెక్కల ప్రకారంగా దాదాపు 9,800లకు పైగా నల్లా​ కనెక్షన్లున్నాయి. రోజుకు దాదాపు ప్రతి రోజు 13ఎంఎల్ డీ నీళ్లు సప్లై చేయాల్సి ఉంది. కాగా కేవలం 8 నుంచి 9ఎంఎల్​డీ మేర నీళ్లనే సరఫరా చేస్తున్నారు. వీటిలో లీకేజీలతో ద్వారా కూడా తాగునీరంతా వృథాగా పోతోంది. లీకేజీలను అరికట్టడంలో ఆఫీసర్లు, సిబ్బంది విఫలమవుతున్నారు. పట్టణవాసుల నీటి ఎద్దడి నివారణకు మున్సిపల్​డెవలప్ మెంట్ ప్రాజెక్ట్​ద్వారా దాదాపు రూ.44కోట్లతో చేపట్టిన పనులు ఐదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్​కొత్తగూడెం పర్యటనలో మున్సిపాలిటీకి రూ.40 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధుల్లో రూ.25కోట్ల తాగునీటి కోసం కేటాయించారు. దీనికి ప్రణాళికను కూడా రూపొందించారు. కాగా పనులు సాగడంలేదు. ఈ నిధులు వస్తే నీటి ఎద్దడి సమస్య తీరే అవకాశం ఉందని పలువురు కౌన్సిలర్లు అంటున్నారు. 

ట్యాంక్​ పూర్తయినా నీటి సరఫరా లేదు..

మరోవైపు మిషన్​భగీరథ గ్రిడ్​నుంచి రోజుకు కేవలం 2.5మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే మున్సిపాలిటీ తీసుకుంటోంది. మిషన్ భగీరథలో వేసిన పైప్​లైన్లకు ఇళ్ల నల్లాలకు కనెక్షన్లు ఇచ్చారు. నీటి సరఫరా మాత్రం కావడంలేదు. పట్టణంలోని రామవరంలో దాదాపు1000 కేఎల్ లీటర్ల కేపాసిటీతో నిర్మించిన ట్యాంక్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మైనర్​పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పనులను త్వరగా పూర్తి చేయించి వాటర్ సప్లై చేయించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ట్యాంక్​ను ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో ప్రజలకు నీటి తిప్పలు తప్పడం లేదు. మున్సిపల్​లో అందరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. 


నీళ్లు వారానికోసారే...


పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేయడంలో ఎమ్మెల్యే వనమాతోపాటు అధికార బీఆర్ఎస్​పాలకులు, ఆఫీసర్లు విఫలమయ్యారు. సీఎం ప్రకటించిన రూ.40 కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్​తెప్పించడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం రూ.45కోట్లతో చేపట్టిన పనులు ఇప్పటికీ సాగుతున్నాయంటే పాలకులు, ఆఫీసర్ల పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. తాగునీళ్ల కోసం నిధులడిగితే లేవనే పాలకులు సుందరీకరణ, ఇతరత్రా పనులకు మాత్రం దండిగా ఖర్చు పెడుతున్నారు.  
- వై.శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్​ సీపీఐ ఫ్లోర్ లీడర్

నీళ్ల కోసం  ఎప్పుడూ తిప్పలే..
నీళ్ల కోసం పట్టణ ప్రజలకు తిప్పలు  ప్రతి రోజు తప్పడంలేదు. రామవరంలో ట్యాంక్​కట్టి వదిలేశారు. ట్యాంక్​లోకి నీళ్లను సప్లై చేసి ఇబ్బందిని తీర్చాలని కౌన్సిల్​సమావేశంలో చర్చించినా ఫలితం లేదు. అధికారుల తీరులో కూడా మార్పు రావడంలేదు. వారు స్పందించి చర్యలు తీసుకోవాలి.  
- మునిగడప పద్మ, కౌన్సిలర్