మిడిల్​ క్లాస్​నూ.. బాదాల్సిందే!

మిడిల్​ క్లాస్​నూ..  బాదాల్సిందే!

ప్రధానమంత్రి కిసాన్​ యోజన దేశంలో రైతాంగానికి చాలా మేలు చేసే పథకం అంటున్నారు అభిజిత్​ బెనర్జీ. ఎకనమిక్స్​లో నోబెల్​ బహుమతి పొందిన ఈ బెంగాలీ బాబు… కార్పొరేట్​ ​పన్నులను పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ పథకానికి ఉపయోగించుకోవాలని  సూచిస్తున్నారు. ఆర్థికవేత్తలైన  భార్య ఎస్తర్​ డఫ్లో, మైఖేల్​ క్రెమెర్​తో కలిసి ఈ పురస్కారాన్ని అభిజిత్​ అందుకోనున్నారు. దేశంలో రూరల్​ ఎకానమీని పెంచడానికి ఉపాథి హామీ పథకాన్ని రీడిజైన్​ చేయాలంటున్నారు. ‘గుడ్ ఎకనమిక్స్ ఫర్ హార్డ్ టైమ్స్ ’ పుస్తకం విడుదల కోసం మనదేశానికి  వచ్చిన అభిజిత్  ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.  మోడీ పాలనా విధానాలను అభిజిత్ ప్రశంసించారు. సహజంగా మోడీ విధానాలపై  క్రిటికల్ గా ఉండే ఈ బెంగాలీ బాబు, మీటింగ్​ తరువాత నవ్వుతూ బయటకు వచ్చారు. తాము జోకులేసుకున్నట్లు  మీడియాతో అభిజిత్ చెప్పారు. మిడిల్​క్లాస్​పైనా పన్నుల బరువు వేయాలంటున్న అభిజిత్​ బెనర్జీ చిట్​చాట్​లోని ప్రధానాంశాలు..

‘‘ఎకానమీని గాడిలో పెట్టడంకోసం మోడీ సర్కారు కార్పొరేట్ పన్నులను తగ్గించింది. అయితే, ట్యాక్స్​లు కట్టలేని పరిస్థితిలో కార్పొరేట్​ రంగం లేదు. ఏమాత్రం వీలున్నా  ఇప్పటికైనా కార్పొరేట్ పన్నుల తగ్గింపు నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉంది.కార్పొరేట్ పన్నులను తిరిగి పెంచడం ద్వారా వచ్చే ఆదాయాన్ని  ‘ ప్రైమ్ మినిస్టర్ కిసాన్’ ( పీఎం – కిసాన్) పథకానికి, ఎన్ ఆర్ ఈ జీ ఏ కు   ఉపయోగించుకోవచ్చు. ’’

 పీఎం–కిసాన్ స్కీంలోకి పేదలు

“పీఎం – కిసాన్ స్కీం చాలా మంచి పథకం.  ఇంత మంచి స్కీం పరిధిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. భూమిలేని నిరుపేదలను కూడా పీఎం– కిసాన్ స్కీం పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చొరవ చూపాలి. రైతులకిచ్చే కనీస మద్దతు ధర (మినిమం సపోర్ట్ ప్రైస్– ఎంఎస్పీ) వల్ల ఆశించిన స్థాయిలో గ్రామీణ ఆర్థిక రంగానికి మేలు జరగడం లేదు. ఎంఎస్పీ వల్ల రైతుల కు  మేలు జరుగుతుంది. రైతు కూలీలకు డిమాండ్ పెరుగుతుంది. ఎంఎస్పీకి  ప్రత్యామ్నాయంగా పీఎం–కిసాన్ ఉపయోగపడదు. రెండు స్కీమ్ లను కలిపి అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. రైతులు, రైతు కూలీలకు డబ్బులు అందుతాయి. ’’

ఎవరు ఖాళీగా ఉంటున్నారు!

‘‘దేశంలో చాలా మందికి ఉద్యోగాలు లేవన్న ప్రచారం నిజం కాదు.  30 ఏళ్లు పైబడ్డవారు  ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే, కేవలం సర్కారీ కొలువులనే ‘ఉద్యోగాలు’గా భావించే మైండ్ సెట్​తో ప్రజలు ఉన్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మరిన్ని ఉద్యోగాలను క్రియేట్ చేయాలంటే తయారీ రంగం పెరగాలి. కేంద్ర ప్రభుత్వం మాన్యుఫ్యాక్చరింగ్ రంగంపై దృష్టి పెట్టాలి.ఈ సెక్టార్​లో కొత్తగా ఉద్యోగాలు కల్పించడానికి బోలెడన్ని అవకాశాలున్నాయి.  కేంద్రం ఆ దిశగా ఆలోచించాలి.  ఎక్స్​పోర్ట్ ప్రమోషన్ జోన్లను పెంచాలి. వీటిని ప్రొడక్షన్​కు కూడా ఉపయోగించుకోవచ్చు.’’

 

ఆటో సెక్టార్​ని గట్టెక్కించొచ్చు

‘‘తరచూలే ఆఫ్స్​తో ఒడిదుడుకులకు గురవుతున్న ఆటో సెక్టార్​ను గాడిలో పెట్టడం పెద్ద కష్టం కాదు.   దీనికోసం ఒక పక్కా వ్యవస్థను ముందుగా తయారు చేసుకోవాలి. ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ లాభాల నుంచి కొంత అమౌంట్​ను పక్కకు తీసి ఫండ్​ ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫండ్​ను  లే ఆఫ్ లు ప్రకటించిన సమయంలో వర్కర్లకు సాయంగా అందించాలి. ’’

జీడీపీ ఓకే. కానీ …

‘‘టోటల్​గా చూస్తే  జీడీపీ ఒకే.  దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఇతర అంశాలను పారామీటర్స్​గా తీసుకుంటేమాత్రం ఇండియన్​ ఎకానమీ అంత సంతృప్తికరంగా లేదు. కార్పొరేట్ రంగం చెల్లించే పన్నుల ఆదాయాన్ని  సామాన్య రైతుల కోసం ఉపయోగించాలి. దీనివల్ల  వ్యవస్థ  కొంతమేర గాడిలో పడుతుంది. పన్నులు చెల్లించలేని దుస్థితిలో మన దేశంలోని కార్పొరేట్ వ్యవస్థ లేదు. కాబట్టి,  కార్పొరేట్ పన్నులను తగ్గిస్తూ  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. ఈ నిర్ణయాన్ని తిరగతోడటం ప్రాక్టికల్​గా సాధ్యం కాకపోవచ్చు. కానీ, సర్కార్ నిర్ణయం కరెక్ట్ కాదు.’’

ఫ్యామిలీకూడా ముఖ్యమే

తన పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ… ‘ ప్రొఫెషనల్ గా  ఎంత బిజీగా ఉన్నా నేను, ఎస్తర్ డఫ్లో కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తాం. పిల్లల బాగోగులు చూసుకుంటాం.  సోషల్ లైఫ్​లోనూ   యాక్టివ్​గానే ఉంటాం. ‘వర్క్​ ఫ్రం హోం’ పద్ధతిని మేమిద్దరం ఫాలో అవుతాం. ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు మాత్రం చాలా రోజుల పాటు ఇంటికి, పిల్లలకు దూరంగా ఉండి పూర్తిగా పనిలోనే కూరుకుపోతాం.’’

డబ్బున్నవాళ్లకేనా పన్నులు?

‘‘మన దేశంలో ఇన్​డైరెక్ట్​ ట్యాక్స్​ సిస్టమ్​ని సంస్కరించడంలో భాగంగా ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)’ తీసుకురావడం మెచ్చుకోదగ్గ విషయమే. దీనిని నేను స్వాగతిస్తున్నాను. మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. డబ్బులున్న వాళ్ల దగ్గరి నుంచే పన్నులు వసూలు చేయాలన్న విధానానికి కాలం చెల్లింది. చాలా దేశాల్లో మిడిల్ క్లాస్ మీదా పన్నులు వేస్తున్నారు. మిడిల్ క్లాస్​ నుంచి పన్నులు వసూలు చేసి… అన్ని విధాల మంచి సర్వీసు అందించాల్సిన పరిస్థితులు వచ్చాయి. చైనాలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. పల్లెల్లోని నిరుపేదలకు వంద రోజుల పని కల్పించే ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ( ఎన్ఆర్ఈజీఏ) రీ డిజైన్ చేయాలి.  రూట్ లెవెల్లో  పేద ప్రజలకు ఉపయోగపడే పథకాల్లో ఇదొకటి ’’.