టారిఫ్​లపై మాటల్లేవ్: మాపై ఎవరు ఎంతేస్తే.. మేమంత వేస్తం: ట్రంప్

టారిఫ్​లపై మాటల్లేవ్:  మాపై ఎవరు ఎంతేస్తే.. మేమంత వేస్తం: ట్రంప్
  • ఇదే భారత ప్రధాని మోదీకి స్పష్టంగా చెప్పాను
  • టారిఫ్​లపై తనతో ఎవరూ వాదించలేరని కామెంట్

వాషింగ్టన్ : టారిఫ్ ల నుంచి ఇండియాకు మినహాయింపుల్లేవని ప్రధాని నరేంద్ర మోదీకి తేల్చి చెప్పానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. టారిఫ్ లపై ఇక మాటల్లేవని, ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని ఆయన పేర్కొన్నారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ తో కలిసి ట్రంప్ మంగళవారం రాత్రి ఫాక్స్ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల మోదీతో భేటీలో టారిఫ్ ల అంశంపై జరిగిన చర్చ వివరాలను వెల్లడించారు. ‘‘టారిఫ్ ల విషయంలో ప్రధాని మోదీకి స్పష్టంగా చెప్పాను. మరోసారి ఆలోచించాలని ఆయన కోరారు. 

కానీ ‘మీరు మాపై ఎంత పన్ను వేస్తున్నారో.. మేం కూడా మీపై అంతే పన్ను వేస్తాం’ అని ఆయనకు తేల్చి చెప్పాను” అని వివరించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ ఎక్కువ పన్నులు వేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మస్క్ స్పందిస్తూ.. ‘‘ఆటోమొబైల్ సెక్టార్ వస్తువులపై 100 శాతం విధిస్తున్నది” అని తెలిపారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. ‘‘అవును.. నిజమే. అది ఇంకా చాలా తక్కువ. అంతకుమించిన పన్నులు విధిస్తున్నది. 

వేరే దేశాలు కూడా ఇట్లనే చేస్తున్నయ్. అందుకే మాపై వాళ్లు ఎంత పన్ను వేస్తే, మేం వాళ్లపై అంత పన్ను వేస్తామని చెప్తున్నాం. ఒకవేళ నేను 25 శాతం విధిస్తానని చెబితే.. ‘అమ్మో.. అది దారుణం’ అని అంటారు. అందుకే ఇక అలా చెప్పేదేమీ లేదు. వాళ్లు ఎంత పన్ను వేస్తే, మేం అంతే వేస్తాం. ఈ విషయంలో ఇక మాటల్లేవ్.. నాతో ఎవరూ వాదించలేరు. ఇలా చేస్తేనే, వాళ్లు టారిఫ్​లు ఆపేస్తారు” అని అన్నారు.

ఇండియాకు మేమెందుకు డబ్బులు ఇవ్వాలి? 

మన దేశానికి నిధులను నిలిపివేస్తూ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు. మన దేశంలో ఓటింగ్ శాతం పెంచేందుకని బైడెన్ హయాంలో కేటాయించిన నిధులను డోజ్​రద్దు చేసింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘భారత్​కు మేమెందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వారి వద్ద డబ్బు ఉంది. నాకు ఇండియాపై, ప్రధాని మోదీపై గౌరవం ఉంది. కానీ అక్కడ ఓటింగ్ శాతం పెంచేందుకు మిలియన్ డాలర్లు ఇస్తే.. మరి ఇక్కడి పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించారు.

ట్రంప్​కు తప్పుడు సమాచారం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌‌స్కీ

కీవ్: రష్యా అందిస్తున్న తప్పుడు సమాచారమనే స్పేస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుక్కుపోయారని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌‌స్కీ అన్నారు. తనకు ఉక్రెయిన్ ప్రజల మద్దతు తగ్గిపోతున్నదని ట్రంప్ చేసిన కామెంట్ పూర్తిగా అబద్ధమని తెలిపారు. బుధవారం అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్‌‌తో సమావేశానికి ముందు జెలెన్‌‌స్కీ మీడియాతో మాట్లాడారు. "ఉక్రెయిన్ నాయకుడిగా నా ప్రజామోద రేటింగ్ 4 శాతంగా ఉందనేది రష్యా నుంచి వచ్చిన తప్పుడు సమాచారం. అందులో డొనాల్డ్​ ట్రంప్ ఇరుక్కుపోయారు" అని పేర్కొన్నారు.