PAK vs WI 2025: నోమన్ అలీ హ్యాట్రిక్.. తొలి పాక్ స్పిన్నర్‌గా సరికొత్త చరిత్ర

PAK vs WI 2025: నోమన్ అలీ హ్యాట్రిక్.. తొలి పాక్ స్పిన్నర్‌గా సరికొత్త చరిత్ర

వెస్టిండీస్ తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ తో సత్తా చాటాడు. శనివారం (జనవరి 25) వెస్టిండీస్ బ్యాటర్లను తన స్పిన్ మాయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టాడు. హ్యాట్రిక్ నమోదు చేసి పాక్ తరపున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్ గా రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో పాకిస్థాన్ తరపున ఒక స్పిన్ బౌలర్ హ్యాట్రిక్ తీయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓవరాల్ గా పాకిస్థాన్ తరపున హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్ గా నిలిచాడు. హ్యాట్రిక్ అనంతరం అలీ సంబరాలు ఓ రేంజ్ లో సాగాయి.    

ఇన్నింగ్స్ 12 ఓవర్ లో తొలి మూడు బంతులకు నోమన్ అలీ వికెట్లను తీసుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతికి జస్టిన్ గ్రీవ్స్ స్లిప్ లో బాబర్ అజామ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో బంతికి టెవిన్ ఇమ్లాచ్‌కి ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. మూడో బంతికి కెవిన్ సింక్లెయిర్ స్లిప్ లో బాబర్ అజామ్‌కి చిక్కాడు. దీంతో అతని హ్యాట్రిక్ పూర్తయింది. అంతక ముందు విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ ను వెనక్కి పంపి తొలి వికెట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం 4 వికెట్లు పడగొట్టాడు. 

Also Read :- సంజు దెబ్బకు తుది జట్టులో స్థానం కోల్పోయిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్

నోమన్ అలీతో పాటు సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్ రాణించడంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో పీకల్లోతు కష్టాల్లో పడింది. 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తొలి రోజే ఓటమి అంచున నిలిచింది. కావెం హాడ్జ్(21),గుడాకేష్ మోతీ(27*) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. మిగిలినవారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. వెస్టిండీస్ బౌలర్లలో నోమన్ అలీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సాజిద్ ఖాన్ రెండు వికెట్లు తీసుకోగా.. కషీఫ్ అలీ,అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.