సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్​పై నామినేషన్​ వార్

సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్​పై నామినేషన్​ వార్
  • మూడు నియోజకవర్గాల్లో నిరసనకు రెడీ అవుతున్న వివిధ వర్గాలు
  • గజ్వేల్, సిద్దిపేటలో 200 చొప్పున నామినేషన్లు వేసేందుకు అమరుల కుటుంబాలు ప్లాన్​
  • కేసీఆర్​కు వ్యతిరేకంగా ప్రచారం
  • హుస్నాబాద్​లో 100 నామినేషన్లకు నిర్వాసితుల ఏర్పాట్లు
  • బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనూ 100 చొప్పున నామినేషన్లకు కసరత్తు

సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్​ సొంత జిల్లా సిద్దిపేటలో బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా వివిధ వర్గాలు పావులు కదుపుతున్నాయి. ఇక్కడి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా రూలింగ్​పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. కేసీఆర్​ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్​తో పాటు మంత్రి హరీశ్​రావు పోటీ చేస్తున్న సిద్దిపేట స్థానాల్లో తెలంగాణ అమరుల కుటుంబసభ్యులతో  ఒక్కో స్థా నంలో 200 చొప్పున నామినేషన్లు వేయించేందుకు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక,  దళిత సంఘాల జేఏసీ కసరత్తు చేస్తున్నది. హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ డిమాండ్ల సాధన కోసం  గౌరవెల్లి నిర్వాసితులు, బీసీల సమస్యల పరిష్కారం కోసం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 1‌‌‌‌00 చొప్పున  నామినేషన్లు వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే గజ్వేల్​లో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

అమరుల కుటుంబాలకు న్యాయం కోసం..

తెలంగాణ రాష్ట్ర సాధనలో 1836 మంది అమరులైనా ప్రభుత్వం 540 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందజేసింది.  మిగిలిన 846 కుటుంబాలకు సహాయం చేయడంలో సర్కారు ఫెయిల్​ అయిందని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆరోపిస్తోంది. వీరితో పాటు  ఉద్యమంలో ఆత్మహత్యకు యత్నించి వికలాంగులైన మరో 176 మందిని ఆదుకొని వారి కుటుంబాలను గౌరవించాలని డిమాండ్ ​చేస్తోంది. సర్కారు పట్టించుకోకపోవడంతో నిరసనగా ఎన్నికల బరిలో నిలవాలని జేఏసీ లీడర్లు నిర్ణయించారు. తద్వారా అమరుల కుటుంబాల పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దిపేట, గజ్వేల్ తోపాటు కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనూ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని అమరుల కుటుంబాలు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో బస ఏర్పాటుచేసుకొని  ఇంటింటి ప్రచారం చేస్తున్నాయి. నవంబర్ 3నుంచే  దళిత జేఏసీ, ఉద్యమ కారుల ఐక్య వేదిక తరపున నామినేషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నాయి.

డిమాండ్ల సాధన కోసం గౌరవెల్లి నిర్వాసితులు..

హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.  భూ పరిహారాలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి అడుగు జాగలు, పశువుల కొట్టాలు, 18 సంవత్సరాలు నిండిన యువతులకు పరిహారాలు చెల్లించే విషయంలో తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు వాపోతున్నారు. తమ డిమాండ్లపై ఆందోళన నిర్వహిస్తే పోలీసులతో లాఠీఛార్జీ చేయించడంతో పాటు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం, ఇండ్లను బలవంతంగా కూల్చివేయడంపై భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్​ కుమార్ పై నామినేషన్లు వేసి నిరసన తెలపడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు.   సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ నియోజకవర్గంగా ఉన్న హుస్నాబాద్​ను టార్గెట్​ చేయడం ద్వారా తమ పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని నిర్వాసితులు భావిస్తున్నారు.

బీసీ డిమాండ్లపై 100 నామినేషన్లు

బీఆర్ఎస్​ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు హుస్నాబాద్ నుంచి 100 నామినేషన్లు దాఖలు చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం సన్నాహాలు చేస్తోంది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు అధికార పీఠానికి దూరంగా ఉంటున్నారని, ఈ విషయంలో ప్రజలను చైతన్యపరిచేందుకే హుస్నాబాద్​లో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం లీడర్లు చెప్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు  పచ్చిమట్ల రవీందర్​ గౌడ్ నేతృత్వంలో నామినేషన్ల దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో తమ వాటా సీట్ల కోసం  ఎన్నేండ్లు పోరాడాలని,  ఇకపై ఎన్నికల్లో తామే నిలబడి సత్తా చూపాలని, ఆ దిశగా అందరినీ సమాయత్త పరిచేందుకు 100 నామినేషన్లు వేస్తామని సంఘం నేతలు  చెప్తున్నారు. నామినేషన్లు దాఖలు చేయాలనే తమ నిర్ణయానికి బీసీ వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని  పచ్చమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. ఏది ఏమైనా సిద్దిపేటల జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వివిధ డిమాండ్ల పై భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలుకు సన్నాహాలు జరుగుతుండడం పొలిటికల్​ సర్కిల్స్​లో ఆసక్తి రేపుతోంది.

అమరుల కుటుంబాలకు అండగా నిలవాలి

రాష్ట్ర సాధన కోసం 1386 మంది ప్రాణాలు త్యాగం చేస్తే ప్రభుత్వం కొందరికే సాయం చేయడం బాధాకరం. ప్రభుత్వానికి ఎన్ని మార్లు విన్నవించుకున్నా పట్టించుకోక పోవడంతో ప్రజల దృష్టికి సమస్యను తేవడం కోసం ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నాం.  సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలలో నేను నామినేషన్ వేస్తా.
- రఘుమారెడ్డి, అమరుల కుటుంబాల
ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

న్యాయమైన డిమాండ్ల కోసమే..

బీసీల న్యాయమైన డిమాండ్ల కోసమే హుస్నాబాద్​లో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినం.  బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, లోన్లు అందజేయాలని,  పేద బీసీలను ఆదుకోవాలని కోరుతున్నం. ప్రజల ముందు చర్చకు పెట్టేందుకే ఎన్నికల్లో వంద నామినేషన్లు వేయాలని భావిస్తున్నాం.  
- పచ్చిమట్ల రవీందర్ గౌడ్,  బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు