- కెనడా, అమెరికా సైంటిస్టులు జాన్, జెఫ్రీలను వరించిన బహుమతి
- మెషీన్ లెర్నింగ్‌తో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు
- రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన
స్టాక్ హోం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కర్తలు జాన్ హోప్ ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌కు ఫిజిక్స్‌లో ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మెషీన్ లర్నింగ్‌తో టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కృషిచేసినందుకు వారిని నోబెల్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో నోబెల్ కమిటీ సభ్యురాలు ఎలెన్ మూన్స్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జాన్, జెఫ్రీని నోబెల్ ప్రైజ్‌కు ఎంపిక చేసిన విషయాన్ని వారికి ఫోన్ చేసి చెప్పామని ఆమె తెలిపారు. ‘‘భౌతికశాస్త్రంలో టూల్స్ ఉపయోగించి పవర్ ఫుల్ మెషీన్ లెర్నింగ్ కు ఆధారమైన విధానాలను ఆ ఇద్దరు అభివృద్ధి చేశారు. అలాగే ఫండమెంటల్ కాన్సెప్ట్ లను వాడి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్ వర్క్స్ (ఏఎన్ఎన్) ను వారు డిజైన్ చేశారు.
పెద్దపెద్ద డేటా సెట్స్ లలో ప్యాటర్న్ లను కనుగొనడానికి ఏఎన్ఎన్ లు తోడ్పడుతాయి. అలాగే ఫిజిక్స్ లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆ నెటవర్క్స్ దోహదపడ్డాయి. అంతేకాకుండా మన రోజువారి జీవితంలోనూ అవి భాగం అయ్యాయి. ఫేషియల్ రికగ్నిషన్, ల్యాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ లో ఆ నెట్వర్క్స్ ను వాడుతున్నాం” అని ఎలెన్ మూన్స్ వివరించారు. మెషీన్ లర్నింగ్, ఏఐ టెక్నాలజీ వెనుక ఆ ఇద్దరు చేసిన కృషికి గుర్తింపుగా జాన్, జెఫ్రీలకు నోబెల్ బహుమతి ప్రకటించామని ఆమె చెప్పారు. అయితే, ఆ టెక్నాలజీతో లాభాలు ఉండడంతో పాటు భవిష్యత్తులో సవాళ్లు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. మానవాళికి లబ్ధి కలగాలంటే ఆ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడాలని సూచించారు.
ఏఐ పితామహుడు హింటన్..
ఏఐ పితామహుడిగా జెఫ్రీ హింటన్ పేరు పొందారు. ఆయన కెనడా, బ్రిటన్ పౌరుడు. ప్రస్తుతం కెనడాలోని టొరంటోయూనివర్సిటీలో ఆయన పనిచేస్తున్నారు. తనను నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన విషయం తెలిసి షాక్ అయ్యానని, నోట మాటరాలేదని హింటన్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు నోబెల్ ప్రైజ్ వస్తుందని ఊహించలేదన్నారు. మానవాళిపై ఏఐ గొప్ప ప్రభావం చూపుతుందన్నారు. ఉత్పాదకత, హెల్త్ కేర్ రంగంలో భారీ మార్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఏఐను పారిశ్రామిక విప్లవంతో పోల్చవచ్చన్నారు. మేధో సామర్థ్యంలో మనుషులను ఏఐ మించిపోతుందని పేర్కొన్నారు. అయితే, ఏఐతో లాభాలు ఉండడంతో పాటు దుష్పరిణామాలు కూడా ఉన్నాయని హింటన్ పేర్కొన్నారు. ఇక జాన్ హోప్ ఫీల్డ్ అమెరికాలోని ప్రిన్స్ టన్ లో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరికీ రూ.8.30 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో వారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు.