- అమెరికా శాస్త్రవేత్తలను వరించిన అత్యున్నత ప్రైజ్
- 2024 నోబెల్ బహుమతుల ప్రకటన మొదలు
- ఈ నెల 14 న శాంతి పురస్కారం ప్రకటనతో ముగింపు
- డిసెంబర్ 10న విజేతలకు జ్ఞాపికలు, ప్రైజ్ మనీ అందజేత
స్టాక్ హోం : వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం నోబెల్ ఈసారి అమెరికా సైంటిస్టులను వరించింది. జన్యువుల నియంత్రణకు సంబంధించిన మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరించినందుకు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్ కున్ లకు ఈ ఏడాది మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ కు ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. సోమవారం ఈమేరకు నోబెల్ కమిటీ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరుపై ప్రభావం చూపే సూక్ష్మమైన ఈ ఆర్ఎన్ఏ క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆవిష్కరణలకు దారిచూపుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.
మానవులతో సహా జీవుల పుట్టుక, ఎదుగుదల, వాటి పనితీరుకు సంబంధించి అత్యంత కీలకమైన ఆర్ఎన్ఏను ఆవిష్కరించినందుకు ఆంబ్రోస్, రవ్ కున్ లను ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది. కాగా, ప్రైజ్ మనీ కింద వారు 1 మిలియన్ డాలర్లు అందుకుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ ప్రైజుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమైంది. మంగళవారం సైన్స్, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం ఎకనామిక్స్.. చివరగా ఈ నెల 14న నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. కాగా, విజేతలకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా డిసెంబర్ 10న పురస్కారాలు ప్రైజ్ మనీ అందజేస్తారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధన..
హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఈ పరిశోధనకు ప్రొఫెసర్ విక్టర్ ఆంబ్రోస్ నేతృత్వం వహించారు. ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. జెనెటిక్స్ ప్రొఫెసర్ అయిన గ్యారీ రవ్కున్ కూడా తన పరిశోధనను మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో నిర్వహించారని నోబెల్ కమిటీ సెక్రెటరీ జనరల్ థామస్ పెర్ల్ మాన్ చెప్పారు. ప్రొఫెసర్ ఆంబ్రోస్, ప్రొఫెసర్ రవ్ కున్ లు ఇద్దరూ జన్యు లు, వాటి పరివర్తనాలపై నిశితంగా అధ్యయనం చేశారని పెర్లమాన్ వివరించారు.
జన్యువుల అభివృద్ధిని నియంత్రించడం ద్వారా వాటిని సరైన సమయంలో ఎదిగేలా చేయగలిగే వీలుందని వారు విశ్వసించారని చెప్పారు. ఇందుకోసం వారు రెండు రకాల పురుగులపై పరిశోధనలు చేశారని, ఈ పురుగులలో జన్యు పరివర్తనాలను, మార్పులకు లోనైన జన్యువులను గుర్తించడంతో పాటు వాటి పాత్ర ఏమిటనేది తెలుసుకునేందుకు దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ స్టడీలో ఆంబ్రోస్, రవ్ కున్ లు ఎంఆర్ఎన్ఏను గుర్తించారని వివరించారు. క్యాన్సర్ బాధితులలో వ్యాధికారక కణాలను గుర్తించి, ఎంఆర్ఎన్ఏ ద్వారా వాటి పరివర్తనాలను, ప్రభావాన్ని కట్టడి చేసే వీలుంటుందని తెలిపారు.