సాహిత్యంలో రచయిత్రి హాన్ కాంగ్‎కు నోబెల్ పురస్కారం

సాహిత్యంలో రచయిత్రి హాన్ కాంగ్‎కు నోబెల్ పురస్కారం

2024 సంవత్సరానికి సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్య రంగానికి చెందిన అవార్డ్‎ విజేతను నోబెల్ కమిటీ ప్రకటించింది. సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసినందుకుగానూ దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‎ను నోబెల్ ప్రైజ్ వరించింది. హాన్ కాంగ్.. మానవ జీవితంలోని దుర్బలత్వంతో పాటు చారిత్రక విషాదాలను తన రచనల్లో కళ్లకు కట్టినట్లు చూపించారని పేర్కొన్న రాయల్ స్వీడిష్ అకాడమీ.. ఈ మేరకు లిటరేచర్‎లో ఆమెకు అవార్డ్ ప్రదానం చేయనున్నట్లు ఇవాళ (2024, అక్టోబర్ 10) ప్రకటించింది. విజేతకు ఆల్ఫెడ్ర్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 తేదీన విజేతకు నోబెల్ పురస్కారం అందజేయనున్నారు. 

అవార్డ్‎తో పాటు లక్ష మిలియన్ డాలర్ల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్థిక, వైద్య, సాహిత్యం, శాంతి) రంగాల్లో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏడాది అత్యున్నత నోబెల్ పురస్కారం ప్రదానం చేస్తారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే వైద్య, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సాహిత్య రంగాల్లో నోబెల్ కమిటీ అవార్డుల ప్రకటన చేసింది. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణతో పాటు జన్యు నియంత్రణనకు సంబంధించిన పరిశోధనలకు గానూ.. వైద్యశాస్త్రంలో శాస్త్రవేత్తలు విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. భౌతిక శాస్త్రంలో జాన్‌ హోప్‌ఫీల్డ్‌, జెఫ్రీ హింటన్‌లు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. 

కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్‌‎పై చేసిన కృషికి గానూ వీరికి నోబెల్ అవార్డ్ ప్రకటించారు. ప్రోటీన్ల ఆవిష్కరణలపై చేసిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో డేవిడ్ బేకర్‌, డెమిస్ హస్సాబిస్‌, జాన్ జంపర్‌ ముగ్గురిని నోబెల్ వరించింది. మిగిలిన ఆర్థిక, శాంతి రంగాల అవార్డ్ విజేతల పేర్లను అనౌన్స్ చేయాల్సి ఉంది. అక్టోబర్ 14వ తేదీ వరకు నోబెల్ అవార్డ్‎ల ప్రకటన కొనసాగనుంది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఈ ఏడాది డిసెంబర్ 10న నోబెల్ విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.