ఎంబీసీ కార్పొరేషన్ కులాల లిస్ట్‌లో లేని వేరే కులాలకు చెందినవారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం సంచార జాతి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మగౌరవం పెంచినట్టా..? ఆత్మగౌరవం తీసినట్టా..? సంచార జాతి కులాల ఫెడరేషన్స్‌కు పాలక వర్గాలను గడిచిన 10 ఏండ్ల కాలంలో ఏర్పాటు చేయలేదు. బడ్జెట్ కూడా అలాట్ చేయలేదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతి ప్రజలను చులకనగా చూసి నిర్లక్ష్యం చేసి మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గల సంచార జాతి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది.
సంచార జాతి కులాలు ఇవి..
బాలసంతు, బహురూపి, బుడబుక్కల, దాసరి, దొమ్మర, గంగిరెద్దులవాళ్ళు, జంగం, జోగి, కాటిపాపల, మొండివారు మొండిపట్ట, మొండిబండ, వంశరాజ్, పాముల, పార్థి, పంబాల,పెద్దమల్లోళ్లు, వీరభద్రయ, గుడాల, కంజెరబట్ట, రెడ్డిక, కెంపుమారే, నోక్కార్, పరికిముగ్గుల, యాట, చోపేమారి, కైకడి, జోషినందివాళ, మందుల, కూనపులి, పట్ర, పాలఏకరి, రాజన్నల, గోత్రాల, బుక్కఅయ్యవారు, కశికాపాడి, సిద్ధుల, సిక్లి గర్, అనాథలు. ఈ కులాలందరినీ కలిపి వీరి సామాజిక, ఆర్థిక సమగ్ర అభివృద్ధి కోసమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 16 ద్వారా 26 జులై 2018న బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 35 సంచారజాతి బీసీ ‘ఏ’ గ్రూప్‌లో ఉన్న కులాలను, రాష్ట్రంలో ఉన్న అనాథలను కలిపింది. వీరి అభివృద్ధి కోసమే అని 3 ఆగస్టు 2018న తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌గా పేరు పెట్టింది ప్రభుత్వం.
రాష్ట్రంలో ఉన్న సంచారజాతి కులాలను తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలుగా ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కార్యాలయాలకు సమాచారం ఇచ్చింది. ఆనాటినుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సంచారజాతి కులాలు ఎంబీసీ కులాలుగా రూపాంతరం చెందాయి. ఫర్వాలేదు, సంతోషమే. కానీ, ఆలా చేయడం వల్ల ఈ సంచార జాతి కులాలకు చేసిన న్యాయం ఏది? అంతా మోసమే జరుగుతున్నది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్‌గా కార్పొరేషన్లో ఉన్న కులాలకు ఇవ్వకుండా వేరే కులాల వారికి ఇచ్చారు. ఎలుకల గుంపులో పిల్లిని తోలినట్టు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
రూ.పది కోట్లు దాటని సాయం
ఈ సంచారజాతి కులాల ఎంబీసీ కార్పొరేషన్ కోసం రాష్ట్ర ప్రజలు గొప్పగా చెప్పుకోవడానికి 2018 నుంచి 2023–-24 బడ్జెట్ సమావేశాల ద్వారా రూ.3033 వేల కోట్లు అలాట్ చేశారు. చాలా సంతోషం. కానీ గడిచిన ఏడు ఏండ్ల కాలానికి మొదటిసారి,1419 మందికి 50 వేల ఆర్థిక సహాయం, రెండవసారి 30 మందికి ఈ - ఆటోలకు లక్ష చిల్లర ఆర్థిక సహాయం, మూడోసారి సంచార జాతుల జాతీయ సెమినార్ నిర్వహించడం కోసం 5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఇలా పూర్తి మొత్తం దాదాపుగా రూ.10 కోట్లు దాటలేదు.
10 ఎకరాల భూమి, భవనానికి నిధులు ఎక్కడ?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచారజాతి కులాల కోసం ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలం 2018లో కేటాయించి 2022 లో ఎంబీసీ కార్పొరేషన్ సీఈఓ పేరు మీద అలాట్ మెంట్ ఇచ్చారు. 2023లో నిర్మాణం కోసం శిలాఫలకం వేశారు. నిర్మాణం కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించారు. కానీ, ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా రెండోసారి కూడా ఎంబీసీలో లేని వేరే ఇతర సామాజిక వర్గానికి చెందినవారిని నియమించి సంచార జాతి ప్రజలను కించపరిచారు.
ఇప్పుడు చైర్మన్ ఇచ్చినవారికీ కులపరంగా ఫెడరేషన్ ఉంది. దాని పాలక వర్గం పూర్తిగా ఖాళీగా ఉంది. వారి ఫెడరేషన్ వదిలి, ఎంబీసీ కార్పొరేషన్ కు చైర్మన్‌గా నియమించడం ఏమిటి ? ఆ ఫెడరేషన్ ఎంబీసీ కార్పొరేషన్లో విలీనం చేస్తే బాగుండేది కదా! ఇలా అవమానం చెందేవారు కాదుకదా! సంచారజాతుల పేరు పెట్టి ఈ జాతి ప్రజలకు ఏమీ చేయడం చేతకాదు. వీరు మొత్తం పరాన్న జీవులుగా పశువులు, పక్షులు, జంతువుల మాదిరి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందువల్ల సంచార జాతి కులాల పరిస్థితి రాష్ట్రంలో అన్నమో.. రామచంద్ర అన్నట్టుగా ఉంది.
ఓటుతోనే పోరాడుతాం
ఈ సంచార జాతి ప్రజలతో ఏమైతదనే చులకన భావంతో ప్రభుత్వ ఆలోచన చేసి సంచార జాతి ప్రజలను ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశారనేది నిజం. మమ్మల్ని చులకనగా చూసినవారికి చురకలు పెట్టే ప్రయత్నం చేద్దామని సంచార జాతులు ఆవేశంతో ఉన్నాయి. సంచార జాతి ప్రజల మాటకు విలువ లేకుంటే ఓటుకు విలువ ఉంటుంది కదా..? ఆ ఓటుతోనే పోరాటం మొదలు పెడదామని ఆ జాతులు సిద్ధమౌతున్నాయి.
బీసీ బంధు ఏది?
నిన్నగాక మొన్న బీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి, అందులో రాష్ట్రంలో ఉన్న సంచార జాతులకు ముందు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేసి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఆ సహాయం కాడికి వచ్చేసరికి మంజూరు చేసిన చెక్కులు కుడా ఇవ్వడం లేదు ( సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఇవ్వకుండా ఆపారు. కారణం ఏమీ చెప్పడం లేదు ). అధికారులను, హుస్నాబాద్ ఎమ్మెల్యేను అడిగితే కూడా సిద్దిపేట కలెక్టర్ ఆపమన్నాడు అన్నారు.
ALSO READ : ఊపిరి తీయడం కూడా ప్రాణాంతకం.. కాలుష్య కోరల్లో ఢిల్లీ
కారణం ఎవ్వరికీ తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో సంచారజాతి కులాలకు చెందిన ప్రజలు కేవలం 12,500 మంది మాత్రమే లక్ష రూపా యల ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెప్పుతున్నాయి. కానీ, నేటి వరకు రాష్ట్రంలోని సంచార జాతి కులాల ప్రజలకు ఇచ్చింది కేవలం 50 మంది లోపు మాత్రమే. ఇది ఎంత మోసమో ఆలోచన చేయండి సామాజిక మేధావులారా! ఎక్కడున్నది సంక్షేమం? ఎక్కడున్నది సామాజిక అభివృద్ధి? ఎక్కడున్నది సామాజిక న్యాయం? ఇది నమ్మక ద్రోహం కాదా..?
- శ్రీనివాస్ తిపిరిశెట్టి, జాతీయ కో-ఆర్డినేటర్,
సంచార జాతుల కో ఆర్డినేషన్ కమిటీ