నామ్​కే వాస్తే  ఎంబీసీ కార్పొరేషన్

నామ్​కే వాస్తే  ఎంబీసీ కార్పొరేషన్

సంచార జాతులను గుర్తించి.. వాటిని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు తెలంగాణ సర్కారు చేసిన ఆలోచనకు ఆ జాతుల ప్రజలంతా సంబురపడిపోయినారు. సంచార జాతుల ఆర్థిక అభివృద్ధి కోసమని చెప్పి నాలుగేండ్ల క్రితం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడంతో తమ ఆత్మాభిమానాన్ని నిలబెట్టే ప్రభుత్వం వచ్చిందనుకున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఆగకుండా అసెంబ్లీలో వందల కోట్ల బడ్జెట్ కూడా ప్రకటించింది టీఆర్ఎస్ సర్కారు. అక్కడి వరకూ అంతా బాగానే ఉన్నా ఆ నిధుల మంజూరు, సక్రమంగా ఖర్చు పెట్టే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది. రోజుకో ఊరు తిరుగుతూ పనులు దొరక్క బిచ్చమెత్తుకుని పొట్టపోసుకునే ఈ జాతుల వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వం ఆలోచనలు మంచిగానే ఉన్నా ప్రాక్టికల్ గా అమలు కాకపోవడం శాపంగా మారింది. దీనిని గుర్తించి స్థిర నివాసాలు, ఉపాధి, ఆర్థిక సాయం చేస్తే తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ బతికే హక్కునైనా కల్పించాలని సంచార జాతుల బిడ్డలు కోరుకుంటున్నారు.

మొదలు పెట్టడంతోనే ఖతం!

తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న 35 సంచార జాతుల కులాలను ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చింది. ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్న అనాథలను కూడా ఎంబీసీ కార్పొరేషన్ కింద చేర్చింది. అనాథలను కలిపి మొత్తం 36 కులాలకు గుర్తింపు కల్పించి.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చేరేలా చూస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. సంచార జాతులపై ప్రభుత్వానికి ఎనలేని ప్రేమ ఉందనిపించేలా అసెంబ్లీలో వందల కోట్ల బడ్జెట్ కూడా ప్రకటించింది. కానీ మొదట్లోనే ఈ జాతుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టింది. ఎంబీసీ కొర్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టే అర్హత సంచార జాతి బిడ్డలకు లేదన్నట్లుగా ఈ కులాలకు సంబంధం లేని వ్యక్తిని కూర్చోబెట్టారు. అయినా చైర్మన్ ఎవరైతేనేం మాకోసం, మా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక చక్కటి మార్గం ఏర్పాటు చేసిందన్న సంతోషం వ్యక్తం చేశారు. కానీ, చైర్మన్ నియామకంతోనే అంతా అయిపోయింది. కనీసం కార్పొరేషన్ కు డైరెక్టర్లను కూడా నియమించలేదు. జిల్లాల వారీగా సంచార జాతుల జనాభాను గుర్తించి, వారి అభివృద్ది కోసం చేయాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందించే ప్రయత్నమూ జరగలేదు.

2 వేల కోట్లలో లబ్ధిదారులకు చేరింది 7 కోట్లే

సంచార జాతులను వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేస్తామంటూ చెప్పిన ప్రభుత్వం.. మొదట్లో ఆ దిశగానే ప్రకటనలు చేసింది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశాక మొదటి మూడేండ్లలో మొత్తం రూ.2,433 కోట్లు బడ్జెట్ లో పెట్టింది. కానీ ఆ మొత్తంలో మంజూరైంది రూ.350 కోట్లు మాత్రమే. అందులోనూ రూ.89.79 కోట్లు మాత్రమే కార్పొరేషన్ ఖాతాలో జమ చేశారు.  మాటల్లో గొప్పగా చెప్పినా.. చేతల్లో మాత్రం సంచార జాతుల పట్ల చిన్న చూపు చూపించారు. కనీసం ఆ నిధులనైనా లబ్ధిదారులకు సరైన రీతిలో అందేలా చైర్మన్, అధికారులు ప్రయత్నం చేయలేదు. కార్పొరేషన్ పెట్టిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా1419 మందికి మాత్రమే రూ.50 వేల చొప్పున రూ.7 కోట్ల 9 లక్షల 50 వేలు పంపిణీ చేశారు. మిగతా గ్రాంట్ కు సంబంధించిన వివరాలు, మొత్తం 36 కులాల్లో ఎవరికి లబ్ధి చేకూర్చారన్నది కార్పొరేషన్ అధికారులు చెప్పడం లేదు. అడిగితే వివరాలు లేవన్న సమాధానమే వస్తోంది. ఇక ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో దాదాపు కోటి రూపాయలకు పైగా చైర్మన్ జీతాలకే సరిపోయాయి. అలాగే ఆఫీసు ఖర్చుల పేరుతో మరో రూ.2.3 కోట్లు వాడేశారు.

‘అంతరించిపోయే జాతి’నైనా గుర్తించండి

దేశంలో ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వాన్నమైన స్థితిలో సంచార జాతులు బతుకుతున్నాయి. కనీసం ఒక గుర్తింపు అంటూ లేదు. వన్య ప్రాణులు, పక్షులకు ఉన్న పాటి విలువ కూడా సంచార జాతుల బిడ్డలకు ఇవ్వరా? అని ఈ జాతి బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. అంతరించి పోయే జాతుల వన్య ప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునే తరహాలోనైనా సంచార జాతులను గుర్తించాలని కోరుతున్నారు. నేరగాళ్లుగా చూసే బానిస బతుకులకు విముక్తి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సంచార జాతులకు చెందిన స్థిర నివాసాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు సాయం చేయాలి. ఆర్థికంగా చేయూతనిచ్చి.. బిచ్చమెత్తే దుస్థితి నుంచి విముక్తి కల్పించాలి. ఆత్మాభిమానంతో బతికే స్వేచ్ఛ కల్పించాలి. జీవన భృతి కల్పించేలా ప్రత్యేక శ్రద్ధతో పథకాలు రూపకల్పన చేయాలి.  ఎంబీసీ చైర్మన్ పదవీ కాలం ముగిసి ఏడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికైనా సంచార జాతుల బిడ్డకు చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు జిల్లాల వారీగా ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ జాతుల్లో పుట్టిన బిడ్డలు కూడా అందరితో సమానంగా బతికేలా చర్యలు తీసుకోవాలి. నాలుగేండ్లుగా ఏ ప్రయోజనం లేకుండా ఉన్న కార్పొరేషన్ కు ఇకనైనా మంచిగా నిధులు కేటాయించి వాటిని సక్రమంగా వాడేలా చూడాలి.

మేలు చేయాలని లేదు..

ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు పేరుకే జరిగింది తప్ప.. సంచార జాతులకు జరిగిన మేలు సున్నానే. జిల్లాల వారీగా డైరెక్టర్లను నియమించి.. ఈ కులాలకు ఏం చేయాలన్న దానిపై ప్రణాళికల రూపకల్పన కూడా చేయలేదు. ఏ జిల్లాల్లో ఎంత మంది సంచార జాతుల వారున్నారన్నది ఈ రోజుకూ తెలియదు.  ఇక ఆ జాతులను పట్టించుకుని, వారికి ప్రత్యేకంగా ఏవైనా పథకాలు అందేలా చూడాలన్న ఆలోచన అసలే లేదు. ఈ కులాల వారు రోజుకో ఊరు తిరుగుతూ ఉపాధి పనుల కోసం తిప్పలు పడుతున్నా పట్టించుకునేవాళ్లే లేరు. అనుమాన దృష్టితో చూస్తూ ఎవరూ పనిచ్చే వాళ్లు కాదు. దీంతో బిచ్చమెత్తుకోవడమే జీవనోపాధిగా మారుతోంది. నాలుగు ఇండ్లలో ఇంత అన్నం కోసం చేయి చాపి.. వచ్చిన దాంతో పిల్లల కడుపు నింపి, మిగిలితే పెద్దలు తినడం లేదంటే పస్తులు పడుకోవడమే. సంచార జాతులు కావడంతో స్థిర నివాసం కూడా ఉండదు. ఏ రోజు ఏ ఊరిలో ఉంటే అక్కడే రోడ్ల పక్కన, మోరీలపైన గుడారాలేసుకుని రాత్రికి పడుకోవడం, తెల్లారి మళ్లీ ఎలా తిండి గడవాలన్న ఆలోచనతో బతుకు పోరాటం సాగిస్తుంటారు. అడుక్కుతినడమే వృత్తి అంటే తాము ఎలా బతకాలని సంచార జాతుల బిడ్డలు ప్రశ్నిస్తున్నారు. – శ్రీనివాస్ తిప్పిరిశెట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం

for more News….

ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్

గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​