- టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా నియామకం
- సీనియారిటీ, ఫ్యామిలీ కనెక్షన్స్‌తో ఆయనే టాప్ ప్రయారిటీ
- బిజినెస్‌లో ఇప్పటికే సత్తా చాటిన నోయెల్
న్యూఢిల్లీ: సర్ రతన్ నావాల్ టాటా వారసుడిగా ఆయన పిన్ని కొడుకు నోయెల్ టాటా (67) నియమితులయ్యారు. టాటా గ్రూప్ కంపెనీలను టాటా సన్స్ మేనేజ్ చేస్తుండగా, టాటా సన్స్‌లో 66 శాతం వాటా టాటా ట్రస్ట్‌ల చేతిలో ఉంది. టాటా ఫ్యామిలీ 14 ట్రస్ట్‌లను నిర్వహిస్తుండగా, ఇవన్నీ సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ల కింద పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి చైర్మన్‌గా, రతన్ టాటా వారసుడిగా నోయెల్ టాటా తాజాగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ రెండు ట్రస్ట్‌ల బోర్డులలో ట్రస్టీగా సేవలందించారు. నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్ కాగా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11 వ చైర్మన్.
రతన్ కంటే 20 ఏండ్లు చిన్నోడు..
రతన్ టాటా, ఆయన బ్రదర్ జిమ్మీ టాటా తల్లిదండ్రులు నావాల్ టాటా– సోనూ కమిసరియట్ వీరి చిన్నతనంలోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావాల్ టాటా ఫ్రెంచ్–స్విస్ బిజినెస్‌వుమెన్ సిమోన్ దునొయెర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి కొడుకే నోయెల్ టాటా. రతన్ టాటా కంటే నోయెల్ 20 ఏళ్లు చిన్నవాడు. టాటా గ్రూప్ కంపెనీల్లో కీలక పొజిషన్లలో పని చేస్తున్నారు. బిజినెస్ మ్యాన్‌గా తన సత్తా చాటుకున్నారు.
కీలక కంపెనీల్లో కీలక పొజిషన్‌లో..
నోయెల్ టాటా యూకేలోని ససెక్స్ యూనివర్సటీలో డిగ్రీ చేశారు. ఐఎన్‌ఎస్‌ఈఏడీలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. టాటా గ్రూప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో చైర్మన్‌గా 2010 నుంచి 2021 వరకు పని చేశారు. ఆయన హయాంలో ఈ కంపెనీ టర్నోవర్ 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లను దాటింది. టాటా గ్రూప్ రిటైల్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్‌లో ఎండీగా పనిచేశారు కూడా.
ఈ కంపెనీ 1998 లో కేవలం ఒక స్టోర్‌తో మొదలవ్వగా , ప్రస్తుతం 700 స్టోర్లను మేనేజ్ చేస్తోంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ఈ కంపెనీ రూ.3,300 కోట్ల రెవెన్యూ, రూ.712 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో చైర్మన్‌గా పనిచేస్తున్న నోయెల్ టాటా, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకూ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్ కంపెనీల్లో వైస్ చైర్మన్ సేవలందిస్తున్నారు.
మిస్త్రీ ఫ్యామిలీతో దగ్గర సంబంధం..
నోయెల్ టాటా షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ మనవరాలు, సైరస్ మిస్త్రీ సిస్టర్ ఆలూ మిస్త్రీని పెళ్లి చేసుకున్నారు. టాటా సన్స్‌లో సుమారు 18 శాతం వాటా మిస్త్రీ ఫ్యామిలీకి ఉందని గుర్తుంచుకోవాలి. నోయెల్– ఆలూ దంపతులకు ముగ్గురు పిల్లలు.. నెవెల్లి, మాయా, లేహ్. వీరు కూడా టాటా కంపెనీల్లో కీలక పొజిషన్లలో ఉన్నారు. నెవెల్లీ టాటా ట్రెంట్, స్టార్ బజార్‌లలో, మాయా టాటా క్యాపిటల్‌లో కీలక పొజిషన్లలో పనిచేస్తున్నారు. లేహ్ ఇండియన్ హోటల్స్ కంపెనీలో వైస్ ప్రెసిండెంట్‌గా ఉన్నారు.
గతంలో అవకాశం వచ్చినట్టే వచ్చి..
టాటా సన్స్ చైర్మన్‌గా రతన్ టాటా రిటైర్ అయ్యే రెండేళ్ల ముందు అంటే 12 ఏళ్ల కిందట ఆయన సక్సెసర్ కోసం వెతుకులాట మొదలైంది. ఆ టైమ్‌లో నోయెల్ టాటాను కూడా సెలక్షన్ కమిటీ పరిశీలించింది. కానీ, ఆయన్నీ నియమించలేదు. ఈ సెలక్షన్ కమిటీలో ఎన్‌ఏ సోనోవాలా, ఆర్‌కే కృష్ణకుమార్, లార్డ్ భట్టాచార్య, షిరిన్ బారుచా, సైరస్ మిస్త్రీ ఉన్నారు. ఇందులో సైరస్ మిస్త్రీ మినహా మిగిలిన వారు నోయెల్‌కు ఎక్స్‌పీరియెన్స్ లేదని ఆయన్ని తిరస్కరించారు. రతన్ టాటా కూడా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు.
సైరస్ మిస్త్రీని ఎన్నుకున్నారు. ఆ తర్వాత సైరస్ మిస్త్రీ, రతన్ టాటా మధ్య సంబంధం చెడింది. సైరస్‌ను 2016 లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. మైనార్టీ షేర్‌హోల్డర్లను అణిచివేస్తున్నారని, తమ పదవులను తప్పుగా వాడుతున్నారని సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్‌పై కేసు వేశారు కూడా. 2021 లో మిస్త్రీ ఆరోపణలను సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పని చేస్తున్నారు.
ఈ అవకాశం దొరకడం గౌరవంగా భావిస్తున్నా. రతన్ టాటా, టాటా గ్రూప్ ఫౌండర్ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా. బాధ్యతలను మోస్తాను. సమాజానికి మేలు చేయడంలో టాటా ట్రస్ట్‌లు యూనిక్‌గా ఉన్నాయి. మా డెవలప్‌మెంట్, దాతృత్వ సేవలను కొనసాగించడానికి, దేశ నిర్మాణంలో మా పాత్రను పోషించడానికి కట్టుబడి ఉన్నాం. - నోయెల్ టాటా